iDreamPost
android-app
ios-app

సగటు రాజకీయ నాయకుడిగా మారిన వైనం ఎట్టిదానినా …

సగటు రాజకీయ నాయకుడిగా మారిన వైనం ఎట్టిదానినా …

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు – ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఇక్కడొచ్చిన చిక్కంతా ఒక్కటే – లెక్కకు మించి నీతులు బోధించి; “రెండు లక్షల” సిద్ధాంతాలు జనానికి అందించి; ఊగిపోతూ ఉపన్యాసాలు ఇచ్చి; “అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసం రాజకీయాల్లోకి వచ్చా” అని గొంతు పోయేలా అరిచి – ఒక “యావరేజ్ ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్”లోని ఒక ఫక్తు రాజకీయ పార్టీ లాగా రంగులు మార్చడమే విజ్ఞత ఉన్న వారెవరికైనా చిరాకు కలిగించే విషయం.

“కులాల్ని కలిపే విధానం, మత ప్రస్తావన లేని రాజకీయం..”‘ అంటూ సినిమా డైలాగులు కొట్టి, అమాయక అభిమానుల చేత “అభినవ చేగువేరా”గా జేజేలు కొట్టించుకుని చివరకు మతతత్వ భాజపాతో జతకట్టడం ఆహ్వానించదగ్గ పరిణామం అనిపించుకోదు.

ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల సమయం ఉండగా, అప్పుడే ఏం తొందర వచ్చిందని వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి ఇప్పుడే పొత్తులు కుదుర్చుకున్నారు. పాలకుల్ని ప్రశ్నించడం కోసమే పెట్టిన పార్టీ ఈ నాలుగేళ్ల పాటు “ఏం ? మమ్మల్నొకరు నడిపించాలా ? మాకు పౌరుషం లేదా ?” అంటూ ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాల మీద ఒంటరిగా పోరాడితే ఏ పార్టీతో పొత్తుల అవసరం లేకుండానే ఎన్నికలకూ ధైర్యంగా వెళ్ళచ్చు కదా. మీ నిజాయితీని ప్రజలు నమ్మితే ప్రజలు అధికారం కూడా ఇస్తారు. అలా పోరాడటానికి ధైర్యం లేదా, ఎన్ని సార్లు మాటలు మార్చినా నాయకుణ్ణే నమ్మి, ఇంకా వెంట వస్తున్న సైన్యం మీద నమ్మకం లేదా ?

భాజపా-జనసేనల పొత్తును, జగన్-కేసీఆర్ ల సమన్వయంతో పోల్చడం అర్ధరహితం. రాష్ట్ర విభజన ప్రకటన తర్వాత సమైక్య నినాదానికి కట్టుబడి ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(వైసీపీ) (అంతకు రెండేళ్ల ముందు కూడా పార్లమెంటులో విభజనకు వ్యతిరేకంగా ప్లకార్డు పట్టుకుని వైఎస్ జగన్ నిరసన తెలియజేశాడు) విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్రంలో 92 నియోజకవర్గాల్లో పోటీ చేసింది, మూడు సీట్లలో గెలిచింది కూడా. వైసీపీ స్థాపించాక 2012లో జరిగిన ఉపఎన్నికల నుంచి మొన్న 2019 సార్వత్రిక ఎన్నికల దాకా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎవరితోనూ పొత్తు కోసం పాకులాడలేదు, 2014లో ఎందరు కలిసొచ్చినా ఒంటరిగానే బరిలోకి దిగింది, ఓడిపోయినా ప్రతిపక్షంలో తమ సత్తా చాటింది. గతంలో ఏ పార్టీ కనీవినీ ఎరుగని రీతిలో ఘనవిజయాన్ని మలి ఎన్నికల్లో సొంతం చేసుకుంది.

ప్రస్తుతం 
జగన్ – కేసీఆర్ లు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల హోదాలో కలిసే పని చేయాలి. పాత కక్షలు, అహంకారాలు పక్కన పెట్టి పనిచేయకపోతే నష్టపోయేది ఆంద్ర రాష్ట్ర ప్రజలే.

ఇకపోతే జగన్ తన కన్నా వయసులో ఇరవై, ఇరవై అయిదు సంవత్సరాలు పెద్ద వారైన కేసీఆర్, నరేంద్ర మోదీలకు కాళ్ళ నమస్కారం చేయబోవడాన్ని ఏ విధంగానూ తప్పు పట్టక్కర్లేదు. ఎన్నికల ముందు పొత్తుల కోసం మాయావతి కాళ్లకు పలు మార్లు పవన్ కల్యాణ్ నమస్కారం చేయడం కూడా తప్పేమి కానట్టే. వైఎస్ జగన్ పాదయాత్రలో ఒక పండు ముసలి ముద్దిస్తున ఫోటోను కూడా హేళన చేస్తూ ప్రచారం చేసిన వారికి తప్ప, సామాన్య జనానికి ఇలాంటివి తప్పుగా అనిపించవు. మహా అయితే కొందరికి ఆ నమస్కారాలు అనవసరం అనిపించచ్చు, అందులో కూడా తప్పు లేదు. వైఎస్ జగన్ ఏదో లాభాపేక్షతోనే ప్రధాని నరేంద్రమోదీ కాళ్ళకు నమస్కారం చేయబోయాడని భ్రమపడ్డం హాస్యాస్పదం – వారి దృష్టిలో ఎవరైనా కాళ్లకు నమస్కారం చేయగానే వారికి అనుకూలంగా ప్రధాని మారిపోతారా ? అలా మారిపోయే మనిషి అయితే, అలాంటి వ్యక్తి నేతృత్వంలోని పార్టీతో పొత్తు కోసం ఎందుకు వెంపర్లాడారో మరి ? బహుశా అదేనేమో “న్యూ ఏజ్ పాలిటిక్స్'” అంటే !

ఏది ఏమైనా, ఈ పొత్తుతో … జనసేన – ఒక ముగిసిన అధ్యాయం.

పీఎస్ : ఆ అధ్యాయానికి సంబంధించి జనానికి గుర్తుండిపోయేది పవన్ కల్యాణ్ కాదు, రాపాక వరప్రసాదరావు.

గమనిక : “ఓటుకు నోటు కేసు” గురించి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ అలా ఓట్లకు డబ్బు పంచడమనేది “యావరేజ్ ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్” లో చాలా సాధారణమైన విషయం అని సెలవిచ్చారు. అందుకే ఆ పదాన్ని కోట్స్ లో వాడాము – పాఠకులు గమనించగలరు.