Idream media
Idream media
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. మిగతా రాష్ట్రాల సంగతి అటుంచితే బెంగాల్ పోరు ప్రత్యేకతను సంతరించుకుంటోంది. గడిచిన రెండేళ్ల వరకు రాష్ట్రంలో ఏమాత్రం ఉనికి లేని బీజేపీ గత లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసి టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి సవాలు విసిరింది. అప్పటి నుంచీ ఇప్పటి వరకూ రాష్ట్రంలో టీంఎసీ, బీజేపీ మధ్య ఉప్పు – నిప్పులా రాజకీయాలు కొసాగుతున్నాయి. గత లోక్ సభ ఎన్నికల్లో 18 ఎంపీ స్థా నాలను కైవసం చేసుకుని దూకుడు పెంచిన బీజేపీ అప్పటి నుంచే అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి పెట్టింది. పార్టీ హేమాహేమీలందరూ దఫదఫాలుగా బెంగాల్ లో పర్యటిస్తూ వస్తున్నారు. దీనికి తోడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అమిత్ షా వ్యూహరచన, దేశంలో బీజేపీ పవనాలు బలంగా వీయడం కారణంగా బెంగాల్‌లో ఈసారి కమలం జెండా ఎగురుతుందనే అంచనాలు ఎక్కువయ్యాయి. పెద్ద ఎత్తున టీఎంసీ నేతల్ని బీజేపీ చేర్చుకుంటూ మమతా పార్టీని రోజు రోజుకూ బలహీన పరుస్తున్నారు. మూడోసారి పగ్గాలు చేపట్టకుండా మమత కోటలో పాగా వేయాలని బీజేపీ మార్క్ రాజకీయాలతో రాష్ట్రంలో రాజకీయ అలజడి కి ఆజ్యం పోశారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ విడుదలైంది. బెంగాల్ లో 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించడంపైనే మమత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.
ఎనిమిది విడతలుగా బెంగాల్‌లో ఎన్నికలు నిర్వహిస్తామన్న ఈసీ ప్రకటనపై సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అసోంలో మూడు విడతలుగా, తమిళనాడులో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, బెంగాల్‌లో మాత్రం ఎందుకు ఎనిమిది విడతలుగా నిర్వహిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే తాము ఈసీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… బీజేపీ సౌకర్యం కోసమే ఈసీ ఇన్ని విడతలుగా ఎన్నికలు నిర్వహిస్తోందని ఆమె ఆరోపించారు. ‘‘ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సలహా మేరకే ఈ నిర్ణయమా? వారి ప్రచారాన్ని సులభతరం చేయడానికేనా? బెంగాల్ రాష్ట్రానికి ప్రచారానికి వచ్చే ముందే అసోం, తమిళనాడు ప్రచారాన్ని ముగించుకోవచ్చన్న భావనా? అలా కుదరదు. ఈ ఐడియా బీజేపీకి కలిసిరాదు. అలా కానివ్వం.’’ అంటూ మమత ఫైర్ అయ్యారు. అంతేకాకుండా ఒకే జిల్లాలో వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపైనా ఆమె మండిపడ్డారు. రెండు దశలుగా జిల్లాల్లో జరపాలని నిర్ణయించారు. సౌత్ 24 పరగణా జిల్లాలో తాము చాలా బలంగా ఉన్నాం. అక్కడ మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పార్ట్ 1, పార్ట్ 2 లాగా మాకు నేర్పిస్తున్నారు.’’ అని సీఎం మండిపడ్డారు. బీజేపీ వారు మతాల ఆధారంగా ప్రజలను విభజిస్తున్నారని, ఇప్పుడే ఆట ప్రారంభమైందని, ఆట ఆడి, ఆటలో గెలిచి చూపిస్తామని మమత ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, టీఎంసీ- బీజేపీల మధ్య ఈసారి పోరు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఎనిమిది విడతల్లో పోలింగ్ నిర్వహించేందుకు సీఈసీ సిద్ధమైంది. ఈ విషయం గురించి సీఈసీ సునీల్ అరోరా మాట్లాడుతూ.. ‘‘రాజకీయ పార్టీల పేర్ల ప్రస్తావన అనవసరం. శాంతి భద్రతలను ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో ఏడు విడతల్లో పోలింగ్ నిర్వహించినప్పుడు, ఈసారి ఎనిమిది విడతల్లో ఎన్నికల నిర్వహణ పెద్ద విషయమేమీ కాదు’’ అని పేర్కొన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో(2016) 294 స్థానాలకు గానూ టీఎంసీ 211, వామపక్షాలు 79 గెలుచుకోగా బీజేపీ కేవలం 3 స్థానాలకే పరిమితం అయిన విషయం తెలిసిందే.
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు నగరా మోగే సమయానికి కొన్ని గంటల ముందు పశ్చిమ బెంగాల్ కీలక ప్రకటన చేసింది. ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడానికి ముందే ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో సంక్షేమ పథకాలు ప్రకటించింది. రోజూవారీ కూలీల వేతనాన్ని పెంచుతామని బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ శుభవార్త చెప్పారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రోజూ వారీ వేతన కూలీలను మూడు కేటగిరీలుగా విభజించింది. నైపుణ్యాల ఆధారంగా వారి వేతన పెంపును ఖరారు చేసింది. కాగా రాష్ట్రంలో మొత్తం 56,500 మంది కార్మికులు(అన్‌స్కిల్డ్ లేబర్- 40,500, సెమి స్కిల్డ్ లేబర్- 8000, స్కిల్డ్ లేబర్- 8000) ఈ పథకం ద్వారా లబ్ది పొందనున్నారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.