iDreamPost
iDreamPost
కరోనా కారణంగా కుదేలైన రంగాల్లో నాన్‌వెజ్ ఉత్పత్తులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఫౌల్ట్రీ సంబంధిత ఉత్పత్తుల వినియోగం దారుణంగా పడిపోయింది. దీంతో పలు చోట్ల కోళ్ళ ఫారాల నిర్వహణ కష్టరమై, చిన్న, మధ్య తరహా ఫారమ్స్‌లోని కోళ్ళను కేజీ రూ. 30లకు పంపిణీ చేసిన ఘటనలున్నాయి. మరికొన్ని చోట్ల ఉచితంగా కూడా పంపిణీ చేసేసారు. వాస్తవానికి ఈ పరిశ్రమకు కరోనా కారణంగా నష్టం కొనసాగిందనే చెప్పాలి. అంతకు ముందు భారీ ఎత్తున కోళ్ళు చనిపోవడానికి వేరే వైరస్ కారణమన్న ప్రచారం విస్తృతమైంది. ఆ తరువాత కరోనా దెబ్బ తగిలి నష్టాలకు కొనసాగింపుగా నిలిచింది.
అయితే పరిశ్రమకు జరుగుతున్న నష్టాన్ని గుర్తించిన అసోసియేషన్‌లు కోళ్ళద్వారా కరోనాతోపాటు ఎటువంటి వ్యాధులు వ్యాప్తిచెందవని విస్తృత ప్రచారం చేసారు. తూర్పుగోదావరి జిల్లాలోనైతే కోడి మాంసంతో వివిధ రకాల వంటకాలు కూడా తయారు చేసి ఉచితంగా భోజన ఏర్పాట్లు కూడా చేయాల్సి వచ్చింది. అయినప్పటి కోడిమాంసం వినియోగం దారుణంగా పడిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిభిన్నంగా మారాయి. గత యేడాది సగటు వినియోగానికి రెట్టింపుస్థాయిలో ఇప్పుడు కోడిమాంసం వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి రోజూ 20వేల టన్నులకుపైగా చికెన్‌ను అమాంతం లాగించేస్తున్నట్లుగా సమాచారం.
వినియోగం పెరిగిన నేపథ్యంలో ధరలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయ. సుమారు 40 రోజుల క్రితం రూ. 30 రూపాయలకు లభించిన కోడి ఇప్పుడు రూ. 180–240ల ధర పలుకుతోంది. అయినప్పటికి చికెన్ ప్రియులు ఏ మాత్రం లెక్కచేయడం లేదు. అలాగే రొయ్యలు, చేపలు, మేక మాంసం వినియోగం కూడా అదే స్థాయిలో విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పౌష్టికాహారం పొందేందుకు నాన్‌వెజ్ తోడ్పడుతుందని కొందరు వైద్యులు కూడా చెబుతుండడంతో నాన్‌వెజ్ అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు.
సాధారణంగా ఏప్రియల్, మే నెలల్లో ఎండల తీవ్ర కారణంగా నాన్‌వెజ్ వినియోగం తగ్గుతుంది. అయితే ఈ సారి అందుకు భిన్నంగా పరిస్థితి ఉండడం ఆయా వ్యాపార వర్గాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. లాక్డౌన్ నేపథ్యంలో కుటుంబ సమేతంగా ఇంటి పట్టునే ఉండడం, విభిన్న రకాల ఆహార పదార్ధాలు తినేందుకు దోహదం చేస్తుందని, అందులో భాగంగానే నాన్‌వెజ్ వినియోగం కూడా పెరుగుతోందన్న అంచనాలు కూడా ఉన్నాయి.