iDreamPost
iDreamPost
ఓటిటి వెబ్ లో భారీ సంచలనానికి దారి తీస్తుందనే అంచనాలతో నెట్ ఫ్లిక్స్ భారీ బడ్జెట్ తో మల్టీ స్టారర్ రేంజ్ లో రూపొందించిన నవరస మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొమ్మిది టీములు కలిసి రూపొందించిన ఈ ఎపిసోడ్ల మొత్తం నిడివి 5 గంటలు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం పర్యవేక్షణలో ఇది నిర్మించడంతో ఆ రకంగానూ అంచనాలు ఓ స్థాయిలో ఏర్పడ్డాయి. మరి ఇది ముందు నుంచి అనుకుంటున్నట్టు ఆ స్థాయిలో ఉందో లేదో రివ్యూలో చూద్దాం
కరుణ
మొదటి ఎపిసోడ్ టైటిల్ ఎదిరి. అంటే కరుణ. ఇద్దరు వ్యక్తుల మధ్య సంఘర్షణ ఆధారంగా ఇది రూపొందించారు. బిజోయ్ నంబియార్ దర్శకుడు. తన భర్తను కళ్ళ ముందే చంపినా చలనం లేకుండా ఉండిపోయే మహిళకు, అతన్ని హత్య చేసే వ్యక్తికి మధ్య కాంఫ్లిక్ట్ ని మెయిన్ పాయింట్ గా తీసుకున్నారు. కానీ స్క్రీన్ ప్లే సరిగా లేకపోవడంతో ఓ రెండు సన్నివేశాలు అయ్యాక చాలా బరువుగా సాగుతుంది. విజయ్ సేతుపతి రేవతిల నటన హైలైట్ అయినప్పటికీ దీన్ని కాపాడలేకపోయాయి
హాస్యం
సమ్మర్ అఫ్ 1992 టైటిల్ తో ప్రియదర్శన్ తీసిన ఈ భాగం కామెడీని నమ్ముకుంది. తమిళంలో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న యోగిబాబు ఇందులో లీడ్ రోల్. అయితే తనకన్నా చైల్డ్ ఆర్టిస్ట్ మీద సీన్స్ బాగా పండాయి. కానీ డైరెక్టర్ బ్రాండ్ మీద ఎక్కువ అంచనాలు పెట్టుకున్న ప్రేక్షకులను ఇది నిరాశపరుస్తుంది. అక్కడక్కడా నవ్వులు పూశాయి కానీ ఓవరాల్ గా చూసుకుంటే ఇంతేనా అనే ఫీలింగ్ కలగడం ఖాయం. రైటింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే దీని స్థాయి పెరిగేది
అద్భుతం
మూడో భాగం అద్భుత రసంతో ప్రాజెక్ట్ అగ్నిగా చూపించారు. కార్తీక్ నరేన్ దర్శకుడు. ఇద్దరు సైంటిస్టులు భవిష్యత్తులో సృష్టించాలనుకున్న ఓ ఊహాతీత ప్రపంచం గురించిన చర్చలే ఇందులో కీలక అంశం. ఇదే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పిట్టకథలులో నాగ అశ్విన్ తీసిన ఎపిసోడ్ పోలికలు ఇందులో కొన్ని కనిపిస్తాయి. కానీ చాలా సేపు ఇది బోరింగ్ గా సాగుతుంది. చివరిలో ట్విస్ట్ ఓకే అనిపించినా మరీ గొప్పగా అయితే లేదు. ప్రసన్న, అరవింద్ స్వామిల నటన కొంతమేర కాపాడింది
భీభత్సం
నాలుగో ఎపిసోడ్ భీభత్స రసం బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. సీనియర్ నటులు ఢిల్లీ గణేష్ ప్రధాన పోషించిన ఈ భాగంలో ఓ మనిషిలో భయం అసూయలు పీక్స్ కు వెళ్ళిపోతే ఏం జరుగుతుందనే దాని చుట్టూ కథను అల్లుకున్నారు దర్శకుడు వసంత్ సాయి. 1965 ప్రాంతంలో ఓ పెళ్లిలో జరిగిన సంఘటనగా దీన్ని చూపిస్తారు. రోషిని, అదితి బాలన్ ల పెరఫార్మెన్సులు బాగానే ఉన్నప్పటికీ అసలు విషయంలో బలం లేకపోవడంతో వద్దన్నా వేలు ఫార్వార్డ్ ఆప్షన్ వైపు వెళ్ళిపోతుంది
శాంతి
పిజ్జా-జిగర్ తండా-పేట ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందించిన ఐదో ఎపిసోడ్ పీస్ అనగా శాంతి. బాబీ సింహా, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. తన భావజాలాన్ని ఇందులో కూడా రుద్దే ప్రయత్నం చేశాడు కార్తీక్ సుబ్బరాజ్. శ్రీలంక తమిళుల నేపధ్యాన్ని మరోసారి తీసుకుని జగమే తంత్రంలో చేసిన పొరపాటే ఇందులో కూడా చేశాడు. దీంతో ముందుకు సాగే కొద్దీ నీరసం వస్తుంది. అతని ఉద్దేశం ఏదైనా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడం చాలా ముఖ్యం. ఆ విషయంలో ఇది ఫెయిల్ అయ్యింది
రౌద్రం
అన్నిటిలోకి బెస్ట్ అనిపించేది ఇదొక్కటే. రోజా ఫేమ్ అరవింద్ స్వామి రూపొందించిన రౌద్ర ఆరోది. సంతోష్ శివన్ ఛాయాగ్రహణ అనుభవంతో మంచి అవుట్ ఫుట్ తీసుకొచ్చాడు. సరైన రీతిలో ఎమోషన్స్ తో పాటు కథనం టైట్ గా సాగడం, ట్విస్టులు, పెర్ఫార్మన్స్ లు అన్నీ కలిసి సంతృప్తిని ఇస్తాయి. తనలో యాక్టర్ తో పాటు టెక్నిక్స్ తెలిసిన డైరెక్టర్ కూడా ఉన్నాడని అరవింద్ స్వామి స్పష్టంగా మెసేజ్ ఇచ్చేసాడు కాబట్టి త్వరలోనే ఫుల్ లెన్త్ ఫీచర్ ఫిలిం ని ఆశించవచ్చు
భయం
బొమ్మరిల్లు సిద్దార్థ్ నటించిన ఇన్మై(భయం) ఏడో ఎపిసోడ్. టైటిల్ లో ఉన్నంత కంటెంట్ లో లేకపోయింది. కేవలం సన్నివేశాల ఆధారంగా భయానక రసాన్ని చూపించే ప్రయత్నం చేశారు. సిద్దార్థ్ – పార్వతి – అమ్ము అభిరామిలు తమ పాత్రలకు తగ్గట్టు బెస్ట్ ఇచ్చారు కానీ ఆశించిన స్థాయిలో కథనం పండలేదు. తప్పు చేశాక మనిషిలో కలిగే భయాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం దర్శకుడు రదీన్ద్రన్ చేశాడు కానీ ఫలితం జస్ట్ యావరేజ్ దగ్గరే నిలిచిపోయింది
వీరం
మణిరత్నం రాసిన కథతో రూపొందిన ఎనిమిదో భాగం తునిద పిన్. అంటే వీరం. గద్దలకొండ గణేష్ ఫేమ్ అధర్వ ఇందులో ప్రధాన పాత్ర పోషించాడు. సర్జున్ దర్శకుడు. నక్సలైట్లను పట్టుకునే లక్ష్యంతో అడవుల్లో తిరిగే ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. ఎగ్జైటింగ్ అనిపించే అంశాలు ఇందులో ఏమి ఉండవు. అంజలి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఎమోషన్స్ బాగానే చూపించారు కానీ మెయిన్ ప్లాట్ అవుట్ డేటెడ్ అనిపించడంతో పాటు స్క్రీన్ ప్లే లోపల వల్ల సోసోగానే మిగిలింది
శృంగారం
ఇక ఆఖరుది శృంగార రసం. విపరీతమైన అంచనాలు రేగిన సూర్య ఎపిసోడ్ ఇదే. గౌతమ్ మీనన్ దర్శకుడు కావడంతో హైప్ ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఎంతగా ఊరించిందో అంతగా నిరాశపరిచిందని చెప్పక తప్పదు. ఏ మాయ చేసావే, సూర్య సనాఫ్ కృష్ణన్ టైపు మూమెంట్స్ అక్కడక్కడా ఉన్నప్పటికీ అలరించడానికి అవి సరిపోలేవు, సూర్య-ప్రయాగ మార్టిన్ తమ శాయశక్తులా నిలబెట్టే ప్రయత్నం చేశారు కానీ వీక్ స్క్రిప్ట్ ముందు వాళ్ళైనా చేయగలిగింది ఏమి లేదు.
కంక్లూజన్
ఫైనల్ గా చెప్పాలంటే నవరస అన్ని రసాల కన్నా నీరసం ఎక్కువ తెప్పించింది. అయిదు గంటల ప్రేక్షకుల విలువైన సమయానికి తగిన న్యాయం చేయలేక చేతులు ఎత్తేసింది. కేవలం క్యాస్టింగ్, బ్రాండింగ్ మీద తప్ప అసలు కంటెంట్ మీద దృష్టి పెట్టకుండా నెట్ ఫ్లిక్స్ చేస్తున్న పొరపాట్లు ముందు ముందు ఇలాగే కొనసాగితే పెద్ద మూల్యమే చెల్లించాల్సి ఉంటుంది. కేవలం ఆర్టిస్టుల కోసం ఇంతేసి నిడివిని ఓటిటి ఆడియన్స్ భరించరు. ఫ్యూచర్ మేకర్స్ నవరసని ఎలా తీయొకూడదో ఒక పాఠంలా తీసుకోవాలి
ఒక్క మాటలో – నీరసాల రసం
Also Read : SR కళ్యాణ మండపం రివ్యూ