పెదరాయుడు గర్జన – రికార్డుల ఉప్పెన – Nostalgia

మనిషికి మనిషికి మధ్య అంతరం పెరుగుతోంది. టెక్నాలజీ గుప్పిట్లో మానవ సంబంధాలు అడుగంటి పోతున్నాయి.ఇది ఎంతటి పతనానికి దారి తీస్తుందో ఊహకు కూడా అందడం లేదు. కళ్ళెదుట పక్కవాడి ప్రాణం ప్రాణం పోతున్నా ఆఫీస్ టైం అయిపోతోందని పరుగులు పెడుతున్న యాంత్రిక జీవితంలో ఎమోషన్స్ కు చోటు దొరకడం కష్టమైపోయింది . దానికి తగట్టు ఇప్పుడొస్తున్న సినిమాలు కూడా తాత్కాలిక ఉపయోగాన్ని టార్గెట్ చేస్తూ డబ్బులు రాబట్టుకోవడమే పరమావధిగా అర్థం పర్థం లేని కాన్సెప్ట్స్ తో స్టాండర్డ్స్ ను తగ్గించడమే పనిగా పెట్టుకున్నాయి. క్లాసిక్, అల్ టైం లాంటి ఉపమానాలు జోడించే అర్హత దేనికీ ఉండటం లేదు. ;అలాంటిది పాతికేళ్ల క్రితమే మనుషుల మధ్య అనుబంధాలకున్న గొప్పదనాన్ని అద్బుతంగా తెరపై ఆవిష్కరిస్తూ ఉమ్మడి కుటుంబంలోని ఆనందాన్ని, పెద్దరికానికి ఇవ్వాల్సిన గౌరవానికున్న ప్రాశస్త్యాన్ని చక్కగా చూపించిన చిత్రమే “పెద రాయుడు”

నేపధ్యం

1994 లో తమిళ్ లో నాట్టమై అనే సినిమా ఒకటి వచ్చింది. గ్రామ పెద్ద షణ్ముగం, అతని తమ్ముడు పశుపతి గా శరత్ కుమార్ డ్యూయల్ రోల్ లో, ఫ్లాష్ బ్యాక్ లో వీళ్ళ తండ్రిగా విజయ్ కుమార్ నటించారు. ఈరోడ్ సుందర్ అందించిన కథకు కె.ఎస్.రవి కుమార్ దర్శకత్వం తోడై సిల్వర్ జుబ్లీ ఆడటంతో పాటు ఆ సంవత్సరంలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆర్.బి.చౌదరి నిర్మాత. ఆ సినిమా చూసి ఆకర్షితుడైన సూపర్ స్టార్ రజనికాంత్ వెంటనే తన స్నేహితుడు మోహన్ బాబు కు ఆఘమేఘాల మీద ఫోన్ చేసి ఆ హక్కులు కొనేలా చేసారు. అంతేకాదు చిన్నదైనా సరే సెకండ్ హాఫ్లో వచ్చే రాయుడు పాత్ర వేస్తానని హామీ ఇచ్చారు. అప్పటికే వరస ఫ్లాప్లతో సతమతవుతున్నారు మోహన్ బాబు. స్నేహితుడి మాట కాదనలేక కొనేసారు. రీమేక్ లో సిద్ధహస్తుడైన రవిరాజ పినిశెట్టి ని దర్శకుడిగా తీసుకున్నారు. లైఫ్ అండ్ డెత్ గేమ్ లాగా తన స్వంత బ్యానర్ మీదే ఈ సినిమా తీయాలని డిసైడ్ అయ్యారు కలెక్షన్ కింగ్. ఇక తర్వాత జరిగింది సువర్ణాక్షరాలతో లిఖించిన చరిత్ర.

కథ

పెదరాయుడు(మోహన్ బాబు)ఆ ఊరికి పెద్ద. ఎవరికి ఏ తగాదా, సమస్య వచ్చినా అతని తీర్పే వేదం. ఇద్దరు తమ్ముళ్ళు రాజా(మోహన్ బాబు), రవీంద్ర(రాజ రవీంద్ర). పెదరాయుడు భార్య లక్ష్మి(భానుప్రియ). రాజా ఇంట్లో కుదిర్చిన సంబంధం మెచ్చి భారతి(సౌందర్య)ను పెళ్లి చేసుకుంటాడు.అనవసరమైన అపార్థాలతో భారతి వల్ల ఏర్పడ్డ కలతలను పెదరాయుడు చక్కదిద్దుతాడు. ఆ ఊరికి టీచరమ్మ(శుభ శ్రీ)వస్తుంది. రాజా తో ఉద్దేశపూర్వకంగా సన్నిహితంగా ఉండటం అందరి కంటా పడుతుంది. ఒక రోజు ఆమె హత్యకు గురైతే ఆ అభాండం రాజా మీద పడి నియమాల ప్రకారం ఊరి నుంచి వెలి వేయబడతాడు. ఈ సందర్భంలోనే చనిపోయిన పెదరాయుడి తండ్రి పాపారాయుడు(రజని కాంత్)గురించి తెలుస్తుంది. న్యాయం కోసం బంధుత్వాన్ని లెక్క చేయకుండా పశుపతి(ఆనంద్ రాజ్)కుటుంబానికి ఊరి వెలి శిక్ష విధించి ప్రాణ త్యాగం చేసిన సంఘటన గుర్తుకు వస్తుంది. దానికి ప్రతీకారంగానే పశుపతి రాజాను ఇరికిస్తాడు. చివర్లో పెద రాయుడు రాజా తప్పేమీ లేదని తెలుసుని తన తప్పుడు తీర్పుకు ప్రాయశ్చితంగా ప్రాణాలు వదిలేస్తాడు. రాజా ఆ భాద్యత తీసుకోవడంతో కథ ముగుస్తుంది.

తెర ముందు

పెద రాయుడు వచ్చి పాతికేళ్ళు అవుతున్నా ఆ పాత్రలో ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం అనే రీతిలో ఆ పాత్రకు జీవం పోసారు కళా ప్రపూర్ణ మోహన్ బాబు. తనను కలెక్షన్ కింగ్ అని ఎందుకు అంటారో మరోసారి ఋజువు చేసారు. పెదరాయుడిగా మోహన్ బాబు వేసిన ముద్ర అప్పట్లో చాలాకాలం వెంటాడడం వల్లే ఆలాంటి పాత్రలు ఇతర హీరోలు మరికొన్ని వేసినా ఏవి కూడా పెదరాయుడు సినిమా కొన గోటికి కూడా సరితూగలేదు. అంత గొప్పగా ఆ పాత్రలో జీవించారు మోహన్ బాబు. అహంకారంతో మిడిసి పడుతున్న సౌందర్యకు బుద్ధి చెప్పే సీన్లో ఇంగ్లీష్ లో పలికే డైలాగ్స్ కు ఈలలేసింది అక్షరం ముక్క రాని మాసోడే. గుడి మెట్ల దగ్గర మేనత్త కళ్ళు తిరిగి పడిపోతే నీళ్ళవ్వలేని నిస్సహాయ పరిస్థితిలో, కుటుంబానికే కాక ఊరంతా గౌరవించే పెద్ద మనిషిగా తన ప్రవర్తనలో, నడవడికలో మోహన్ బాబు చూపించిన నటనకు ఫిదా కానివారు లేరు.

ఇక రాయుడు భార్యగా భాను ప్రియ కెరీర్ లోనే ఒక మంచి పాత్ర వేసింది.డమడమ గుండె డమరుకం పాటలో ఆవిడ హుషారుగా నర్తిస్తుంటే విజిళ్ళుతో కొన్ని క్షణాలు హాళ్ళలో ఒకటే గోలగోల. భారతిగా సౌందర్య కూడా మహామహులైన సీనియర్లతో పోటీ పడింది. ఫస్ట్ హాఫ్ లో పొగరుతో మిడిసిపడుతూ రెండో సగంలో తప్పు తెలుసుకుని బాధ్యతగల ఇల్లాలిగా రెండు షేడ్స్ ని ప్రదర్శించిన తీరు చూస్తే ఆవిడను ఎందుకు సావిత్రితో పోలుస్తారో అర్థమవుతుంది. రాజ రవీంద్ర, ఎం.ఎస్.నారాయణ, కైకాల సత్యనారాయణ, జయంతి, చలపతి రావు, శుభశ్రీ, బ్రహ్మానందం, బాబు మోహన్, మెయిన్ విలన్ ఆనంద్ రాజ్ తదితరులు ఆయా పాత్రలకు అతికినట్టు సరిపోవటమే కాదు దర్శకుడికి కావాల్సిన అవుట్ పుట్ ను నూటికి నూరు శాతం ఇచ్చేసారు.వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే ఫ్లాష్ బ్యాక్ లో 20 నిమిషాల పాటు కనిపించే పాపారాయుడి పాత్రలో చెలరేగిపోయిన సూపర్ స్టార్ రజనికాంత్ ఒక ఎత్తు.

అసలు రజనికాంత్ ఎపిసోడ్ కోసమే ఒకటి పది సార్లు సినిమాను చూసినవాళ్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. అప్పటి దాకా సీరియస్ గా సినిమాలో లీనమై నిశబ్దంగా ఉన్న హాలు రజనికాంత్ రాగానే తుపాను హోరులాగా అరగంట పాటు దద్దరిల్లిపోయేది. తన తీర్పుకి తిరుగులేదనే సంకేతాన్ని ఇస్తున్నట్టు కండువాను భుజం పైకి ఎగరేసి తిరగెయ్యడం, పశుపతి పనిమనిషి మానభంగం చేసిన కేసులో తీర్పు చెప్పేటప్పుడు చూపించే ఎక్స్ప్రెషన్స్, తీర్పు ఇచ్చాక చుట్ట కాల్చుకుంటూ గుర్రపు బగ్గి మీదకు ఎక్కే సిగ్నేచర్ స్టైల్ వీటికే కదా ఫాన్స్ గులాం అయ్యారు అనిపిస్తుంది. ఇవన్ని ఒరిజినల్ తమిళ్ వర్షన్ లో లేవు. విజయ్ కుమార్ పాత్రకు ఇంత బిల్డ్ అప్ ఇవ్వడం కుదరలేదు. కాని ఇక్కడ రజనికాంత్ చేయటంతో ఇవన్ని బ్రహ్మాండంగా క్లిక్ అయ్యాయి.

తెర వెనుక

చంటి, బలరామకృష్ణులు, కొండపల్లి రాజా, ఎం ధర్మరాజు ఎంఎ లాంటి సూపర్ హిట్స్ తో రీమేకులకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయాడు రవిరాజ పినిశెట్టి. పూర్తి గ్రామీణ నేపధ్యంలో, సిటీ బ్యాక్ గ్రౌండ్ ఒక్క చోట కూడా కనపకుండా భారీ తారాగణంతో తన చేతిలో పెట్టిన ఈ సినిమాను రవిరాజా అంతే జాగ్రత్తతో ఒక గొప్ప శిల్పాన్ని చెక్కిన నైపుణ్యాన్ని చూపించారు. తమిళ్ సినిమాను మక్కికిమక్కి తీస్తే ఇంతగా ఆదరించే వారు కారేమో అన్న సందేహం ముందే కలిగింది కాబట్టే చాలా మార్పులు చేసారు. ఇందులో రచయిత స్వర్గీయ సత్య మూర్తి(దేవి శ్రీ ప్రసాద్ తండ్రి) పాత్ర ఎంతో ఉంది.

ఉదాహారణకు ఒరిజినల్ వెర్షన్ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాపారాయుడి పాత్రకు చొక్కా లాంటి ఆచ్చాదన లేకుండా అర్ధనగ్నంగా ఉంటుంది. అది అక్కడి నేటివిటి. కాని తెలుగు లో మరీ అంత సహజంగా ఉంటే ఒప్పుకోరని పెదరాయుడి గెటప్ నే కొద్దిమార్పులతో పాపారాయుడికి వేసారు. రజనికాంత్ మ్యానరిజమ్స్ అన్నీ కొత్తగా ఉండేటట్టు జోడించారు. రజని పాత్ర ఇంతగా క్లిక్ అవ్వడం వల్ల మళ్ళి దీన్ని తమిళ్ లో డబ్ చేసినా బాగానే ఆడింది. సెంటిమెంట్, ఎమోషన్ ఎక్కడ కూడా బాలన్స్ తప్పకుండా స్క్రీన్ ప్లే రాసుకోవడం వల్ల బోర్ కొట్టడం అనే సమస్యే రాదు.

పల్లెటూరి వాతావారణమైనా అర్బన్ ఆడియన్స్ కూడా ఈ సినిమాకు కనెక్ట్ అయ్యారు అంటే దానికి కారణం తెలుగు ప్రేక్షకుల పల్స్ కు తగట్టు కీలకమైన మార్పులు చేయడమే. రచయిత సత్య మూర్తి గారిని ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. సూటిగా గుండెల్లోకి వెళ్ళిపోయే మాటలతో ఆద్యంతం తన అనుభవాన్ని రంగరించి గొప్ప సంబాషణలు రాసారు. ఇక కోటి సంగీతం ఈ సినిమాను ఇంకో మెట్టు పైకి తీసుకెళ్ళింది. ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే పాట తప్ప మిగిలినవన్నీ కూడా స్వంతంగా ట్యూన్స్ చేసుకున్నారు.

ఒక్క బీట్ కూడా లేకుండా, వెస్ట్రన్ డాన్స్ రాజ్యమేలుతున్న రోజుల్లో విలేజ్ బ్యాక్ డ్రాప్ కు తగట్టు కూర్చిన బాణీలు సూపర్ డుపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా కదిలే కాలమా కాసేపు ఆగవమ్మ పాట ఇప్పటి దాకా శ్రీమంతానికి సంబందించిన పాటల్లో అత్యుత్తమం. హీరోనే నిర్మాత కావడంతో రాజీ పడలేదు. పైగా ఇది భారీ బడ్జెట్ డిమాండ్ చేయని సబ్జెక్ట్ కాబట్టి ఆ అవసరం కూడా పడలేదు. ఒక్క డాన్స్ ఐటెం లేకుండా, ఫారిన్ లొకేషన్ కు వెళ్ళకుండా, నగర నేపధ్యాన్ని ఇంచు కూడా చూపకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టడం అమ్మోరు తర్వాత పెదరాయుడికే సాధ్యమైంది.

రాసిన చరిత్ర

జూన్ 15, 1995 పెద రాయుడు విడుదల అయింది. అంచనాలు మాములుగానే ఉన్నాయి. అదే రోజు మెగాస్టార్ చిరంజీవి బిగ్ బాస్ విడుదల. దాని దెబ్బకు పెదరాయుడు నిలబడుతుందా అనుకున్నారంతా. కానీ మొదటివారంలోనే సీన్ రివర్స్. రెండు మూడు రోజులు గడిచాయి. అన్ని చోట్లా పెదరాయుడుకి సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. క్రమక్రమంగా సినిమా హాళ్ళు కిటకిటలాడటం మొదలయింది. టికెట్ల కోసం జనాలు కొట్టుకోవడం మొదలు పెట్టారు. ప్రింట్ల సంఖ్య పెరుగుతోంది.

వస్తున్న వసూళ్లు చూసి డిస్ట్రిబ్యూటర్లకు గుండె ఆగినంత పని అయ్యింది. డబ్బు లెక్కెట్టుకోవడానికి మెషిన్ కావాలి అనేంతగా కౌంటర్లు కిక్కిరిసిపోతున్నాయి. ఈ ధాటిని తట్టుకోలేకపోవడంతో విషయం వీక్ గా ఉండటంతో చిరంజీవి బిగ్ బాస్ జెండా ఎత్తేశాడు. అప్పటి దాకా ఘరానా మొగుడు రాసుకున్న 10 కోట్ల రికార్డును 2 కోట్ల మార్జిన్ తో పెదరాయుడు పడగొట్టాడు. వంద రోజుల సెంటర్స్ విషయంలో కూడా దాని పేరిట ఉన్న 39 రికార్డు ను ఒక్క సెంటర్ తేడాతో 40 కేంద్రాల్లో శతదినోత్సవం చేసుకుని తుడిచేసాడు. రిపీట్ రన్ లో కూడా రికార్డ్స్ సృష్టించడం పెదరాయుడికే చెల్లింది.

చివరి మాట

పెద రాయుడు లాంటి సినిమాలు చూడాలంటే ఆయనంత గొప్ప మనసు ఉండాల్సిన అవసరం లేదు. కాస్తంత టైం, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఇంట్లోనే కూర్చుని యుట్యూబ్ లోనో, ఓటిటిలోనో ఉచితంగా చూడొచ్చు. నగర కాలుష్యంలో కొట్టుకుని పోయి విలువలకు తిలోదకాలు ఇచ్చేసిన యాంత్రికమైన మనసులు సేద తీరాలంటే ఇలాంటి సినిమాలు చూడాలి. కుటుంబంలో పెద్దలకివ్వాల్సిన గౌరవాభిమానాలు, కలిసున్నప్పుడు వచ్చే లాభాలు, ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిత్వ లక్షణాలు అలవడాలంటే వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని క్లాసులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. పెదరాయుడి పాత్రే ట్రైనర్ గా అన్ని పాఠాలు చెబుతుంది. కావాలంటే చూడండి. మీరే ఒప్పుకుంటారు. అందుకే 25 సంవత్సరాలు నిండినా పెదరాయుడు ఎప్పటికీ నిత్యయవ్వనుడే.

Show comments