iDreamPost
android-app
ios-app

కరోనా వైరస్ కట్టడికి ప్రజలే సహకరించాలి…

కరోనా వైరస్ కట్టడికి ప్రజలే సహకరించాలి…

ప్రపంచంతో పాటు దేశాన్ని,తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న కరోనా ధాటికి దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ కేంద్ర ప్రభుత్వం విధించింది. ప్రజలు కూడా జనతా కర్ఫ్యూ ని విజయవంతం చేశారు. అత్యవసర సేవలు మినహా మిగిలిన సేవలను నిలిపివేసి తెలుగురాష్ట్రాలలో లాక్ డౌన్ ప్రకటించారు.

కానీ ఇదంతా ఒకరోజుకి మాత్రమే పరిమితం చేసి మరుసటి రోజు ప్రజలంతా యథేచ్ఛగా రోడ్లపైకి వచ్చి తిరగడం మొదలుపెట్టారు. పూర్తి లాక్ డౌన్ ప్రకటించిన హైదరాబాద్, విజయవాడ లాంటి నగరాల్లో ప్రజలు షేర్ ఆటోలు, తమ సొంత వాహనాలతో ప్రజలు బయట తిరగడంతో జనతా కర్ఫ్యూ సందర్భంగా నిర్మానుష్యంగా ఉన్న రోడ్లన్నీ రద్దీగా మారిపోయాయి. దాంతో ప్రధాని మోడీ కూడా ప్రజలంతా స్వీయ నిర్బంధంలో ఉండాలని బయట తిరగొద్దని, మనందరికోసం ఇళ్లకే పరిమితం కావాలని బయట తిరగొద్దని ప్రజలను విజ్ఞప్తి చేసారు.

లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో కొన్ని చోట్ల వ్యాపారులు వస్తువులు,కూరగాయల ధరలను అమాంతం పెంచి అమ్ముతున్నారు. అత్యవసర పనులపై మాత్రమే బయటకు రావాలని ప్రభుత్వాలు ప్రజలను హెచ్చరిస్తున్నాయి. ఇప్పటికే కరోనా కారణంగా చైనా,ఇటలీ,ఇరాన్,స్పెయిన్,అమెరికా లాంటి దేశాలు దారుణంగా నష్టపోయాయని అలాంటి పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలంటే ప్రజలు ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని నిపుణులు, అధికారులు హెచ్చరిస్తున్నారు.

సోషల్ డిస్టెన్స్ పాటించాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకరమైన కరోనా వైరస్ పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా వాడాలని ఆరోగ్యశాఖ ప్రజలను హెచ్చరిస్తోంది. ప్రజలు షేర్ ఆటోల్లో దగ్గరగా కూర్చుని ప్రయాణిస్తూ, గుంపులుగా ఒకచోట చేరితే వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందని కాబట్టి అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

కాగా తెలుగురాష్ట్రాల సరిహద్దులని నిలిపివేయడంతో వాహనాలు సరిహద్దుల్లో రోడ్లపై భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజలు కరోనా వైరస్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని, బయట అత్యవసరమైతే తప్ప బయట తిరగరాదని, ఇంటికే పరిమితమవ్వాలని అధికారులు నిపుణులు హెచ్చరిస్తున్నారు.