iDreamPost
android-app
ios-app

మంచి సినిమాలకు మంచి రోజులు

  • Published Sep 13, 2022 | 4:51 PM Updated Updated Dec 06, 2023 | 10:43 AM

పెద్ద స్టార్ హీరోల చిత్రాలే బొక్క బోర్లా పడి సాయంత్రం షోకి ఖాళీ సీట్లు దర్శనమిచ్చే దారుణమైన పరిస్థితి.

పెద్ద స్టార్ హీరోల చిత్రాలే బొక్క బోర్లా పడి సాయంత్రం షోకి ఖాళీ సీట్లు దర్శనమిచ్చే దారుణమైన పరిస్థితి.

మంచి సినిమాలకు మంచి రోజులు

సరిగ్గా రెండు నెలల క్రితం టాలీవుడ్ లోనే కాదు దేశమంతా విపరీతమైన ఆందోళన. జనం థియేటర్లకు రావడం లేదు. కనీస ఓపెనింగ్స్ లేవు. పెద్ద స్టార్ హీరోల చిత్రాలే బొక్క బోర్లా పడి సాయంత్రం షోకి ఖాళీ సీట్లు దర్శనమిచ్చే దారుణమైన పరిస్థితి. దెబ్బకు నిర్మాతలంతా షూటింగులు ఆపేసి మరీ తమ సమస్యల గురించి రోజుల తరబడి చర్చించుకుని పరిష్కారాలు రాసుకున్నారు. కానీ ప్రేక్షకులు మాత్రం వీటితో సంబంధం లేకుండా మంచి సినిమాలను కంటెంట్ ఉన్న వాటిని తప్పకుండా ఆదరిస్తామని మరోసారి ఘనంగా చాటి చెప్పారు. టికెట్ రేట్లు సెకండరీ అని నిజంగా మ్యాటర్ ఉంటే ఓ వంద రూపాయలు ఎక్కువైనా చూసేందుకు సిద్ధమని వసూళ్ల ద్వారా నిరూపించారు.

ఇటీవలి పరిణామాలు విశ్లేషించుకుంటే స్టార్ క్యాస్టింగ్ లేకపోయినా మంచి సినిమాలు అద్భుతమైన ఆదరణ దక్కించుకోవడం కళ్లారా చూస్తూనే ఉన్నాం. సక్సెస్ లేక ఏళ్ళు గడిచిపోయినా కళ్యాణ్ రామ్ కు ‘బింబిసార’ ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. కేవలం వారం లోపే బ్రేక్ ఈవెన్ అందుకుంది. తెలుగులో ఇప్పుడిప్పుడే సెటిలవుతున్న దుల్కర్ సల్మాన్ మీద భారీ బడ్జెట్ తో రిస్క్ చేసిన ‘సీతారామం’ ఏకంగా బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చింది. ఇక ‘కార్తికేయ 2’ ఊహించని రీతిలో దేశవ్యాప్తంగా సెన్సేషన్ అయ్యింది. బ్రహ్మాస్త్ర రాకపోతే ఇంకా దూకుడు కొనసాగించేది కానీ దాని తాకిడి వల్ల నెమ్మదించక తప్పలేదు లేకపోతే ఈజీగా 150 కోట్ల మార్కును అందుకునేది

ఇటీవలే వచ్చిన ‘ఒకే ఒక జీవితం’ మరో మంచి ఉదాహరణ. శర్వానంద్ ఫ్లాప్ ట్రాక్ వల్ల ఫస్ట్ డే ఓపెనింగ్స్ లేవు. ఉదయం రెండు ఆటలు అయ్యాక బాగుందనే టాక్ బయటికొచ్చాక ఈవెనింగ్ షోల నుంచే క్రౌడ్ పెరిగింది. మొన్న ఆదివారం ఏ సెంటర్స్ లో దాదాపు హౌస్ ఫుల్స్ పడ్డాయి. వీక్ డేస్ లో నెమ్మదించినప్పటికీ డిజాస్టర్లతో సతమతమవుతున్న శర్వాకు ఇది చాలా పెద్ద రిలీఫ్. ఇవన్నీ గమనించే అయిదారు సినిమాలతో పోటీ పడాల్సి వచ్చినా కూడా నిర్మాతలు మీడియం బడ్జెట్, చిన్న చిత్రాలను రిలీజ్ కు రెడీ చేస్తున్నారు. టెక్నాలజీ ఎంత పెరిగినా, ఓటిటిలు ఎన్ని వచ్చినా మంచి సినిమాలకు మంచి రోజులు ఇప్పుడే కాదు ఎప్పుడూ ఉంటాయి