అప్పటి రజనీకాంత్ క్రేజ్ ఏమైంది ?

ఇంకో రెండు రోజుల్లో రజనీకాంత్ దర్బార్ విడుదల కానుంది. తమిళనాట ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదటిసారి మురుగదాస్ తలైవా కాంబినేషన్ మూవీ కావడంతో అభిమానులు ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్న నమ్మకంతో ఉన్నారు. కాని తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా నత్త నడకతో కొనసాగుతున్నాయి. 

ఖచ్చితంగా చెప్పాలంటే రజని కొట్టిన ఆఖరి గట్టి హిట్టు రోబోనే. అందుకే క్రమంగా రజని సినిమాలపై తెలుగు ప్రేక్షకుల ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు దర్బార్ మీద హైప్ లేకవడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఒకప్పుడు బాషా, నరసింహ లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్స్ తో మన స్టార్లు సైతం భయపడే మార్కెట్ సృష్టించుకున్న ఈ సూపర్ స్టార్ మళ్ళి పునఃవైభవం దర్బార్ తో అయినా సాధించాలని ఫ్యాన్స్ కోరిక. గురువారంతో ఇది నిజమవుతోందో లేదో తేలిపోతుంది.

మొదటిరోజు ఏదోలా ఫుల్ చేసినా వచ్చే టాక్ ని బట్టే ఆపై రోజుల వసూళ్లు ఆధారపడి ఉంటాయి. అసలే అతి తక్కువ గ్యాప్ తో సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో, ఎంత మంచివాడవురా బాక్స్ ఆఫీస్ పైకి దాడి చేయబోతున్నాయి. ఈ నేపధ్యంలో దర్బార్ వీటికి ఎదురుకుని విజేతగా నిలవడం అంత సులువుగా కనిపించడం లేదు. అసలు రజని క్రేజ్ ఇంతగా తగ్గిపోవడానికి కారణాలు లేకపోలేదు.
గత కొన్నేళ్ళుగా రజనికి టాలీవుడ్ లో కనీస స్థాయిలో యావరేజ్ సినిమా కూడా లేదు. 2019 సంక్రాంతికి వచ్చిన పేట తీవ్రంగా నిరాశ పరచగా 2.0 పెట్టుబడి లెక్కల్లో ఫెయిల్యూర్ గా నిలిచింది. అంతకు ముందు కాలా, కబాలిలు సైతం బయ్యర్లకు పీడకలగానే మిగిలాయి. పోనీ యానిమేషన్ లో రూపొందిన విక్రమసింహ అయినా మెప్పించిందా అంటే అదీ లేదు. జగపతిబాబుతో కలిసి చేసిన కథానాయకుడు కూడా అంతంత మాత్రంగానే ఆడింది. 

Show comments