iDreamPost
android-app
ios-app

Pathaan Review పఠాన్ రివ్యూ

  • Published Jan 25, 2023 | 3:44 PM Updated Updated Jan 25, 2023 | 3:46 PM
Pathaan Review  పఠాన్ రివ్యూ

2018లో జీరో డిజాస్టర్ అయ్యాక మళ్ళీ షారుఖ్ ఖాన్ తెరమీద కనిపించనే లేదు. దీంతో అభిమానులు మళ్ళీ ఎప్పుడు బాద్షాని చూస్తామా అని కళ్ళలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూశారు. వాళ్ళ నిరీక్షణ ఫలించి ఇవాళ పఠాన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అడ్వాన్స్ బుకింగ్స్ తో కెజిఎఫ్ 2 రికార్డుని బద్దలు కొట్టి మొదటి రోజుకు ముందే సంచలనాలు మొదలుపెట్టిన షారుఖ్ ఈసారి హిట్ కోసం దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ తో చేతులు కలిపాడు. యష్ రాజ్ నిర్మాణ సంస్థ, ట్రైలర్ చూడగానే భారీ యాక్షన్ ఉంటుందన్న నమ్మకం వెరసి అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. మరి వాటికి తగ్గట్టు పఠాన్ జనాన్ని మెప్పించాడా లేదా రివ్యూలో చూద్దాం

కథ

భారతదేశం ఆర్టికల్ 370 రద్దు చేశాక పాకిస్థాన్ పగతో రగిలిపోతుంది. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఇలాంటి పనులు చేసి పెట్టే జిమ్(జాన్ అబ్రహం)సహాయం కోరుతుంది. ఒకప్పుడు ఇండియాకు రా ఏజెంట్ గా పని చేసిన జిమ్ భార్యను కోల్పోవడం వల్ల ఆ కసితో దేశద్రోహానికి సిద్ధ పడతాడు. ఒక భయంకరమైన మిషన్ ని సిద్ధం చేస్తాడు. దాన్ని ఆపాలంటే ఒక్క పఠాన్ వల్లే అవుతుందని గుర్తించి ప్లాన్ తయారుచేస్తాడు. ఈ క్రమంలో పరిచయమైన పాక్ ఐఎస్ఐ ఏజెంట్(దీపికా పదుకునే) సహాయంతో జిమ్ ని అడ్డుకునేందుకు పఠాన్ రెడీ అవుతాడు. మరి ఇంత ప్రమాదరకమైన వ్యూహాన్ని అతను ఎలా ఛేదించాడు అనేదే అసలు స్టోరీ

నటీనటులు

షారుఖ్ ఖాన్ తనకిచ్చిన పఠాన్ పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ప్రేమకథ కాదు కాబట్టి రొమాన్స్, కామెడీకి అవకాశం లేకుండా పోవడంతో కేవలం యాక్షన్ కే కట్టుబడాల్సి వచ్చింది. ఎమోషన్స్ కి ఎక్కువ చోటు దక్కలేదు. అస్తమాను ఫైట్లే చేయాల్సి వచ్చింది. ఫ్యాన్స్ కోరుకున్నట్టు వాళ్లను ఎంత మాత్రం నిరాశపరచలేదు. లేట్ ఏజ్ లోనూ కష్టపడుతున్న వైనం ఆకట్టుకుంటుంది. స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చిన సల్మాన్ ఖాన్ క్యామియో బాగుంది. సెకాంఫ్ హాఫ్ లో ఈ ఇద్దరి మధ్య ట్రైన్ ఎపిసోడ్ హైలైట్స్ లో ఒకటి. జాన్ అబ్రహం ధూమ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి విలనిజం ని ఇందులో గొప్పగా పండించాడు. పఠాన్ మెయిన్ అసెట్స్ లో తనూ ఒకడు

దీపికా పదుకునే గ్లామర్ షోకు ఏ మాత్రం మొహమాటపడలేదు. ఆల్రెడీ కాంట్రావర్సీ అయిన బేషరం పాట సెన్సార్ వల్ల కొంత ఎడిటింగ్ కు గురయ్యింది కాబోలు ఆ తేడా కనిపిస్తుంది. పెర్ఫార్మన్స్ కు స్కోప్ దక్కింది. మొక్కుబడి హీరోయిన్ పాత్ర కాదు. డింపుల్ కపాడియా తన అనుభవాన్ని రంగరించి హయ్యర్ అఫీషియల్ గా మెప్పించారు. అశుతోష్ రానా పాత్ర హుందాగా ఉంది. మనీష్ వాధ్వా, సిద్ధాంత్, గౌతమ్, షాజి, దిగంత హజారికా తదితరులు ఉన్నారు కానీ ఎవరికీ ఎక్కువ హైలైట్ అయ్యే అవకాశం దక్కలేదు. స్క్రీన్ మొత్తం షారుఖ్ జాన్ దీపికా ఈ ముగ్గురితోనే పూర్తిగా నిండిపోయింది


డైరెక్టర్ అండ్ టీమ్

సిద్దార్థ్ ఆనంద్ లో మంచి యాక్షన్ సెన్స్ ఉంది. ఒకప్పుడు లవ్ అండ్ రొమాంటిక్ సినిమాలు తీసి పేరు తెచ్చుకున్న ఇతను హృతిక్ రోషన్ తో చేసిన బ్యాంగ్ బ్యాంగ్ పెద్ద పేరు తీసుకురావడంతో పూర్తిగా డైవర్షన్ రూటు తీసుకున్నాడు. వార్ లో చేసింది ఇదే. అందులో బియాండ్ ది ఫిజిక్స్ తో రూపొందించిన యాక్షన్ ఎపిసోడ్లు భారీ విజయాన్ని అందించాయి. అదే నమ్మకంతో ఈసారి అంతకు మించి అనేలా ఉండాలనే ఉద్దేశంతో ఈ పఠాన్ రాసుకున్నారు. ఈ లైన్ తో బాలీవుడ్ లోనే బోలెడు సినిమాలొచ్చాయి. ఒకడు పాకిస్థాన్ తరఫున మన దేశం మీద కుట్ర చేస్తే హీరో ఛేదించడం అనేది చాలా సార్లు చూశాం. పాయింట్ పరంగా చూస్తే కొత్తదనం లేదు

షారుఖ్ ఇమేజ్ ని నమ్ముకుని భారీ బడ్జెట్ చేతిలో ఉంచుకున్న సిద్దార్థ్ కేవలం ఎలివేషన్లు, హై ఎండ్ గ్రాఫిక్స్ ని నమ్ముకున్నాడు. అవి సరైన రీతిలో పండటంతో ఆ గ్రాండియర్ నెస్ కి చాలా లాజిక్స్ ని పట్టించుకునే అవసరం లేకుండా పోయింది. హీరో దేశ విదేశాల్లో నమ్మశక్యం కానీ రీతిలో విలన్ తో తలపడుతూ ఉంటాడు. దుబాయ్ లో హెలికాఫ్టర్లు వేసుకుని నడి రోడ్డు మీద కొట్టుకున్నా ఎవరూ పట్టించుకోరు. ఆఫ్రికా ఫ్రాన్స్ లో ఆకాశంలో ఫ్లైట్లు వేసుకుని గాల్లో విన్యాసాలు చేసినా అడిగేవాళ్ళు ఉండరు. ఇలా బోలెడున్నాయి. మేజిక్ జరిగేటప్పుడు లాజిక్ అవసరం లేదన్న ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ సూత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ అక్షరాలా పాటించాడు

ఎంత హై వోల్టేజ్ యాక్షన్ ఉన్నా పఠాన్ లో ఎమోషన్స్ ఉండవు. భావోద్వేగాలు కలగవు. కళ్ళముందు అబ్బురపరిచే విజువల్స్ తో గూస్ బంప్స్ అనిపించే పోరాటాలు జరుగుతున్నప్పుడు తెరమీద పాత్రలు మనకు ఎమోషనల్ గా కనెక్ట్ కావడం లేదనే విషయాన్ని మర్చిపోతాం. జాన్ అబ్రహం కు పెట్టిన ఫ్లాష్ బ్యాక్ మరీ పేలవంగా ఉంది. స్వంత దేశం మీద అంత ద్వేషం ఎందుకు పెంచుకున్నాడనే దాన్ని ఆడియన్స్ ఒప్పుకునే స్థాయిలో డిజైన్ చేయలేదు. నిజమైన దేశభక్తుడు కుటుంబాన్ని సైతం కోల్పోయినా చలించడు. అలాంటిది భార్యను శత్రుదేశం వాళ్ళు పొట్టనపెట్టుకుంటే వాళ్ళ మీద పగ పెంచుకోవాల్సింది పోయి రివర్స్ లో గేమ్ ఆడతాడు

దీని విషయం పక్కనపెడితే పఠాన్ తాలూకు సెటప్ కూడా మరీ గొప్పగా లేదు. క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసిన తీరుతో మొదలుపెట్టి దీపికా పదుకునే చేతిలో సులభంగా మోసపోవడం దాకా సిద్దార్థ్ ఆనంద్ ఏదీ ఊహాతీతంగా నడిపించలేకపోయాడు. ట్విస్టులను సులభంగానే గెస్ చేయొచ్చు. దర్శకుడి మీద మిషన్ ఇంపాజిబుల్ ప్రభావం బలంగా ఉన్నట్టు కనిపిస్తుంది. కొన్ని సీన్లు వాటినే తలపిస్తాయి. నమ్మేలా లేకపోయినా భలే డిజైన్ చేశారనిపించేలా స్టంట్ మాస్టర్స్ తీసుకున్న శ్రద్ధ, విఎఫ్ఎక్స్ బృందం పడిన కష్టం స్క్రీన్ మీద మంచి అవుట్ ఫుట్ ని ఇచ్చింది. ఇవి ఏ మాత్రం తేడా కొట్టినా, నాణ్యత లేకపోయినా పఠాన్ ఇంకోరకంగా విసుగుకు కారణం అయ్యేవాడు.

కాసేపు ఈ సానుకూల అంశాలను పక్కనపెడితే పఠాన్ లో బోలెడు తప్పుల తడకలున్నాయి. ముందే చెప్పినట్టు షారుఖ్ అనే మాన్స్ టర్ ని పెట్టుకున్నప్పుడు ఎన్నో వీక్ నెస్ లు అలా పైపై పూతలతో పక్కకెళ్లిపోతాయి. ఇందులోనూ అదే జరిగింది. రా ఏజెంట్ల వ్యవహారాలు గతంలో చాలా సినిమాల్లో చూశాం. ఇలాంటి వాటిని డీల్ చేయడంతో ఎక్స్ పర్ట్ గా పేరు పొందిన కబీర్ ఖాన్ తరహా హోమ్ వర్క్ ని సిద్దార్థ్ ఆనంద్ పూర్తి స్థాయిలో చేయలేదు. ముఖ్యంగా ఏక్ ధా టైగర్, ఫాంటమ్ లాంటి సినిమాల్లో ఉండే రేసీ స్క్రీన్ ప్లే కేవలం పోరాటాలనే కాదు కథలో ఉద్దేశాన్ని, పాత్రల తాలూకు భావోద్వేగాన్ని చక్కగా ఆవిష్కరించింది. పఠాన్ లో ఇది తగ్గింది

ఫ్యాన్స్ కోణంలో చూసుకుంటే గత పదేళ్లలో వచ్చిన షారుఖ్ ఖాన్ సినిమాల్లో ఇదే బెస్ట్ అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అలా కాకుండా సామాన్య ప్రేక్షకుల వైపు ఆలోచిస్తే వాళ్లకు కావాల్సిన అంశాలు తగ్గడమనేది ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. నార్త్ ఆడియన్స్ దీన్ని బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గరకు వచ్చేటప్పటికి బాద్షా నుంచి కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఆశిస్తాం కాబట్టి కొంత నిరాశ అయితే కచ్చితంగా కలుగుతుంది. పఠాన్ లో సోషల్ మెసేజ్ అంటూ ఏమి లేదు. దేశ వినాశనానికి పూనుకున్న శత్రువుల ఆట కట్టించే ఒక స్పై కథగా దీన్ని సిద్దార్థ్ ఆనంద్ చెప్పాలనుకున్నాడు. అందులో పాస్ అయ్యే మార్కులు తెచ్చుకున్నాడు అంతే

రెండే పాటలు ఉండటం పఠాన్ కు పెద్ద రిలీఫ్. దీపికా అందాల ఆరబోత కారణంగా ఆల్రెడీ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచిన బేషరం ఫస్ట్ హాఫ్ లో వచ్చేస్తుంది. చివర్లో టైటిల్ స్క్రోలింగ్ లో మరొకటి పెట్టారు. విశాల్ శేఖర్ ట్యూన్స్ ఓకే. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన సంచిత్ అంకిత్ లు మాత్రం ఈ రేంజ్ అవుట్ ఫుట్ కి కావాల్సిన ఇంటెన్స్ బిజిఎంని ఇవ్వలేదు. ఒకటే సౌండ్ చివరి దాకా వింటున్న ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ వర్క్ గొప్పగా ఉంది. విజువల్స్ రిచ్ గా వచ్చాయి. సత్చిత్ పాలౌస్ ఛాయాగ్రహణం గొప్పగా ఉంది. ఎడిటింగ్ నీట్ గా ఉండటం వల్ల ఓవర్ లెన్త్ రాలేదు. యాష్ ప్రొడక్షన్ వేల్యూస్ ఎప్పటిలాగే గ్రాండ్ గా వంకపెట్టడానికి లేకుండా ఉన్నాయి

ప్లస్ గా అనిపించేవి

షారుఖ్ కంబ్యాక్
జాన్ అబ్రహం
యాక్షన్ ఎపిసోడ్స్
సల్మాన్ క్యామియో

మైనస్ గా తోచేవి

రొటీన్ స్టోరీ
జీరో ఎమోషన్స్
నేపధ్య సంగీతం
ఊహించే కథా కథనాలు

కంక్లూజన్

ఒక బడా స్టార్ హీరో ఏళ్ళ తరబడి తెరకు దూరమైతే ఆ ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం. అందుకే పఠాన్ మీద ఇన్నేసి ఆశలు అంచనాలు. మాములుగా షారుఖ్ ఖాన్ వరసగా సినిమాలు చేస్తున్న టైంలో ఈ పఠాన్ వచ్చి ఉంటే ఫలితం యావరేజ్ గా ఉండేదేమో కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం సూపర్ హిట్ దిశగా వెళ్లినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అతను బలంగా బౌన్స్ బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్న సగటు జనాలు కోట్లలో ఉన్నారు. పఠాన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ మూవీ కాదు. ఆ మాటకొస్తే ధూమ్ రేంజ్ లో సగం కూడా లేదు. అయినా కూడా ఫైట్లతో కాలక్షేపం చేస్తే చాలు ఇంకేమీ అక్కర్లేదు అనుకుంటే హ్యాపీగా పఠాన్ ని ట్రై చేయొచ్చు

ఒక్క మాటలో – యాక్షన్ ఓవర్ లోడెడ్

రేటింగ్ : 2.5/5