iDreamPost
iDreamPost
ఉత్కంఠ రేపిన అనంతపరం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌంకుట్ల గ్రామ పంచాయతీ విభజనకు మరోసారి గ్రామస్థులు అడ్డుచెప్పారు. పరిపాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం మేజర్ పంచాయతీని విభజించాలన్నప్రజలు, నాయకుల ఆశలకు నీళ్లు చల్లారు. గతేడాది సెప్టెంబర్ 30న నిర్వహించిన గ్రామ సభలో మెజార్టీ సభ్యులు విభజన ఇష్టంలేదని చెప్పారు. అప్పటి నుంచి మళ్లీ జనవరి 30న గ్రామ సభ నిర్వహించి మరోసారి అభిప్రాయాలు సేకరించారు.
ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సొంతూరు అయిన పెద్ద కౌకుంట్ల గ్రామ పంచాయతీలో వై.రామాపురం గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా చేస్తే రెండు పంచాయతీలు అభివృద్ధిలో ముందుకు వెళ్తాయని ప్రజల కోరిక మేరకు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి అధికారులను కోరారు. దీనిపై ఆలోచించిన అధికారులు పంచాయతీని విభజించేందుకు గ్రామసభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తమ పంచాయతీని విభజిస్తే తమ రాజీకీయ ఆదిపత్యం కూడా దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే దీన్ని విభజించకుండా అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన గ్రామసభలో కూడా గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనలేదు. పంచాయతీలో మొత్తం 7,118 జనాభా ఉంటే కేవలం 833 మాత్రమే హాజరయ్యారంటే ప్రజలను ఏవిధంగా ప్రలోభ పెట్టారో తెలుస్తుంది. అయితే సభలో పాల్గొన్న వారిలో 622 మంది పంచాయతీని విభజించకూడదని తమ అభిప్రాయం తెలిపారు. అధికారులు సంతకాల సేకరణ ద్వారా అభిప్రాయాలు సేకరించారు.
గ్రామసభ ఎన్నికల వాతావరణాన్ని తలపించింది. ఘర్షణలకు దారితీస్తుందన్న ఉద్దేశంతో అదనపు ఎస్పీ రామాంజనేయులు, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, రెండువందల మంది పోలీసులు, సాయుధ బలగాలు గ్రామసభ బందోబస్తుకు వచ్చాయి. ఒక్కరోజు ముందునుంచే గ్రామాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలు కూడా వాడటంతో గ్రామంలో ఎన్నికల హడావిడి కనిపించింది.
గ్రామ సభలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా పాల్గొన్నారు. అయితే స్వేచ్చగా తమ అభిప్రాయాన్ని తెలిపేందుకు వస్తున్న ప్రజలను ఎమ్మెల్యే అక్కడే ఉండి భయభ్రాంతులకు గురిచేశారని వైసీపీ నేతలు మండిపడ్డారు. ఓట్ల కోసం రాజకీయాలు చేయకూడదని.. పంచాయతీని విభజించకుండా అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు.