iDreamPost
android-app
ios-app

ఏమరుపాటు తగదు మిత్రమా..!

  • Published May 26, 2020 | 3:52 PM Updated Updated May 26, 2020 | 3:52 PM
ఏమరుపాటు తగదు మిత్రమా..!

‘కరోనా వచ్చిన కొత్తలో మూతికి మాస్కు, జేబులో శానిటైజర్‌’ పెట్టుకున్నాం. ఇప్పుడు కేసులు పెరుగుతుంటే మాత్రం వాటిని పక్కనపెట్టేసి తిరుగుతున్నాం.. కరోనా అలియాస్‌ కోవిడ్‌ గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తుతం హల్‌చేస్తున్న ఒక ఓ పంచ్‌డైలాగ్‌ ఇది. ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకుంటే ఇది నిజమేకదా అన్పించకమానదు. భౌతిక దూరం పాటించండి, మాస్కు పెట్టుకోండి మొర్రో అని ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం చేతులెత్తి మొక్కుతున్నా జనంలో ఆ స్థాయి స్పందన కన్పించడంలేదు. దీంతో ఏం చేయాలో తోచక సదరు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. భయపడొద్దు, అప్రమత్తంగా ఉండండి అని చెబుతున్నప్పటికీ జనం చూపిస్తున్న ఈ నిర్లక్ష్యం అంతిమంగా వైద్యరంగంపై తీవ్రమైన ఒత్తిడిని పెంచేదే అంటే అతిశయోక్తి కాదు.

పదేళ్ళలోపు చిన్నారులు, అరవయ్యేళ్ళు పైబడ్డ వృద్ధులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని ఐసీయంఆర్‌ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నెలకు దాపుగా 15 లక్షల మందికిపైగా జన్మిస్తున్న మన దేశంలో ప్రజలు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక సారి గుర్తించాల్సిన అవసరం ఎంౖతైనా ఉంది. తొమ్మిదినెలల కాలంలో దాదాపు రెండు కోట్ల మంది చిన్నారులు జన్మిస్తారని ఒక అంచనా. ఈ లెక్కన ఆ చిన్నారుల తల్లులు, వారి కుటుంబాలు ఏ స్థాయిలో జాగ్రత్తలు పాటించాలో అర్ధం చేసుకోవాలి. కేవలం మూడు శాతం మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయని నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ఆ మూడు శాతంలో వారివారి కుటుంబాలు ఉండవన్న గ్యారెంటీ ఏం లేదనే చెప్పాలి.

కరోనా తనకు తానుగా రాదు.. మనమే వెళ్ళి తెచ్చుకోవాలన్నది ఖచ్చితమైన మాట. నిర్లక్ష్యం, అవగాహనా రాహిత్యం కారణంగా కరోనా భారిన పడుతున్నాం. విపరీతంగా వ్యాపిస్తున్న ప్రతి చోటా ఈ నిర్లక్ష్యం బైటపడుతూనే ఉంది. ఇప్పటికైనా తగు జాగ్రత్తలు పాటించకపోతే అంతిమంగా నష్టపోయేది ఎవరికి వారేనన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రభుత్వాలు చేతనైనంత చేస్తున్నాయి. వైద్య రంగం, పోలీస్‌లు, ఇతర సిబ్బంది శక్తిమేరకు కరోనా వ్యాపించకుండా కృషి చేస్తున్నారు. కానీ బాధ్యత వహించాల్సిన సగటు మనిషి తన బాధ్యతను సక్రమంగా నెరవేర్చకపోతే మాత్రం వీరి కష్టాలు, త్యాగాలు అన్నీ వృధాగానే మిగిలిపోతాయి.