iDreamPost
android-app
ios-app

ఫలితం లేని మొక్కుబడి అమరావతి పోరాటం

  • Published Mar 06, 2020 | 5:10 AM Updated Updated Mar 06, 2020 | 5:10 AM
ఫలితం లేని  మొక్కుబడి అమరావతి పోరాటం

అమరావతి పేరుమీద పోరాటం నేటికి 80వ రోజుకు చేరింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన చేయగానే రాజధాని అమరావతిలోని 29 గ్రామాల రైతు కుటుంబాలు ఆందోళన చేపట్టాయి. అమరావతి నగరాన్ని ప్రతిపాదించిన చంద్రబాబు ఆయన నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ అమరావతి ఉద్యమాన్ని పూర్తిగా భుజాన వేసుకున్నాయి.

గడచిన 80 రోజులుగా అమరవాటిపేరుతో జరుగుతున్న ఉద్యమం తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఒక సామాజిక వర్గానికి చెందిన రైతుల భాగస్వామ్యంతోనే నడుస్తోంది. రాజధానికి 29 వేలమంది రైతులు భూములు ఇచ్చారు. రాజధానిలో 29 గ్రామాలు ఎంపిక చేసి రాజధాని నగరంగా ప్రకటించారు. భూములిచ్చిన 29 వేలమంది రైతులు ఒక్కొక్కరు ఉద్యమంలో పాల్గొన్నా 29 వేలమందితో ప్రతిరోజూ ఉద్యమం నడుస్తుండేది. లేదా సమస్య తీవ్రమైనది అనుకుంటే భూములిచ్చిన 29వేల రైతుల కుటుంబాలనుండి భార్యా, భర్త, ఇద్దరు పిల్లలు చొప్పున ఉద్యమంలో పాల్గొంటే లక్ష 16 వేలమంది ప్రతిరోజూ ఉద్యమంలో కనిపించాలి.

ఇవన్నీ కాదు మూడురాజధానుల నిర్ణయం వల్ల 29 గ్రామాల ప్రజలు నష్టపోయారు అనుకుంటే 29 గ్రామాల్లో కలిపి 2011 నాటి జనాభా లెక్కల ప్రకారం లక్ష మూడువేలమంది జనాభా ఇంటికి ఒక్కరుగా ఉద్యమంలో పాల్గొన్నా అది రోజుకు లక్షమందితో సాగి ప్రభుత్వం మెడలు వంచేది. మొత్తం లక్ష మూడువేల జనాభాలో ఈ ఉద్యమంలో ప్రతిరోజూ పాల్గొంటున్నది కేవలం మూడు నుండి ఐదు వందలమంది మాత్రమే. ఏ రోజు, ఏ సమయంలో మందడం దీక్షా శిబిరం వద్దకు వెళ్ళినా కనిపించేది ఈ అతితక్కువ మంది మాత్రమే.
అమరావతి ఉద్యమం పేరుతో భారీగా నిధులు సేకరించి, రాజకీయ అండతో, ప్రవాసాంధ్రుల పెట్టుబడి, నాయకత్వంలో కొందరు రైతులు మాత్రమే ఉద్యమం చేస్తున్నారు అనడానికి ఇంతకన్నా నిదర్శన అవసరం లేదు.

అమరావతి నిర్ణయించింది, అక్కడ పెట్టుబడులు పెట్టింది కేవలం ఒక వర్గమే అనేది సుస్పష్టం. ఇక్కడ ప్రపంచ స్థాయి నగరం నిర్మిస్తానని చెప్పింది చంద్రబాబు నాయుడు. ఆయన ప్రణాళికకు మద్దతుగా అక్కడ పెట్టుబడులు పెట్టింది ఆ వర్గమే. ప్రవాసాంధ్రులతో పాటు స్థానికంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆ సామాజిక వర్గ పెట్టుబడిదారులు చంద్రబాబుకు మద్దతుగా, ఆయనో విజనరీ అని ప్రపంచానికి చాటిచెప్పేందుకు ఇక్కడ పెట్టుబడులు పెట్టారు.

అమరావతి బాండ్లు కానీ, అమరావతి ఇటుకలు కానీ, హ్యాపీ నెస్ట్ అపార్టుమెంటులో ప్లాట్లు కానీ అంత వేగంగా, అంత సులువుగా మార్కెటింగ్ అయ్యాయి అంటే అది కేవలం ఆ ఒక్క వర్గం చేసిన ప్రయత్నమే తప్ప సాధారణ ప్రజల ప్రమేయంతో జరిగింది కాదు.

ఇక్కడ నాలుగు పంటలు పండే జరీబు భూములు మినహా మిగిలిన ఏ భూమీ ఎకరం ఐదులక్షల రూపాయలకు కొనేవారు లేరు అమరావతి ప్రకటనకు ముందు. అలాంటిది 2014 డిసెంబర్ లో అమరావతి ప్రకటన రాగానే ఈ భూముల విలువ ఎకరం రెండు కోట్ల నుండి అత్యధికంగా 8 కోట్లరూపాయలకు కొనుగోలు జరిగింది. రైతులు తమకున్న భూముల్లో 75 శాతం ఈ ధరకు అమ్ముకొని మిగిలిన 25 శాతం భూమిని మాత్రమే ప్రభుత్వానికి భూసమీకరణ పధకంలో భాగంగా ఇచ్చారు. ఈ 29 గ్రామాల్లో 75 శాతం భూములు కొనుగోలు చేసింది కూడా ఒక వర్గం వారే.

ఇక భూసమీకరణలో ప్రభుత్వానికి ఇచ్చిన భూమికి బదులుగా రైతులు ప్రభుత్వం నుండి కౌలు పొందుతూ మరో వైపు వాణిజ్య, నివాస అవసరాలకు తమవాటాగా ప్లాట్లు కూడా కోట్ల రూపాయలు తెస్తాయని ఆశపడ్డారు. అమ్ముకున్న భూములు కోట్లు తెచ్చాయి. తమ వాటాగా వచ్చే ప్లాట్లు కూడా కోట్లు తెస్తాయి అని ఆశపడి ఇప్పుడు భంగపడ్డ “రైతులు” ఉద్యమం అంటూ, రాష్ట్ర ప్రగతి అంటూ, తమ త్యాగాలు అంటూ రోడ్డెక్కారు. షాపింగ్ మాల్స్ చుట్టూ, స్టార్ హోటళ్ళలో కిట్టీ పార్టీలు చేసుకుంటూ కాలక్షేపం చేసే మహిళలు కూడా ఇప్పుడు రోడ్డెక్కి అమరావతి అంటూ ఉద్యమం చేస్తున్నారు.

మరోవైపు చంద్రబాబు కోసం, చంద్రబాబును సమర్ధుడు అంటూ ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టిన అదే సామాజిక వర్గానికి చెందిన ప్రవాసాంధ్రులు ఇప్పుడు అమరావతి కోసం ప్రపంచంలో కనిపించిన ప్రతి గడపా తొక్కుతున్నారు. ప్రతి తలుపు తడుతున్నారు.

ఆంధ్ర ప్రదేశ్ ఒక రాష్ట్రం అని, దాని పాలనా వ్యవహారాలు ఆ రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుందనే స్పృహ కూడా లేకుండా ఏకంగా ఐక్యరాజ్యసమితికి, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఈ వివాదం తీసుకెళ్లడం చూస్తేనే వీళ్ళ ఆత్రం ఎందుకో, వీళ్ళ పోరాటం ఎందుకో ప్రజలకు తెలుస్తోంది.

ఏ ఐక్యరాజ్యసమితిని అడిగి చంద్రబాబు అమరావతిని నిర్ణయించారు? ఏ అంతర్జాతీయ న్యాయస్థానం చంద్రబాబును పరిపాలన హైదరాబాద్ నుండి అమరావతికి తరలించమని చెప్పింది? ఈ స్పృహ కూడా కోల్పోతే ఉద్యమాలు ఇప్పుడు అమరావతిలో జరుగుతున్నట్టే కనిపిస్తాయి.