iDreamPost
iDreamPost
ప్రస్తుతం ప్రధాని హోదాలో ఉన్నా, అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా కూడా నరేంద్ర మోడీ పలుమార్లు గడ్డుస్థితిని ఎదుర్కొన్నారు. అయినా తన మార్క్ రాజకీయాలతో వాటి నుంచి గట్టెక్కారు. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మోడీ అంటే గిట్టని వారికి ఆయన వైఖరి నచ్చకపోయినప్పటికీ ప్రస్తుతం మోడీ కి బలమైన అభిమానుల్లో కూడా తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన రెండు మూడు నెలలుగా జరుగుతున్న పరిణామాలు, ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు గమనిస్తుంటే ఎన్డీయే 2 కూడా యూపీఏ 2 మాదిరిగా ప్రజా వ్యతిరేక దిశలో సాగుతుందనే సంకేతాలు బలపడుతున్నాయి.
బీజేపీకి బలమైన స్థావరాలను కోల్పోతోంది. ఇప్పటికే హర్యానాలో మిత్రపక్షం మద్ధతు లేకుండా ప్రభుత్వం నిలబడని పరిస్థితి ఏర్పడింది. ఆ వెంటనే మహారాష్ట్రలో విశ్వసనీయ మిత్రపక్షం కూడా దూరం కావడంతో అధికారం కోల్పోవాల్సి వచ్చింది. జార్ఖండ్ ఫలితాలు కూడా బీజేపీ పెద్దలకు చెంపపెట్టుగా మారాయి. ఇక ఇప్పుడు ఢిల్లీ పీఠం దక్కించుకోగలమనే ధీమా కనిపించడం లేదు. ఆ వెంటనే బీహార్, బెంగాల్ వంటి కీలక రాష్ట్రాల్లో పరిస్థితి ఏమవుతుందోననే కలవరం కనిపిస్తోంది.
తాజాగా మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజాతీర్పు బీజేపీ కి వ్యతిరేకంగా ఉంది. చివరకు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ నాగపూర్ ని కూడా ఆపార్టీ కోల్పోయింది. కాంగ్రెస్ పుంజుకోగా బీజేపీ ఢీలా పడాల్సి వచ్చింది. అదే సమయంలో దేశమంతా ఉద్యమ కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ఎన్నార్సీ వ్యతిరేక ఆందోళనలో వివిధ పక్షాలు తోడవుతున్నాయి. విద్యార్థులు. ముస్లీంలకు తోడుగా సెలబ్రిటీలు చేరుతున్నారు. దాంతో ఈ పరిణామాలు పాలకపక్షానికి మింగుడుపడే అవకాశం కనిపించడం లేదు.
ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా..
దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. పైకి ఎన్ని ఢాంబికాలు పలికినా ఈ ఏడాది జీడీపీ గడిచిన దశాబ్దంన్నర కాలంలో అత్యల్పంగా ఉంటుందనే అభిప్రాయం ప్రభుత్వానికి చెందిన ఆర్థిక నిపుణుల నుంచే వినిపిస్తోంది. ఇది సామాన్యుల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీస్తుందనడంలో సందేహం లేదు. ఆగ్రహజ్వాలలు ఇప్పటికే వీధుల్లో కనిపిస్తున్నాయి. సార్వత్రిక సమ్మెకు ప్రజల నుంచి లభించిన మద్ధతు దానికో ఉదాహరణ. నిరుద్యోగం పెచ్చరిల్లుతోంది. ఉపాధి అవకాశాలు నీరుగారిపోవడంతో యువతలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. వివిధ ఉద్యమాల్లో పెద్ద సంఖ్యలో కదులుతున్న నవతరం దానికి ప్రతిస్పందనగానే భావించాల్సి ఉంటుంది.
అంతర్జాతీయంగానూ ఆటంకాలే..
దేశంలోనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలు కూడా మోడీ సర్కారు కష్టాలు రెట్టింపు చేసేలా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ మేఘాలు ఎక్కడికి దారితీస్తాయన్నది అర్థం కాకుండా ఉంది. దాడులు, ప్రతిదాడులు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతీకారేశ్ఛ మరింత పెరిగితే ఆయిల్ మంటలు చెలరేగుతాయి. దేశ ఆర్థిక స్థితిని మరింత దిగజార్చడమే కాకుండా పెరుగుతున్న ప్రతీ బ్యారెల్ ధర సామాన్యుడి జేబు గుల్ల చేసే ప్రమాదం ఉంటుంది. దానికారణంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత మరింత పెరగడం అనివార్యం అవుతుంది.
రాజకీయంగా, ఆర్థికంగా, అంతర్జాతీయంగా వరుసగా సమస్యలు చుట్టుముడుతున్న వేళ మోడీ ప్రభుత్వం తమ అస్త్రాలకు మరింత పదును పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కశ్మీర్, అయోధ్య వంటి అంశాలను ముందుకు తెచ్చారు. అయినా దేశమంతా శాంతియుతంగా సాగింది. చివరకు ఎన్నార్సీని మాత్రం ప్రజలు సహించే పరిస్థితి కనిపించడం లేదు. అసోంలో ఆఖరికి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా కొందరు తమ దగ్గర తగిన పత్రాలు లేవనే కారణంతో డిటెన్షన్ క్యాంపులకు తరలివెళ్లాల్సిన దుస్థితి దాపురించడంతో ఆ రాష్ట్రంలో అధికార పార్టీ ఆగమాగం అవుతోంది. దేశమంతటా అలాంటి స్థితి తీసుకురావాలని ఓవైపు ప్రయత్నం చేస్తూ మరోవైపు అలాంటి ఆలోచనే లేదని ప్రధాని చెప్పడం వెనుక ప్రభుత్వ రక్షణాత్మక పరిస్థితిని అద్దంపడుతోంది.
గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా తన పీఠానికి ప్రమాదం ఉందని గ్రహించిన ప్రతీసారి ప్రజలను తనవైపు మళ్లించుకోవడానికి మోడీ వివిధ రకాల ఎత్తులు వేశారు. కానీ ఈసారి అలా సాధ్యం అవుతుందా అన్నది సందేహంగానే చెప్పవచ్చు. దేశమంతటా దిగజారుతున్న పరిణామాల్లో మతం చుట్టూ కొత్త కాక రాజేసి, గట్టెక్కాద్దామనే ఎత్తులు ఫలిస్తాయా అన్నది ప్రశ్నార్థకం. అలాంటి సమయంలో మోడీ వ్యవహారం ఎలా ఉండబోతోందన్న దానిని బట్టి ప్రభుత్వం పట్టు నిలుపుకుంటుందా లేదా అన్నది ఆధారపడి ఉంటుంది. మోడీ-షా ద్వయం వ్యూహాలకు ఎదురు ఉంటుందా..లేక వారే ఎదురొడ్డలేక వెనుదిరగాల్సి ఉంటుందా అన్నదానికి కాలమే సమాధానం చెప్పబోతోంది. కానీ ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వ పెద్దలు మాత్రం విషమ పరీక్షలకు సన్నాహలు కావాల్సి ఉంటుందనడంలో సందేహం లేదు.