పత్తిపాటికి కోపం రావడంలో ఆశ్చర్యం లేదులే..!

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టేందుకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని.. ఆ తర్వాతే రాష్ట్ర అభివృద్ధని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు సెలవిచ్చారు. వైఎస్సార్‌సీపీ నాలుగు కేసులు పెడితే తాము 10 కేసులు పెడతామని టీడీపీ గుంటూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో చెప్పుకొచ్చారు. మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌ బాబు, ఆలపాటి రాజా, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు.. ప్రభుత్వ నిర్ణయాలపై విమర్శలు సందించగా.. మాజీ మంత్రి పత్తిపాటి మాత్రం రివేంజ్‌ రాజకీయం చేస్తామంటూ భవిష్యత్‌ ప్రణాళికలను ప్రకటించారు.

పత్తిపాటి ఇలా మాట్లాడడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. రాజధాని అమరావతిలో పత్తిపాటి పుల్లారావు.. తనపేరుపై, తన సతీమణి పేరుపై భూములు కొన్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో వీరి పేర్లు ప్రముఖంగా వినిపించడంతో పత్తిపాటికి చిర్రెత్తుకొచ్చింది. పాపం గుడ్డిపత్తి అమ్ముకుని కూడబెట్టుకున్న సొమ్ముతో రాజధానిలో ఏదో నాలుగెకరాలు కొని నాలుగు కాసులు వెనుకేసుకుందామనుకుంటే ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ అంటూ వైఎస్సార్‌సీపీ దెబ్బకొట్టేందుకు రంగం సిద్ధం చేస్తుందాయే. అసైన్డ్‌ భూములు కొనుగోలుపై హేమాహేమీలు, లోకేష్‌ సన్నిహితులను వదిలేసి.. తానపై సీఐడీ కూడా కేసులు నమోదు చేయడంతో పత్తిపాటికి మరింత కొపం తెప్పిచ్చింది కాబోలు.. తన అసహనాన్ని వెల్లగక్కారు.

వైఎస్సార్‌సీపీపై ఒంటికాలిపై లేచే వారిని వదిలేసి తనను టార్గెట్‌ చేస్తున్నారనుకుంటున్నారేమో గానీ పత్తిపాటికి మాత్రం కోపం నషాళానికి ఎక్కుతోంది. ఓ వైపు తన అనుచరురాలుగా ఉన్న విడదల రజనీని తనపైనే పోటీ చేయించారు. తన లెక్కలు, బొక్కలు అన్నీ తెలిసిన అభ్యర్థి కావడంతో రాజకీయ అనుభవం లేకపోయినా గెలిచింది. ఓడిపోతే పోయాంలే అనుకుంటే.. మళ్లీ రాజధాని భూములు వ్యవహారం మెడకు చుడుతున్నారు. అందుకే ఆవేశాన్ని ఆపుకోలేకపోయినట్లున్నారు. పనిలో పనిగా అధికారులపై కూడా చిందులేశారు. తాము అధికారంలోకి వస్తే.. తమ బూట్లు నాకే పోలీసులనే పెట్టుకుంటామని జేసీ దివాకర్‌ రెడ్డి సై్టల్‌కి భిన్నంగా పత్తిపాటి చిందులుతొక్కారు. తమను ఇబ్బంది పెట్టే ఏ అధికారినీ వదలబోమని హెచ్చరించారు.

అధికారంలోకి వచ్చాక చేసేవి అటుంచితే.. ఇలా మాట్లాడి అధికారపార్టీకి టార్గెట్‌ కాకుంటే అదే పది గుడ్డిపత్తి బేళ్లతో సమానం. నాలుగున్నరేళ్ల తర్వాత అధికారం వస్తే తప్పా.. పత్తిపాటి రివేంజ్‌ సినిమా విడుదలవదు. కానీ ఈలోపు పత్తిపాటి మాటలను అధికార వైఎస్సార్‌సీపీ మాత్రం సీరియస్‌గా తీసుకుంటే నాలుగున్నరేళ్లపాటు వరుసగా సినిమాలు ‘‘విడుదల’’ చేస్తుంది. పత్తిపాటి పుల్లారావు రివేంజ్‌ సినిమా వైస్సార్‌సీపీ నేతలు ఇంకా విన్నారో లేదో..?.

Show comments