iDreamPost
android-app
ios-app

కోర్టు తీర్పుతో నాలుగు జడ్పీలలో మిగిలే మూడు ఏవి?

కోర్టు తీర్పుతో నాలుగు జడ్పీలలో మిగిలే మూడు ఏవి?

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు 59.85 శాతం నుంచి 50 శాతానికి పరిమితం చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించడంతో ఆ మేరకు బీసీ రిజర్వేషన్లలో కోతపడనుంది. జనవరి 3వ తేదీన 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్‌ రిజర్వేషన్లు ఖరారు చేసింది. ఎస్టీలకు 6.77 శాతం, ఎస్సీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం చొప్పున 59.85 శాతం రిజర్వేషన్లు ఖరారు చేసింది.

50 శాతంపైన ఇచ్చిన రిజర్వేషన్లు బీసీలకు వర్తించాయి. అయితే ప్రస్తుతం ఆ రిజర్వేషన్లు చెల్లవంటూ హైకోర్టు తీర్పు చెబుతూ.. రిజర్వేషన్లు 50 శాతం లోపు ఉండాలని స్పష్టం చేసింది. హైకోర్టు తీర్పును అనుసరించి 50 శాతానికి రిజర్వేషన్లు పరిమితం కానున్నాయి. తగ్గే 9.85 శాతం బీసీలకు కేటాయించిన 34 శాతంలో కోత పడనుంది.

జనవరి 3వ తేదీన 59.85 శాతం రిజర్వేషన్ల ప్రకారం ఎస్టీలకు ఒకటి, ఎస్సీలకు రెండు, బీసీలకు నాలుగు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవులు కేటాయించారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా పరిషత్‌ను ఎస్టీలకు, అనంతపురం ఎస్సీ, శ్రీకాకుళం ఎస్సీ మహిళకు రిజర్వ్‌ చేశారు. చిత్తూరు, కృష్ణా జిల్లా పరిషత్‌లు బీసీ, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌లు బీసీ మహిళలకు కేటాయించారు. మిగతా ఆరు జనరల్‌ కోటా కింద ఉంచారు. ఇందులో విజయనగరం, వైఎస్సార్‌ కడప జనరల్, తూర్పుగోదావరి, కర్నూలు, గుంటూరు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పీఠాలు జనరల్‌ మహిళలకు రిజర్వ్‌ చేశారు.

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కావడంతో 13 జిల్లా పరిషత్‌లకు గాను 4 పరిషత్‌లు వచ్చాయి. ఇప్పుడు 34లో 9.85 శాతం కోత పడుతోంది. అంటే బీసీ రిజర్వేషన్లు 24.15 శాతానికి పరిమితం అవుతాయి. ఈ మేరకు నాలుగు జిల్లా పరిషత్‌లకు గాను మూడు స్థానాలే బీసీలకు దక్కనున్నాయి. పాత విధానం ప్రకారం చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లా పరిషత్‌లు బీసీలకు కేటాయించారు. అయితే ఈ నాలుగు జిల్లాల్లో మిగిలే ఆ మూడు స్థానాలు ఏవి..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.