మధ్య ప్రదేశ్ రాజకీయం పలు మలుపులు తిరుగుతుంది.గవర్నర్ లాల్జీ టాండన్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలపరీక్ష నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసినా, బలపరీక్షను కొంతకాలం తప్పించడానికి ఈ నెల 26 వరకూ కరోనా నెపంతో మధ్యప్రదేశ్ అసెంబ్లీని స్పీకర్ ప్రజాపతి వాయిదా వేయడంతో బీజేపీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో బీజేపీ సభ్యులు మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ నేతృత్వంలో సుప్రీం కోర్టులో తక్షణం బలపరీక్ష జరపాలని పిటిషన్ దాఖలు చేసారు.
ఈరోజు సుప్రీం కోర్టులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణకు వచ్చింది. దీంతో సుప్రీం కోర్ట్ 24 గంటల్లో వివరణ ఇవ్వాలని స్పీకర్ ప్రజాపతికి, సీఎం కమల్ నాథ్ కి నోటీసులు జారీ చేసి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇప్పటికే గవర్నర్ లాల్జీ టాండన్ అసెంబ్లీలో కాంగ్రెస్ బలపరీక్ష నిర్వహించాల్సిందే అని, ఒకవేళ నిర్వహించకపోతే ప్రభుత్వం మైనారిటీలో ఉన్నట్లు భావించాల్సి వస్తుందని అల్టిమేటం కమల్ నాథ్ ప్రభుత్వానికి జారీ చేశారు.
Read Also: మధ్యప్రదేశ్ బీజేపీకి షాకిచ్చిన “కరోనా”..
ఇదిలా ఉంటె తమను ఎవరూ నిర్బంధించలేదని కమల్ నాథ్ సర్కారుపై తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందని, కమల్ నాథ్ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నామని తిరుగుబాటు ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తమ రాజీనామాలు స్పీకర్ ఆమోదించలేదని రాజీనామాల విషయంలో తాము రేపు సుప్రీంకోర్టుకు వెళ్తున్నట్లు తెలిపారు. తమకు కమల్ నాథ్ సర్కార్ నుండి ప్రాణహాని ఉందని తమకు కేంద్రం రక్షణ ఇవ్వాలని పేర్కొన్నారు.
Read Also: సుప్రీంకు చేరిన మధ్యప్రదేశ్ రాజకీయాలు
గవర్నర్ ఈరోజు మధ్యాహం లోపులో బలపరీక్ష జరపాలని మరోసారి ఆదేశాలు జారీ చేసారు. 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీ చెరలో బెంగళూరులో ఉన్నట్లు తెలిసినా బలపరీక్షను కోరాలని చెప్పడమేంటని గవర్నర్‌ను ప్రశ్నిస్తూ కమల్‌నాథ్ ఆయనకో లేఖరాశారు. ఎమ్మెల్యేలు విడుదల కానంతవరకూ పరీక్ష సాధ్యం కాదని కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. కాగా తమకున్న 106 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ ముందు పరేడ్ నిర్వహించింది.
కాగా సంక్షోభంలో పడిన తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి కమల్ నాథ్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న దానిపై ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.