iDreamPost
android-app
ios-app

నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా.. ఎందుకంటే..

నిర్భయ దోషుల ఉరి మరోసారి వాయిదా.. ఎందుకంటే..

నిర్భయ దోషుల ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ఒకే కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషుల పట్ల వివక్ష చూపకూడదనే ఉద్దేశంతోనే ఉరిశిక్షను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశామని ఢిల్లీ పాటియాలా హౌజ్‌ కోర్టు స్పష్టం చేసింది. దోషులు శిక్ష నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్న ఆరోపణలు పక్కనపెడితే.. దోషులకు చట్టపరంగా ఉన్న అవకాశాలు అన్నింటినీ కల్పించడం నాగరిక సమాజానికి గుర్తింపు వంటిదని పేర్కొంది. ఈ ,మేరకు నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో నలుగురు దోషులు ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్తాలకు ఉరిశిక్షపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇప్పటి వరకు ఏమి జరిగిందంటే..

2012, డిసెంబర్ 16న అర్ధరాత్రి 23 ఏళ్ల విద్యార్థినిపై కదులుతున్న బస్సులో ముఖేష్‌ సింగ్‌, వినయ్‌ శర్మ, అక్షయ్‌ కుమార్‌, పవన్‌ గుప్తా సహా రామ్‌సింగ్‌(జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు), మరో మైనర్‌(విడుదలయ్యాడు).. పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. బాధితురాలి వాంగ్మూలం మేరకు వారిని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టగా.. అనేక వాయిదాల అనంతరం సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది.

ఈ క్రమంలో నలుగురు దోషులకు జనవరి 22న ఉరిశిక్ష అమలు చేయాలంటూ ఢిల్లీ కోర్టు డెత్‌వారెంట్లు జారీ చేసింది. అయితే ముఖేష్‌ సింగ్‌ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను క్షమాభిక్ష కోరడం.. ఆయన దానిని తిరస్కరించడం తదితర పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఉదయం ఆరు గంటలకు దోషులను ఉరితీయాలంటూ మరోసారి డెత్‌వారెంట్లు జారీ చేసింది. అయితే అప్పటి నుంచి దోషులు ఒక్కొక్కరుగా క్యూరేటివ్‌ పిటిషన్లు, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడం, రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో మరోసారి ఉరిశిక్ష వాయిదా పడింది.