iDreamPost
iDreamPost
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూసే కొద్దీ తన 30న సినిమా ఆలస్యమవుతూనే ఉంది. అదిగో పులి ఇదిగో తోక తరహాలో జాప్యాన్ని పెంచుకుంటూ పోతున్నారు తప్ప ఫలానా టైంలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తామని ఎవరూ చెప్పడం లేదు. దర్శకుడు కొరటాల శివ ఫైనల్ వెర్షన్ ని కన్విన్సింగ్ గా చెప్పడంలో ఫెయిలవుతున్నాడని ముఖ్యంగా సెకండ్ హాఫ్ విషయంలో తారక్ సంతృప్తి చెందడం లేదని ఫిలిం నగర్ లో గట్టి ప్రచారమే జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ విడుదలై ఆరు నెలలు దాటినప్పటికీ తమ హీరో ఖాళీగా ఉండటం పట్ల ఫ్యాన్స్ బాధ అంతా ఇంతా కాదు. అప్పుడప్పుడు జూనియర్ బయటికైతే వస్తున్నాడు కానీ కొత్త ప్రోజెక్టుల గురించి మాట్లాడ్డం లేదు.
తాజాగా వినిపిస్తున్న అప్డేట్ మేరకు కొరటాల బదులు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబుని లైన్ లో పెట్టే ఆలోచన జరుగుతున్నట్టు సమాచారం. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్ టైనర్ గా పెద్ది టైటిల్ తో ఇతను ఎప్పటి నుంచో కథ రాసుకుంటున్నాడు. ఇప్పుడు దాన్నే తెరకెక్కించే ప్రతిపాదన ఉన్నట్టు తెలిసింది. వచ్చే ఏడాది వేసవిలోగా సలార్ పూర్తి చేసి ప్రశాంత్ నీల్ ఫ్రీ అవుతాడు కాబట్టి ఆలోగా జూనియర్ ఎన్టీఆర్ తనను తాను ఖాళీగా ఉంచుకుంటే కెజిఎఫ్ డైరెక్టర్ తో కాంబో సెట్ అయిపోతుంది. అక్కడి నుంచి ఎంతలేదన్నా ఒక ఏడాది దానికి కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి అభిమానుల కోసమైనా సరే తారక్ వీలైనంత త్వరగా కొత్త సినిమా మొదలుపెట్టాలి.
అరవింద సమేత వీర రాఘవ తర్వాత సోలో హీరోగా తారక్ కు చాలా గ్యాప్ వచ్చేసింది. బాహుబలి కోసం ప్రభాస్ అయిదేళ్ళు త్యాగం చేశాడంటే దానికి తగ్గ ఫలితం అందుకున్నాడు. జాతీయ స్థాయిలో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. కానీ ఆర్ఆర్ఆర్ చేసినందు వల్ల రామ్ చరణ్ తో సమానంగా క్రెడిట్ పంచుకోవాల్సి వచ్చింది. అంతర్జాతీయంగా వస్తున్న పేరులో అధిక భాగం రాజమౌళికే వెళ్తోంది. సో తారక్ కు లాభం కంటే జరిగిన నష్టమే ఎక్కువ. దీన్ని వీలైనంత త్వరగా పూడ్చుకోవాలంటే ఎక్కువ సినిమాలు చేయాలి. హిట్టు ఫ్లాపు తర్వాత. కౌంట్ పెరిగితే ఫ్యాన్స్ అసంతృప్తిని చాలా మటుకు తగ్గించే అవకాశం ఉంటుంది. మరి ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారో!