iDreamPost
iDreamPost
తనపై రాష్ట్ర పోలీసులు నిఘా పెట్టారని ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో ఆరోపించారు. కనీసం ఇద్దరు పోలీసులు మఫ్టీలో హైదరాబాద్ లోని తన ఇంటిచుట్టూ తిరుగుతున్నారని, మోటార్ సైకిళ్ళపై తనను అనుసరిస్తున్నారని ఆరోపించారు. తనకు రక్షణ కరువైందని, ప్రాణహాని ఉందని మరోసారి ఫిర్యాదు చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం నుండి తనకు ప్రాణహాని ఉన్నదని రమేష్ కుమార్ ఇంతకు ముందే కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ఒక లేఖ రాశారు. ఈ లేఖ వివాదాస్పదం అయింది. ఆ లేఖలో ఒక రాజకీయ ప్రత్యర్థి స్థాయిలో నిమ్మగడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు. ఒక అధికారిగా, ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధిపతిస్థాయిలో కాక ఒక ప్రతిపక్ష లేదా ప్రత్యర్థి పార్టీ నేతగా ఆయన ముఖ్యమంత్రి పట్ల వ్యాఖలు చేశారు. ముఖ్యమంత్రి హావభావాలు ఒక ఫ్యాక్షనిస్టు విధానాన్ని పోలి ఉన్నాయి అని తీవ్రస్థాయి ఆరోపణలు చేశారు. ఐఏఎస్ అధికారిగా విశేష అనుభవం ఉన్న వ్యక్తి, ప్రత్యేకించి రాజ్ భవన్ లో పదేళ్ళు పనిచేసిన వ్యక్తి ఒక ముఖ్యమంత్రిపై ఇటువంటి పదజాలం వినియోగించకూడదు అనే విజ్ఞత కూడా కోల్పోయి ఆయన కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు లేఖ రాశారు.
అలాగే ఎన్నికల కమిషనర్ హోదాలో ఆయన పెట్టిన సంతకానికీ, కేంద్ర హోమ్ మంత్రిత్వశాఖకు ఆయన రాసిన లేఖలోని సంతకానికి తేడా ఉంది. ఈ రెండు కారణాల రీత్యా ఈ లేఖ ఆయన రాసిఉండరు అని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఎవరో లేఖ రాస్తే రమేష్ కుమార్ తన ఈ మెయిల్ ద్వారా మంత్రిత్వ శాఖకు పంపించి ఉంటారని మొదట కొందరు భావించారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్ధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తమ రాజకీయాలకు వాడుకున్నారని భావించారు. అయితే ఆ లేఖ తానే రాశానని ఇప్పటికి రెండు సందర్భాల్లో ఆయన అంగీకరించారు.
ఆ వివాదాస్పద లేఖలో తనకు ప్రాణహాని ఉందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమేరకు ప్రభుత్వం ఆయనకు భద్రత కూడా పెంచింది. అయితే ఆయనకు ప్రాణహాని ఉన్నప్పుడు ఎవరి నుండి హాని ఉందో, ఎందుకు ఉందో తెలుసుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. అందుకే ఆయన చుట్టూ నిఘా ఉంటుంది. మఫ్టీలో ఉన్న నిఘా వర్గాలు ఆయనను పరిశీలిస్తూనే ఉంటాయి. వ్యక్తిగత భద్రతకోసం నియమించిన రక్షణ బృందాలతో పాటు నిఘావర్గాలు కూడా పనిచేస్తూ ఉంటాయి.
సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో ప్రభుత్వంలో పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిఘా వర్గాల పనితీరు గమనించకపోవడం అనాలోచితం అవుతుంది. ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు నిఘావర్గాలు రంగంలోకి తిగుతాయి అనే స్పృహ లేకపోతే అధికారిగా ఆయన తన అనుభవాన్ని కోల్పోయారనే చెప్పాలి.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేసే ఉద్దేశంతో తనకు ప్రాణహాని ఉన్నదని చెప్పిన విషయాన్ని, తద్వారా వచ్చే నిఘాను ఆయన విస్మరించారు. సహజంగా ఇలాంటి ఆరోపణలు రాజకీయనాయకులు చేస్తూ ఉంటారు. ప్రత్యేకించి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉండే ప్రతిపక్ష నేతలు అధికారంలో ఉన్న మంత్రులు, ముఖ్యమంత్రులపై ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఉంటారు.
అధికారులకు ముఖ్యమంత్రి లేదా మంత్రులతో విబేధాలు ఉన్నప్పుడు ఆ విబేధాలనుండి తప్పుకునే ప్రయత్నం చేస్తారు. సంబంధిత శాఖ నుండి తప్పుకోవడమో లేదా పూర్తిగా రాష్ట్రప్రభుత్వం నుండి తప్పుకుని కేంద్ర సర్వీసులకు వెళ్ళడమో చేస్తారు. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ సర్వీసులో లేరు కాబట్టి, ఎన్నికల సంఘం అనే రాజ్యాంగ పదవిలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంతో వివాదాన్ని పెంచుకునే ప్రయత్నం చేసి ఉండకూడదు.
వాయిదా వేస్తూ ఎన్నికల నియమావళి కొనసాగిస్తూ ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం పట్ల ఆయన పునఃసమీక్ష చేసుకుని ఉండాల్సింది. కనీసం సుప్రీం కోర్టు ఎన్నికల నియమావళి తొలగిస్తూ తీర్పు ఇచ్చినప్పుడైనా తన నిర్ణయాన్ని, తన విధానాన్ని మార్చుకుని ఉండాల్సింది. అలా కాక ప్రభుత్వంతో రాజకీయ ప్రత్యర్థిలా ఢీకొట్టే ప్రయత్నం చేయడం, ముఖ్యమంత్రిపై ఫ్యాక్షనిస్టు ముద్రవేయడం ఆయన స్థాయికి తగదు. కేంద్రానికి ఆ లేఖ రాయకుండా ఉండి ఉంటే సమస్య ఇంతవరకు వచ్చి ఉండేది కాదు.
ఆ తర్వాత కూడా రాష్ట్ర హై కోర్టు తీర్పుతో ప్రభుత్వంపై విజయం సాధించిన రీతిలో ఆయన ప్రవర్తించకుండా ఉండి ఉంటే కూడా పరిస్థితి ఈ స్థాయికి వచ్చేది కాదు. హై కోర్టు తీర్పు వచ్చిన తర్వాత ఇప్పుడు రాసినట్టే గవర్నరు కు ఒక లేఖ రాసివుంటే పరిస్థితులు వేరుగా ఉండేవి. ప్రత్యర్థిపై విజయం సాధించానన్న ఆనందోత్సాహంతో ఆయన తనకు తానే ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి మరో తప్పు చేశారు.
ఇన్ని పొరపాట్ల తర్వాత తనపై నిఘా ఉందని ఒకవైపు, తనను కమిషనర్ గా పునఃర్నియమించాలని మరోవైపు లేఖలు రాస్తే సమస్య సానుకూలంగా పరిష్కారం అవదు. పైగా ఒక రాజ్యాంగ పదవిలో ఉన్నాను అని చెప్పుకుంటూనే ఒక రాజకీయపార్టీ నేతను కలవడం నిమ్మగడ్డ చేసిన మరో తప్పిదం.
రాష్ట్ర ప్రభుత్వం నుండి రక్షణ కావాలన్నా లేక తన పదవిలో తాను తిరిగి కూర్చోవాలన్నా హైదరాబాద్ లో ఉంటున్న కేంద్ర హోం శాఖ సహాయమంత్రి బీజేపీ నేత కిషన్ రెడ్డిని కలిసి ఉంటే అది వేరు. వివాదాస్పదుడు అయిన సుజనా చౌదరిని కలవడం, అదికూడా తన తరపున ఇటు హై కోర్టు, అటు సుప్రీం కోర్టులో వేసిన మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ తో కలిసి సుజనా చౌదరిని కలవడం వివాదాస్పదమే అవుతుంది. ఈ భేటీ వల్ల నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వానికి, అధికార పార్టీకి, ముఖ్యమంత్రికి రాజకీయ ప్రత్యర్థిగా పనిచేస్తున్నారని మరోసారి ఋజువైంది.
టీవీ చర్చల్లో టీడీపీ నేతలు చేసే వాదనలు కోర్టులో చెల్లవు అని సీనియర్ ఐఏఎస్ అధికారి అయిన నిమ్మగడ్డ రమేష్ కు ఎవరు చెప్పావలసిన అవసరం లేదు.రమేష్ కుమార్ రాజ్యాంగ పదవిలో ఉన్నాడా లేడా అన్నది కోర్టు తుది తీర్పులో తేలుతుంది. ఈ లోపు రాజకీయ నేతలతో రహస్య సమావేశాలు జరపటం ఆయన విశ్వసనీయతను దెబ్బతీస్తుంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను పదవి నుంచి తప్పించటం మీద “ప్రజా ప్రయోజన వాజ్యం” వేసిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ కేసులో ప్రజా ప్రయోజనాలు లేవని,కేవలం నిమ్మగడ్డ ప్రయోజనాలు,కామినేని రాజకీయ ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయని ఎవరైనా కోర్టుకు వెళ్లొచ్చు..
పార్క్ హయత్ సీసీ కెమెరాల వీడియో బయటకు రావటం మీద కొన్ని ఛానళ్ల వాదనలు చూస్తే ప్రైవైట్ సంస్థల గురించి వారికి ఎందుకు అంత శ్రద్ద అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. గతంలో “రాజ్ భవన్”లో రాసలీలలు అంటూ స్టింగ్ ఆపరేషన్ చేసిన ఒక ఛానల్ ఇప్పుడు ప్రైవసీ గురించి బాధపడటం అత్యంత ఆశ్చర్యకరం.ఈ సందర్భంలో నాడు గవర్నర్ ప్రిన్సిపుల్ సెక్రెటరీగా ఇదే నిమ్మగడ్డ రమేష్ ఉండటం యాదృచ్చికమేనా ?అన్న అనుమానం ప్రజల్లో తలెత్తుతుంది. .
రమేష్ కుమార్ నిన్న ఎన్నికల కమీషన్ కార్యదర్శి వాణిమోహన్ కు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో మీరు వ్యవహరిస్తున్న తీరు సరికాదు.హై కోర్టు ఉత్తర్వులను అమలు పర్చకపోతే తలెత్తే పరిణామాలకు మీరే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలంటూ హెచ్చరించారు.ఇదే బెదిరింపు అనుకుంటే “ఇప్పుడు మీరు తీసుకుంటున్న న్యాయ సలహాలు రేపు కోర్టు ముందు మీకు రక్షణగా నిలవలేవు” అని ,సరైన నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశం అని తీవ్ర బెదిరింపులకు దిగారు..
హై కోర్టు తీర్పు మీద ఏజీ శ్రీరామ్ చెప్పిన విషయాలు,సుప్రీం కోర్టు లో అప్పీల్.. కోర్టు తాము విచారిస్తాము అని చెప్పిన విషయాలు ఏవి రమేష్ కుమార్ పట్టించుకున్నట్లు లేరు.. సుప్రీం కోర్టులో ప్రభుత్వానికి చెంపదెబ్బ అన్ని పెద్ద పెద్ద అక్షరాలతో కొన్ని పత్రికలు రాసిన వార్తలు చదివి రమేష్ కుమార్ భ్రమలో పడ్డట్టున్నారు..అదే సుప్రీం కోర్టు రమేష్ కుమార్ ను SEC గా కొనసాగించమని చెప్పలేదన్న వాస్తవం విస్మరించి ఇలా ఎన్నికల కమీషన్ కార్యదర్శి వాణిమోహన్ కు ఉత్తరం రాయటం ఫక్తు రాజకీయం.
రమేష్ కుమార్ రాజకీయ నాయకుడిలాగా ఆరోపణలు చేయటం,రహస్య సమావేశాలు జరపటం వాంఛనీయం కాదు..రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నవాళ్లు రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించాలి…