Idream media
Idream media
పెంగ్విన్ అనే పేరు వింటే చిన్న ముచ్చటైన పక్షి కళ్ల ముందు కదులుతుంది. పెంగ్విన్ సినిమా చూస్తే దీనికి విరుద్ధమైన జుగుప్స కలుగుతుంది.
అమెజాన్‌లో ఈ రోజు విడుదలైంది. ఇది థియేటర్లలో రాకపోవడం అదృష్టం. ఎందుకంటే థియేటర్‌లో ఆఫ్ చేయలేం, ఫార్వర్డ్ కొట్టలేం. తలనొప్పితో చచ్చేవాళ్లం.
డెరక్టర్లు రెండు రకాలుంటారు. ప్రతిభతో ఎప్పటికీ గుర్తుండేవాళ్లు. మానసిక వ్యాధిగ్రస్తులుగా గుర్తుండేవాళ్లు. మొదటి వ్యక్తి కేవీ రెడ్డి. ఆయన మాయబజార్ ఎపుడు చూసినా మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది. రెండో వ్యక్తి రాంగోపాల్‌వర్మ. ఆయన సినిమాల్లో ఎక్కువ భాగం జుగుప్సాకరంగా ఉంటాయి. ఈ మధ్య కూడా క్లైమాక్స్ తీసి వదిలాడు. 25 ఏళ్లుగా మనల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
ఇపుడు వర్మని గుర్తు చేసుకోవడం ఎందుకంటే ఆయన వాడి వాడి వదిలేసిన తుక్కు కథతో పెంగ్విన్ రావడం. ఈశ్వర్ కార్తీక్ అనే డైరెక్టర్ తన మొదటి సినిమాగా దీన్ని ఎంచుకోవడం. కీర్తి సురేష్ లాంటి గొప్ప నటి ఉండి కూడా ప్రేక్షకులు భయపడుతున్నారంటే , ఇక సినిమా ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
థ్రిల్ వేరు, జుగుప్స వేరు. హిచ్‌కాక్ సినిమాల్లో థ్రిల్ ఉంటుంది. పెంగ్విన్‌లో జుగుప్స ఉంటుంది.
సినిమా మొదలు కావడమే చాప్లిన్ వేషంలో ఉన్న ఒక ఆకారం ఒక చిన్న పిల్లవాడి తల నరుకుతుంది. అది కీర్తి సురేష్ కల.
ఇంకో సీన్‌లో రక్తంతో కూడిన శరీర భాగాలు, పురుగులు.
మరో సీన్‌లో గర్భవతిగా ఉన్న హీరోయిన్ పొట్టలో పిండం కదులుతూ ఉంటే, ఆ పిండాన్ని కత్తితో పొడవాలని చూసే చిన్న కుర్రాడు.
ఒక సీన్‌లో రక్తపు మరకలతో నిండిన గదిలో, శరీర భాగాలు నరుకుతున్న సైకో.
ఇవన్నీ మనుషులు చూసే సీన్స్ అంటారా? ఇలాంటి ఐడియాలు మానసిక రోగులకి కాకుండా మామూలు మనుషులకి వస్తాయా?
అసలే కరోనాతో ఇల్లు కదలాలంటే భయపడి చస్తుంటే ఇల్లలో కూడా బతకనివ్వరా?
పెంగ్విన్‌కి ఇంత హైప్ ఎందుకొచ్చిందంటే కీర్తి సురేష్ వల్ల. మహానటి తర్వాత సౌత్‌లో క్రేజ్ పెరిగింది. అందుకే ఈ సినిమాని తెలుగు, తమిళ్, మలయాళంలో వదిలారు.
తప్పి పోయిన బిడ్డ కోసం తపన పడే తల్లిగా కీర్తి అద్భుతంగా నటించింది. అయితే సినిమాలో ఆమె నటన మాత్రమే మనం చూడం కదా, అందుకే ఇది ఒక చెత్త థ్రిల్లర్‌గా మిగిలిపోయింది.
లోకంలో అసహజమైన మనుషులు ఉంటారు. వాళ్లనే పిచ్చోళ్లని అంటారు. వాళ్లు ఎక్కువగా మన మధ్య , కొందరు మాత్రమే ఆస్పత్రుల్లో ఉంటారు. సైకో కిల్లర్ అనేది చాలా పాత జానర్. దీనికి ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉంటారు. వాళ్ల మానసిక ధోరణి కూడా కొంచెం అనుమానాస్పదంగా ఉంటుంది. అయితే ఈ సినిమా వాళ్లకి కూడా నచ్చకపోవచ్చు.
చివర్లో వచ్చే ట్విస్ట్ మరీ ఘోరం. మనిషి పట్ల పూర్తిగా నమ్మకం, ప్రేమ, స్నేహం లేని వాళ్లు మాత్రమే ఆ రకం సీన్లు రాసుకుంటారు.
సినిమాలో మొదటి నుంచి ఆఖరి వరకూ పోలీసులు ఉంటారు కానీ, వాళ్లు పీకింది ఏమీ లేదు. ఒక కుక్క అన్నింటిని పరిష్కరిస్తుంది. ఓపిగ్గా విలన్లని కనిపెడుతుంది.
ఈ మధ్య వచ్చిన జ్యోతిక సినిమా “పొన్మగళ్ వందాళ్” కూడా చిన్న పిల్లలపై హింస ఇతివృత్తంగా వచ్చింది. అది కూడా బోర్ సినిమానే కానీ జుగుప్స లేదు.
థియేటర్లు మళ్లీ స్టార్ట్ అయ్యే వరకు ఇలాంటి లోబడ్జెట్ తుక్కుని మన మీదకి వదులుతారేమో.
నిజానికి మనల్ని భయపెట్టేవాళ్లు చాలా మంది ఉన్నారు.
కరోనా భయపెడుతోంది.
చైనా బెదిరిస్తూ ఉంది.
టీవీల్లో కనిపిస్తూ మోడీ భయపెడుతున్నాడు.
సగం జీతం ఇస్తానని కేసీఆర్ కూడా హడల్ గొడుతున్నాడు.
వీళ్లంతా చాలదని మీరు కూడా భయపెట్టే సినిమాలు ఎందుకు తీస్తున్నార్రా భయ్!
కొంచెం నవ్వించండ్రా సామీ.
నవ్వించే వాళ్లు లేక భయంతో చస్తున్నాం.
డస్ట్‌బిన్ తీసి పెంగ్విన్ అనే పేరు పెడితే ఎలా?