Idream media
Idream media
గుంటూరు జిల్లా చిలకలూరి పేట నియోజకవర్గంలో రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా జరిగిన పరిణామాలతో పేటలో రాజకీయం వేడెక్కింది. వైఎస్సార్‌సీపీ నేతల అడ్డగింత, దాడులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు పేటలో ఏం జరుగుతోందోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.
చిలకలూరిపేటలో గత శాసన సభ ఎన్నికల్లో విడదల రజనీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పత్తిపాటిపుల్లారావుపై గెలుపొందారు. ఎన్నారై అయిన విడదల రజనీ రాజకీయాల్లోకి తెలుగుదేశం పార్టీ నుంచి అడుగుపెట్టారు. చిలకలూరిపేటలో పుల్లారావు అనుచరురాలుగా ఉన్నారు. 2019 ఎన్నికలకు కొన్ని నెలల ముందు వైఎస్సార్‌సీపీలో చేరి కో ఆర్డినేటర్ అయ్యారు. ఆ తర్వాత టికెట్ సాధించారు. అప్పటి వరకు వైఎస్సార్‌సీపీ కో ఆర్డినేటర్‌గా మర్రి రాజశేఖర్ ఉన్నారు. ఎన్నికల తర్వాత రజనీ, మర్రి రాజశేఖర్ రెండు వర్గాలుగా చీలిపోయాయి. మర్రి రాజశేఖర్‌కు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు అండగా ఉంటున్నారని సమాచారం.
ఇరు వర్గాల మధ్య ఉన్న వర్గపోరు కోటప్పకొండ తిరునాళ్ల సందర్భంగా బయటపడింది. విడుదల రజనీ సొంత గ్రామం పురుషోత్తపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ వద్దకు బుధవారం ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు వచ్చారు. అయితే తాము ఆహ్వానించినా.. తమ ప్రభ వద్దకు రాకుండా.. గ్రామంలోనే మరొకరిప్రభ వద్దకు ఎంపీ రావడంతో విడుదల రజనీ మరిది గోపి, రజనీ వర్గీయులు ఎంపీకారును అడ్డుకున్నారు. చేతులతో కారును బాదుతూ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ ఘటన జరిగిన మరుసటి రోజు ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై రాళ్ల దాడి జరిగింది. విద్యుత్ ప్రభను కోటప్పకొండకు తరలించి వస్తుండగా జరిగిన దాడిలో ఎమ్మెల్యే మరిది గోపికి స్వల్ప గాయాలయ్యాయి. ఆ సయమంలో కారులో ఎమ్మెల్యే లేరు. అయితే ఈ దాడి టీడీపీ నేతలు చేశారని విడుదల రజనీ ఆరోపిస్తోంది. నేరుగా ప్రత్తిపాటి పుల్లారావును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి రాజకీయం కావాలంటే చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని హెచ్చరికలు పంపుతున్నారు.
అయితే ఎమ్మెల్యే రజనీ కారుపై దాడికి తమకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడుతూ దాడిని ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్సార్‌సీపీలోనే రెండువర్గాలు ఉన్నాయని, వారే దాడికి పాల్పడ్డారంటూ పుల్లారావు చెబుతున్నారు. ఎంపీ కారును ముందు రోజు అడ్డుకోవడంతోనే ఎమ్మెల్యే కారుపై దాడి జరిగిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
ఇరు వర్గాలు ఎవరి వాదనలను వారు వినిపిస్తుండగా.. అసలు ఎమ్మెల్యే కారుపై దాడి చేసింది ఎవరన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది. చిలకలూరిపేటలో ఆది నుంచి కమ్మసామాజికవర్గానిదే ఆధిపత్యం. ఏ పార్టీ నుంచైనా ఆ సామాజికవార్గానికి చెందిన వారే ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు. 1999లో ప్రత్తిపాటి పుల్లారావు, 2004లో మర్రి రాజశేఖర్, 2009, 2014లో ప్రత్తిపాటి పుల్లారావులు గెలుపొందారు. 2019లో బీసీ వర్గానికి చెందిన విడదల రజనీ గెలిచారు. తమ సామాజికవర్గం ఆధిపత్యం ఉన్న నియోజకవర్గంలో బీసీ వర్గానికి చెందిన మహిళ ఎమ్మెల్యే కావడంతో జీర్ణించుకోలేకపోతున్నారని విడుదల వర్గం అంటోందట. అందుకే అందరూ ఏకమై ఎమ్మెల్యేను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొంటున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పేటలో రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.