Idream media
Idream media
మూడేళ్ల క్రితం జరిగిన సుగాలి ప్రీతి అత్యాచారం, హత్య ఘటనను ఇప్పుడు తన రాజకీయం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ వాడుకున్నారని ఆయన ప్రసంగం స్పష్టం చేస్తోంది. మూడు నెలల క్రితం తన దృష్టికి సుగాలి ప్రీతి ఘటన వచ్చిందని, ఆ ఆడబిడ్డ తల్లి అన్ని రిపోర్టులతో తన వద్దకు వచ్చారని చెప్పిన పవన్ అన్ని విషయాలు చూసి ఆశ్చర్యపోయానన్నారు. పక్కా ఆధారాలు ఉన్నా నిందితులకు శిక్ష ఎందుకు వేయలేదంటూ ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ‘‘ఆ నిందిలెవరో.. ఆ దోషులెవరో…జగన్ రెడ్డి గారు వెంటనే శిక్షించండి’’ అంటూ డిమాండ్ చేశారు. ఈ మాటలతోనే పవన్ కళ్యాణ లక్ష్యం ఏమిటో అర్థమైంది.
అన్ని విషయాలు తెలుసుకుని వచ్చానన్న పవన్ కళ్యాణ్ నిందితుల పేర్లు మాత్రం తన నోటి నుంచి పలకకపోవడం వెనుక పరమార్థం ఏమిటో..? నిందితులు కర్నూలుకు చెందిన టీడీపీ నేత వి.జనార్థన్ రెడ్డి కుమారులు దివాకర్ రెడ్డి, హర్షవర్థన్ రెడ్డిలు కావడంతోనే వారి పేర్లు పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో పేర్కొనలేదా..? తన పాత పార్టనర్ చంద్రబాబు హాయంలో జరిగిన ఘటనపై మూడేళ్ల తర్వాత మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఇంత వరకూ న్యాయం ఎందుకు చేయలేదని వైఎస్ జగన్‌ను ప్రశ్నించారు గానీ.. ఇప్పటికీ రహస్య మిత్రుడిగా ఉన్నచంద్రబాబును పల్లెత్తు మాట అనకుండా తన స్వామి భక్తిని చాటుకున్నారు.
పోలీసుల విచారణకు స్థానిక నేతలు అడ్డుపడుతున్నారంటూ.. మాట్లాడిన పవన్ కళ్యాణ ఆ నేతలెవరో మాత్రం మచ్చుకైనా ప్రస్తావించలేదు. కనీసం ఏ పార్టీ నేతలో కూడా పరోక్షంగానైనా గుర్తు చేయకపోవడం విశేషం. గత ఎన్నికల్లో నంధ్యాల లోక్‌సభ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాండ్ర శివానంథ రెడ్డి నిందితులకు అండగా ఉన్నారని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు పలు సందర్భాల్లో చెప్పారు. మూడునెలల క్రితం పవన్‌ను కలిసినప్పుడు చెప్పి ఉంటారు. అయినా నిందితులకు మద్ధతిస్తున్న టీడీపీ నేతల పేర్లు మాత్రం ప్రస్తావించకుండా కొంత మేరకైనా తన యజమాని రుణం తీర్చుకున్నారు.
ఆరంభంలో కొద్దిసేపు సుగాలి ప్రీతి అంశంపై మాట్లాడిన… పవన్ కళ్యాణ్ ఆ తర్వాత సీఎం వైఎస్ జగన్‌ను, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నిర్ణయాలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారు. జగన్ రెడ్డి సీఎం కావడం వల్లపెట్టుబడులు వెనక్కిపోయాయని విమర్శించారు. కర్నూలులో నీళ్ల సమస్య ఉందన్న పవన్ ఆ సమస్య ఏమిటో మాత్రం చెప్పకుండా గాల్లో రాయి వేసినట్లు విమర్శలు చేశారు. హంద్రీ – నివా కాలువ జిల్లా నుంచి పోతున్నా నీళ్లు ఇవ్వడంలేదన్నారు. హైకోర్టుకు తాను వ్యతిరేకమని ఎవరు చెప్పారంటూ ఎదురు ప్రశ్నించారు. తన తపన రాయలసీమ సమగ్రాభివృద్ధి కోసమేనంటూ సినిమా డైలాగులు కొట్టారు. సీమ నుంచి ఆరుగురు సీఎంలుగా పని చేసినా ఎందుకు వెనుకబడి ఉందంటూ.. చరిత్ర గురించి చెప్పారు.
సుగాలిప్రీతి ఘటనతో మొదలైన పవన్ ప్రసంగం ఆ తర్వాత రాష్ట్ర రాజకీయాలు దాటి దేశ రాజకీయాలకు మళ్లింది. కులాలు, మతాలకు తాను వ్యతిరేకం అంటూనే తాను హిందువునన్నారు. ముస్లిం అయిన హజహారుద్ధిన్ కెప్టెన్సీలో ఇండియా క్రికెట్ టీం ఆడిందన్నారు. దేశ విభజన సమయంలో అందరికీ సమాన హక్కులు కల్పించాలనే.. హిందువులు ఎక్కువగా ఉన్నా కూడా భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించలేదన్నారు. కులాలు, మతాల రాజకీయం తాను చేయబోనంటూనే… కులాలు, మతాల గురించి తలా తోకా లేకుండా మాట్లాడారు. జగన్ రెడ్డికి ఉన్నట్లు తన వద్ద వేల కోట్లు లేవని, తనకు రాజకీయ పార్టీ ని నడిపే శక్తి లేదంటూ.. వైఎస్ జగన్‌ని టార్గెట్ చేశారు. అయినా కార్యకర్తలందరినీ నాయకులుగా తీర్చిదిద్దుతానంటూ.. జైహింద్‌తో తెగిన గాలి పటం లాంటి తన ప్రసంగాన్ని ముగించారు.