iDreamPost
android-app
ios-app

కోనసీమలో కొత్తరకం వైరస్

కోనసీమలో  కొత్తరకం వైరస్

చైనాలో పుట్టిన కరోనా వైరస్ తో యావత్ ప్రపంచం గడగడలాడుతోంది. ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది.. అయితే ఈవైరస్ ప్రభావం మన దేశానికీ సోకడంతో వివిధ ప్రాంతాలలో పలు కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే సందర్భంలోనూ కోనసీమలో ఓ కొత్తరకం వైరస్ సోకడంతో అక్కడివారంతా కరోనా వైరస్ గా భయపడుతున్నారు. అయితే అది కరోనా కాదు.. కోనసీమలో వ్యాపించిన కొత్త వైరస్ కేవలం జంతువులపైనే ప్రభావం చూపిస్తుంది.. హెర్సిస్ అనే వైరస్ జంతువులకు మాత్రమే ప్రబలుతుంది. దీంతో కోనసీమ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఈవైరస్ వల్ల ముగజీవాలు లంపిస్కిన్ వ్యాధి బారిన పడి పెద్దఎత్తున చనిపోతున్నాయని అక్కడి ప్రజలు బాధ పడుతున్నారు.

ఈవైరస్ సోకి లంపిస్కిన్ వ్యాధితో చనిపోతున్న జంతువులను చూస్తున్నవారికి కరోనాపై మరిన్ని భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనలో బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు కరోనా ప్రబలిందన్న వార్తలతో గోదావరి జిల్లాల ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

హెర్సీస్ వైరస్ వల్ల “లంపిస్కిన్” అనే వ్యాధితో జంతువులతోపాటు పక్షులు కూడా మరణిస్తున్నాయని, ఈ వైరస్ వల్ల పశువులకు, కోళ్లకు శరీరంపై భయంకర కణతులు,పుండ్లు, రంధ్రాలు వచ్చి తీవ్ర రక్తస్రావంతో విలవిల్లాడుతున్నాయని, పశు వైద్య శాఖాధికారులు ఈ వైరస్ ప్రబలకుండా కాపాడాలని కోరుతున్నారు. అయితే ఈ వైరస్ కు ఎలాంటి వైద్యంలేదని పశు సంబంధిత వైద్యాధికారులు చెబుతున్నారు. దీంతో ప్రజల్లో భయాందోళన మరింత పెరిగిపోతోంది. చాలా ప్రాంతాల్లో 25కి పైగా ఆవులు చనిపోయాయి. పెద్ద సంఖ్యలో పశువులు మరణించటంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని వాపోతున్నారు.. వెయ్యికి పైగా ఆవులకు ఈ వైరస్ సోకినట్టు తెలుస్తోంది..

ఉత్తరాది ప్రాంతంనుంచి కోనసీమకు ఈవైరస్ వ్యాపించినట్టు వెటర్నరీ వైద్యులు వెల్లడించారు. కోళ్ళకు కూడా నెమ్మదిగా ఈవ్యాధి సోకుతుండటంతో కోళ్లు గుట్టలు గుట్టలుగా చనిపోతున్నాయి. కోళ్ళు మృత్యువాత పడుతున్నాయి. అందుకే కోడిమాంసంతో పాటు మటన్ తినాలన్నా భయపడుతున్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి వ్యాధులకు గల కారణాలు వెల్లడించాలని, పశువులకు అవసరమైన వైద్య సేవలు అందించాలని ముఖ్యంగా ప్రజల్లోకి అపోహలను భయాందోళనలను నివృత్తి చేయాలని కోరుకుంటున్నారు.