కోవిడ్ 19 ఏపీ ఫార్మా.. కరోనాపై సమాచారానికి కొత్త యాప్..

కరోనా వైరస్ వ్యాప్తికి కావాల్సింది వాస్తవ సమాచారమే. సమాచారం లేనిదే ప్రభుత్వమైనా అధికారులైన ఏమి చేయలేరు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా కట్టడికి అవసరమైన సమాచారం సేకరణ కోసం ఓ పక్క మానవ వనరులను, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని అత్యుత్తమ స్థాయిలో వినియోగించుకుంటుంది. గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా మూడుసార్లు ఇంటింటి సర్వే చేపట్టిన వైఎస్ జగన్ సర్కారు.. విదేశాల నుంచి వచ్చిన వారిని, కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న వారిని గుర్తించింది. ఆ సమాచారం మేరకు లక్షణాలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తోంది. వారందరినీ హోమ్ క్వారంటైన్ చేసి వారిపై నిత్యం నిఘా ఉంచేందుకు ప్రత్యేక యాప్ ను రూపొందించింది. ఇక తాజాగా రెడ్ జోన్లు, హాట్ స్పాట్ లు, కంటోన్మెంట్ జోన్ లలోని ప్రజలపై నిఘా పెట్టేందుకు, అక్కడ లాక్ డౌన్ పటిష్టంగా అమలు చేసేందుకు కూడా మరో యాప్ ను తయారు చేస్తున్నామని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇటీవల ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపులలో జలుబు, దగ్గు, జ్వరం, శ్వాసకోస సంబంధిత అనారోగ్యానికి మందులు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆయా అనారోగ్యంతో బాధ పడే వారి జాబితాను మెడికల్ దుకాణాల నుంచి సేకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ను తయారు చేసింది. ”కోవిడ్ 19 ఏపీ ఫార్మా” అనే యాప్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రవేశపెట్టింది. ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది. కరోనా అనుమానిత లక్షణాల కు మందులు కొనుగోలు చేసే వారి వివరాలు అందులో పొందుపరచాలని స్పష్టం చేసింది.

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ కావలసి ఉంటుంది. తర్వాత ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఓటిపి వస్తుంది. ఆ నెంబర్ తో యాప్ లోకి లాగిన్ అవ్వాలి. జ్వరం, దగ్గు, జ్వరం, శ్వాసకోస ఇబ్బంది వంటి లక్షణాలతో మందుల కోసం మెడికల్ షాప్ కి వచ్చే వారి వివరాలు ఈ యాప్ లో పొందుపరచాలి. ఈ సమాచారం మేరకు స్థానిక ప్రభుత్వ మెడికల్ ఆఫీసర్ వచ్చి సంబంధిత వ్యక్తులకు చికిత్స అందిస్తారు.

Show comments