iDreamPost
android-app
ios-app

కుటుంబంతో కలసి ఉపాధి హామీ పనికి కాంగ్రెస్‌ నేత

కుటుంబంతో కలసి ఉపాధి హామీ పనికి కాంగ్రెస్‌ నేత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, ప్రదేశ్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పని చేసి రఘువీరారెడ్డి ప్రస్తుతం రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన తన పూర్తి సమయాన్ని తన స్వగ్రామంలోనే గడుపుతున్నారు. తాజాగా ఆయన కుటుంబంతో కలసి ఉపాధి హామీ పనికి వెళుతున్నారు. ఆదివారం సమీప గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనుల్లో కూలీలతో కలసి పాల్గొన్నారు. అనంతపురం జిల్లా మడకసిర మండలం గంగులవాయి గ్రామ సమీపంలో జరుగుతున్న ఉపాధి హామీ పనుల్లో కూలీలతో కలసి మట్టి ఎత్తారు. లాక్‌డౌన్‌ కారణంగా గ్రామాలకు తిరిగి వచ్చిన వారిని ఉత్సాహపరిచేందుకు రఘువీరారెడ్డి తన కుటుంబంతో కలసి గంట సేపు పని చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత కూడా పీసీసీ అధ్యక్షుడిగా పని చేసిన రఘువీరారెడ్డి గత ఎన్నికల వరకూ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. 2019 ఎన్నికల తర్వాత పీసీసీ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. స్వగ్రామంలో అత్యంత సామాన్యమైన జీవితం గడుపుతున్నారు. గ్రామ సమస్యల్లో పాలుపంచుకుంటున్నారు. గత ఏడాది వచ్చిన వరదలకు గ్రామంలో చెరువు కట్ట తెగిపోగా.. గ్రామస్తులతో కలసి ఆ గండిని పూడ్చారు. ఆ సమయంలో రఘువీరారెడ్డి రైతులతో కలసి ఇసుక బస్తాలు మోశారు. రఘువీరా రెడ్డి తర్వాత పీసీసీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి సాకే సైలజానాథ్‌ కొనసాగుతున్నారు. రఘువీరారెడ్డి తన రాజకీయ జీవితానికి పూర్తిగా ఫుల్‌స్టాఫ్‌ పెట్టినట్లేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.