iDreamPost
iDreamPost
అనంతపురం జిల్లాలో తొందరలోనే రెండు భారీ పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి. పరిశ్రమల ఏర్పాటుకు అడ్డంకులుగా ఉన్న నిబంధనలను సడలించాలంటూ రెండు పారిశ్రమల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. అయితే నిబంధనల సడలింపు విషయంలో ప్రభుత్వం ఇంతకాలం ఆసక్తి చూపకపోవటంతో పరిశ్రమల ఏర్పాటు సందిగ్దంలో పడింది. అయితే సమస్య జగన్మోహన్ రెడ్డి దృష్టికి రావటంతో వెంటనే నిబంధనల సడలింపుకు ఓకే చెప్పటంతోనే రెండు పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
ఇంతకీ విషయం ఏమిటంటే బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న వీరవాహన్ ఉద్యోగ్ లిమిటెడ్, ఏరోస్సేస్ డిఫెన్స్ పార్క్ ఆధ్వర్యంలో రెండు పరిశ్రమలను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయటానికి ముందుకొచ్చాయి. అయితే కియా మోటార్స్ ఏర్పాటు విషయంలో 2017లో ప్రభుత్వం జీవో 151 ద్వారా ఓ నిబంధన తీసుకొచ్చింది. అదేమిటంటే కియా మోటార్స్ ఫ్యాక్టరీకి 10 కిలోమీటర్ల పరిధిలోపల మరో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయకూడదన్నది ఆ నిబంధన.
అయితే ఏ ఫ్యాక్టరీ ఏర్పాటు కావాలన్నా నీటి సౌకర్యం, రవాణా సౌకర్యాలు ప్రధానమన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సౌకర్యాలు చూసుకునే వీరవాహన్, ఏరోస్పేస్ యాజమాన్యాలు ఉత్పత్తి యూనిట్లు పెట్టాలని అనుకున్నాయి. నిజానికి కియా మోటార్స్ యూనిట్ ఏర్పాటుకన్నా ముందే పై రెండు కంపెనీలు యూనిట్లు పెట్టాల్సింది. కాకపోతే కియా అన్నది అంతర్జాతీయ సంస్ధ కాబట్టి అప్పట్లో చంద్రబాబునాయుడు ధక్షిణా కొరియా సంస్ధకే ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో కియా కోసమనే ప్రత్యేకంగా జీవో 151 జారీ చేయటంతో పై రెండు యాజమాన్యాలు తమ యూనిట్లను ఏర్పాటు చేయలేకపోయాయి.
ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే మళ్ళీ అధికారుల స్ధాయిలో చర్చలు మొదలయ్యాయి. అయితే నిర్ణయం తీసుకోవాల్సింది జగన్ కావటంతో చివరకు విషయం సిఎంవోకు చేరింది. ఇదే విషయమై జగన్ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. దాంతో అన్నీ విషయాలను పరిశీలించిన తర్వాత జీవో 151 విషయంలో పై రెండు కంపెనీలకు ప్రత్యేక మినహాయింపులు ఇవ్వాలని జగన్ ఆదేశించటంతో మూడేళ్ళ సమస్య పరిష్కారమైంది. వీరవాహన్ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ కోసం 1000 కోట్ల రూపాయల పెట్టుబడికి రెడీగా ఉంది. బహుశా కరోనా వైరస్ సమస్య తగ్గిపోగానే రెండు యాజమాన్యాలు క్షేత్రస్ధాయిలో పనులు మొదలు పెడతాయని అనుకుంటున్నారు.