iDreamPost
android-app
ios-app

సినిమా షూటింగుల కోసం కొత్త గైడ్ లైన్స్

  • Published Jun 02, 2020 | 5:01 AM Updated Updated Jun 02, 2020 | 5:01 AM
సినిమా షూటింగుల కోసం కొత్త గైడ్ లైన్స్

టాలీవుడ్ లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బాషల సినిమా పరిశ్రమలు ఎదురు చూస్తున్న షూటింగుల పునఃప్రారంభానికి సంబంధించి కేంద్రం నుంచి 16 పేజీలతో కూడిన కొత్త గైడ్ లైన్స్ వచ్చేశాయి. అతి త్వరలోనే లైట్స్ కెమెరా యాక్షన్ అనే సౌండ్ వినబోతున్నాం. రెండున్నర నెలలుగా కరోనా కారణంగా ఇంటికే పరిమితమైన నటులు, దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ కార్మికులు ఇకపై బిజీ కాబోతున్నారు.

అయితే గతంలోలా వ్యవహారం అంత సులువుగా ఉండేలా కనిపించడం లేదు. నియమ నిబంధనలు పాటిస్తూ వాటికి అనుగుణంగా పనులు చేసుకోవాలి తప్పించి మా ఇష్టం వచ్చినట్టు అంటే మాత్రం కుదరదు. అందులోనూ వైరస్ కట్టడి పూర్తిగా జరగలేదు కాబట్టి ప్రతి ఒక్కరు అవసరానికి మించిన జాగ్రత్తగా ఉండాల్సిందే. కాకపోతే నిర్మాతకు అదనపు భారం మాత్రం భారీగా ఉండబోతోంది, మరి స్టార్లు తమ పారితోషికాలను తగ్గించుకుని ఈ భారాన్ని పంచుకుంటారా లేదా చూడాలి. ఇక కొత్తగా వచ్చిన గైడ్ లైన్స్ ఈ విధంగా ఉన్నాయి

* శానిటైజేషన్, చేతులు కడుక్కోవడం, మాస్కులు తోడుక్కోవడం, గ్లౌజులు ధరించడం తప్పనిసరి. సీన్లు తీస్తున్నప్పుడు అందులో ఉన్న నటీనటులు తప్ప మిగలిన ప్రతిఒక్కరికి ఇది వర్తిస్తుంది

* సెట్/స్టూడియోలో ప్రవేశించే ముందు ధర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవలసిందే. టెంపరేచర్ ఏ మాత్రం ఎక్కువగా ఉన్నా నో ఎంట్రీ

* ప్లేట్స్, గ్లాసులు అన్ని డిస్పోజబుల్ అయ్యుండాలి. ఏవైనా సామగ్రి, మెషినరీ లాంటివి వాడిన ప్రతిసారి శానిటైజ్ చేయాల్సిందే. ఇది కరెంట్ మీటర్లకు, కెమెరాలకు కూడా వరిస్తుంది

* ప్రతి ఒక్కరి ఫోన్ లో ఆరోగ్య సేతు యాప్ తో పాటు షూటింగ్ జరుగుతున్నంత సేపు బయట ఒక అంబులెన్స్, అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో ఉండేలా చూసుకోవాలి

* గర్భవతులకు ప్రవేశం ఉండదు. 60 ఏళ్ళు పైబడిన వారు తప్పనిసరిగా పాల్గొనాలి అంటే వాళ్ళకు ప్రత్యేకమైన వసతులు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ అభిమానులను దగ్గరకు రానివ్వకూడదు

* ఆడిషన్స్ ని సాధ్యమైనంత మేర ఆన్ లైన్ లో నిర్వహించాలి. ఉదాహరణకు జూమ్ లాంటివి వాడుకోవచ్చు

* మేకప్ సిబ్బంది, హెయిర్ డ్రస్సర్స్ లు పిపిఈ కిట్లు ధరించాలి. వాళ్ళు విధి నిర్వహణలో ఉన్నప్పుడు సంబంధం లేని వ్యక్తులు దగ్గరకు వెళ్ళకూడదు. పనికి ముందు వెనుక శానిటైజేషన్ తప్పనిసరి

* 10 ఏళ్ళ లోపు పిల్లలు పాల్గొనడం తప్పనిసరి అయితే వాళ్ళతో ఒక్కరు మాత్రమే వ్యక్తిగత సిబ్బంది ఉండాలి. ప్రత్యేక పర్యవేక్షణ జరగాలి

* సెట్స్ లో సాధ్యమైనంత ఒకరినొకరు తాకరాదు. ఫోన్లు మార్చుకోరాదు. భోజనాలు ఇంటి నుంచి వచ్చేలా ప్లాన్ చేసుకోవడం ఉత్తమం

* యాక్టర్స్ కు ప్రత్యేక రవాణా ఉండేలా చూసుకోవాలి. సాధ్యమైనంత పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కు దూరంగా ఉండనిస్తే మంచిది

* ప్రొడక్షన్ బృందాలకు ప్రత్యేక విభాగాలు ఉంటే సెట్లో రద్దీ తగ్గే అవకాశం ఉంటుంది. ఆ మేరకు చర్యలు చేపట్టాలి

* నాన్ ఫిక్షన్/రియాలిటీ షోల సీట్ల మధ్య భౌతిక దూరం తప్పనిసరి

* సెట్ లో ఉన్నవారికి లేదా వారి బంధువులు స్నేహితులు ఎవరిలో కరోనా లక్షణాలు కనిపించినా స్వచ్చందంగా క్వారెంటైన్ కు వెళ్లిపోవాలి

* స్టూడియోలలో ప్రతి ఫ్లోర్ ని సెట్టింగ్ ని రెగ్యులర్ గా శానిటైజ్ చేయాలి

* సినిమా/టీవీ షూటింగులకు సంబంధించి ఆ ప్రాంత కలెక్టర్ నుంచి రాతపూర్వక అనుమతి తీసుకున్నాకే ప్రారంభించుకోవాలి.

ఇవండీ ప్రభుత్వం ఇచ్చిన నూతన నియమ నిబంధనల్లోని ముఖ్యమైన అంశాలు. చదవడానికి ఎలా ఉన్నా ఇవి ప్రాక్టికల్ గా అమలు చేయడంలో చాలా ఇబ్బందులు ఎదురవ్వడం ఖాయం. ఇక్కడ బాధ్యత వహించాల్సింది ముందుగా నిర్మాతే కాబట్టి అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా ఉండాలి. ఒకరకంగా చెప్పాలంటే ఎయిర్ పోర్ట్ లో ఏవైతే గైడ్ లైన్స్ ఉన్నాయో అచ్చంగా వాటినే ఇక్కడా ఇస్తున్నారు. పని జరిగే స్పాట్ వేరే అంతే. మరి డేట్ ఫిక్స్ అయ్యాక నిర్మాతలు తమ షూటింగు పనులతో పాటు పైన చెప్పిన నియమనిబంధనలకు తగ్గట్టు అదనపు ఏర్పాట్లు చేసుకోవడంలో ఊపిరి సలపనంత బిజీ అవ్వడం మాత్రం ఖాయం.