iDreamPost
iDreamPost
వర్తమాన అవసరాలు తీరుస్తూ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే తన లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముప్పై ఏళ్ల పాటు రాష్ట్రంలో పాలనను అందించే లక్ష్యంతో తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దానికి అనుగుణంగా తన క్యాబినెట్ ఎంపిక నుంచి అన్నింటా దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అడుగులు వేస్తున్నారు. అయితే సీఎం ఆశయాలకు తగ్గట్టుగా అధికార యంత్రాంగం, క్షేత్రస్థాయిలో సహకారం లేకపోవడంతో కొన్ని విషయాల్లో ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదనే వాదన ఉంది.
ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి తగ్గట్టుగా జగన్ వేస్తున్న ఎత్తులు కూడా ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇప్పటికే న్యాయవ్యవస్థలో ఉన్న తమ అనుకూలురు ద్వారా జగన్ ప్రభుత్వం మీద కుయుక్తులు పన్నిన చంద్రబాబుకి జగన్ చెక్ పెట్టే పనిలో ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ ద్వారా జగన్ ప్రయత్నాలు కొద్ది మేరకు ఫలితాన్నిచ్చినట్టు ప్రత్యర్థులే చెబుతున్నారు. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదిలీకి జగన్ కారణమని ఇప్పటికే చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దానికి ఆధారంగా చెప్పవచ్చు. కార్యనిర్వాహక యంత్రాంగంలో ఉన్న లోసులుగు కూడా చక్కదిద్ది పాలనను పూర్తి స్థాయిలో పరుగులు పెట్టించే సంకల్పంతో జగన్ ఉన్నారు.
ముఖ్యమంత్రి అంచనాలు, ఆశయాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీకి తగిన యంత్రాంగం లేకపోవడం లోటుగా కనిపించేది. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికల పుణ్యాన పాలకపక్షానికి పలు ప్రయోజనాలు చేకూరుతున్నట్టు చెప్పవచ్చు. పంచాయితీ పోరులో ఓటర్లు 80 శాతం మంది వైఎస్సార్సీపీ కార్యకర్తలను గెలిపించారు. పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలే అయినప్పటికీ విపక్షాల కుట్రలను తిప్పికొట్టి అధికార పార్టీ ఆధిక్యం సాదించింది. దాంతో ప్రస్తుతం కమిటీలు, కార్యకర్తలు లేని లోటుని వైఎస్సార్సీపీ తీర్చుకున్నట్టయ్యింది. ఇకపై పంచాయితీలలో సర్పంచుల ఆధారంగా పార్టీ మరింత బలపడే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో విపక్షాలు చేతులెత్తేసే రికార్డు స్థాయిలో ఏకగ్రీవాలు అయ్యేందుకు దోహదపడ్డారు. ఇప్పుడు ఎన్నికలు జరిగిన చోట కూడా ప్రజలు జగన్ పథకాలకు జేజేలు పలకడంతో రాష్ట్రంలో జగన్ ఆశయాల సాధనకు పలు అడ్డంకులు తొలగినట్టే భావించవచ్చు.
ఏపీలో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా పంచాయితీ ఎన్నికలు జరిగాయి. గత ప్రభుత్వ హయంలో నీరు మట్టి, సిమెంట్ రోడ్డ నిర్మాణం పేరుతో ఉపాధి హామీ నిధుల స్వాహా చేసిన నేతలే నేటికీ చక్రం తిప్పుతుండగా, ప్రస్తుతం కొత్త తరం తెరమీదకు వస్తోంది. అందులోనూ అత్యధికులు యువనేతలు, విద్యావంతులు కావడంతో జగన్ ఆశించినట్టుగా కొత్త తరం రాజకీయాల్లో కీలకంగా మారే దశ వస్తోంది. ఇది భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ పాలనా పద్దతుల్లో మార్పులతో అభివృద్ది కొత్త పుంతలు తొక్కేందుకు తోడ్పడబోతోంది. మొత్తంగా మూడు దశాబ్దాల లక్ష్యంతో ముఖ్యమంత్రిగా సాగుతున్న జగన్ అనుకున్న రీతిలో పథకాలు, అభివృద్ధి ముందుకు తీసుకెళ్లేందుకు తాజా ఫలితాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.