SR కళ్యాణ మండపం రివ్యూ

By Ravindra Siraj Aug. 06, 2021, 01:45 pm IST
SR కళ్యాణ మండపం రివ్యూ

పేరుకి చిన్న సినిమానే అయినా ఇవాళ విడుదలైన వాటిలో అంతో ఇంతో అంచనాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపిన సినిమా SR కళ్యాణ మండపం. థియేటర్లు తెరిచాక భారీ చిత్రాలు రావడానికి భయపడుతున్న తరుణంలో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లకు ఇలాంటివే ఆశాదీపాల్లా కనిపిస్తున్నాయి. కంటెంట్ బాగుండి మౌత్ టాక్ వస్తే తప్ప పికప్ అయ్యే అవకాశాలు లేని ఇలాంటి ఎంటర్ టైనర్లకు మొదటి రోజు రెస్పాన్స్ చాలా కీలకం. అందుకే టీమ్ మొత్తం గత పది రోజులుగా ప్రమోషన్ల వేగం పెంచారు. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా పర్వాలేదనిపించేలా నమోదయ్యాయి. మరి ఇది మెప్పించేలా సాగిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

రాయలసీమ ప్రాంతం రాయచోటిలో ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి కళ్యాణ్(కిరణ్ అబ్బవరం)తన క్లాస్ మేట్ సింధు(ప్రియాంక జవల్కర్)ని అమితంగా ప్రేమిస్తుంటాడు. తాత వారసత్వ ఆస్తిగా ఇచ్చిన SR కళ్యాణమండపాన్ని తాగుడు అలవాటు వల్ల భ్రష్టు పట్టించిన తండ్రి ధర్మా(సాయికుమార్)మీద కోపంతో చిన్నప్పటి నుంచే మాట్లాడ్డం మానేస్తాడు. సింధు తండ్రి(శ్రీకాంత్ అయ్యంగార్)కి కళ్యాణ్ కు మధ్య తాకట్టు విషయంలో గొడవ వస్తుంది. ఒకపక్క ప్రేమ, మరోపక్క ఫంక్షన్ హాల్ ని నడిపించాల్సిన బాధ్యతను రెండింటిని మోసుకున్న కళ్యాణ్ ఈ యుద్ధంలో ఎలా గెలిచాడనేది తెరమీద చూసి తెలుసుకోవాలి

నటీనటులు

రాజావారు రాణిగారుతో పరిచయమైన కిరణ్ అబ్బవరం అందులో యాక్టింగ్ పరంగా పాస్ మార్కులు తెచ్చుకున్నప్పటికీ తనలో అసలైన నటుడిని బయటికి తీసే అవకాశం మాత్రం తనే స్వంతంగా కథ స్క్రీన్ ప్లే మాటలు రాసుకున్న ఈ సినిమాలో దక్కింది. స్క్రీన్ ప్రెజెన్స్ విషయంలో మంచి లుక్స్ ఉన్న కిరణ్ పెర్ఫార్మన్స్ పరంగానూ ఇందులో మెరుగయ్యాడు. ముఖ్యంగా స్టూడెంట్ గా, కొడుగ్గా, మాస్ కోసం చూపించిన వేరియేషన్ లో ఆవేశం నిండిన యువకుడిగా తనవరకు ఇంప్రెషన్ కొట్టేయడంలో ఫెయిల్ కాలేదు. ఇలాగే సానబెడుతూ పోతే ఇండస్ట్రీకి మంచి స్పార్క్ ఉన్న మరో యూత్ హీరో దొరికేసినట్టే.

సరైన పాత్ర దొరకాలే కానీ టైమింగ్ తో చెడుగుడు ఆడే క్యారెక్టర్ లో సాయికుమార్ జీవించేశారు. ఈయన్ని కాకుండా ఇంకెవరినైనా తీసుకుని ఉంటే కాస్త రొటీన్ ఫీలింగ్ కలిగేదేమో కానీ పాత్రను డిజైన్ చేసిన తీరు నప్పింది. భార్యతో గొడవ పడే సన్నివేశాల్లో నవ్వించడం పర్ఫెక్ట్ గా సింక్ అయ్యింది. గత వారం తిమ్మరుసులో పలకరించిన ప్రియాంక జవల్కర్ అందులో కన్నా ఈ సినిమాలో బాగుంది. ఎక్స్ ప్రెషన్లు కూడా ఓకే. తనికెళ్ళ భరణి, తులసి, సుధ, స్వర్గీయ టిఎన్ఆర్ లు తమ సీనియారిటీతో అలవోకగా చేసుకుంటూ పోయారు. శ్రీకాంత్ అయ్యంగార్ కు ఫుల్ లెన్త్ విలన్ దొరికిన ఆనందం కాబోలు మాడ్యులేషన్ తో పాటు బాడీ లాంగ్వేజ్ లోనూ కొంత ఓవర్ చేశారనిపిస్తుంది. స్నేహబృందంలో అరుణ్, అనిల్, భరత్, కిట్టయ్య సపోర్టింగ్ పరంగా పర్వాలేదనిపించారు

డైరెక్టర్ అండ్ టీమ్

యూత్ ని టార్గెట్ చేసే ప్రేమకథలను ప్రతిసారి కొత్తగా విభిన్నంగా చెప్పలేం. ఇది వాస్తవం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఇబ్బంధులు తలెత్తినా క్లైమాక్స్ లో జంట ఒక్కటైపోయి కథ సుఖాంతం అవ్వడం అనే కామన్ పాయింట్ చుట్టే మిగిలిన అంశాలు రాసుకోవాలి. అలా అని ఎస్ఆర్ కళ్యాణ మండపాన్ని ప్యూర్ లవ్ స్టోరీ అని యూనిట్ ఎక్కడా ప్రమోట్ చేయలేదు. దానికన్నా తండ్రి కొడుకుల ఎమోషన్ మీద నడిచే సబ్జెక్టుగానే పబ్లిసిటీ చేశారు. దర్శకుడు శ్రీధర్ గాదె రెండింటిని బ్యాలన్స్ చేసే క్రమంలో పట్టు తప్పిపోయి దీన్ని మధ్యలో నిలబెట్టేయడంతో అటుఇటు కాకుండా ఏ ఫీలింగ్ లేకుండా మిగిలించేశారు.

లైన్ బాగున్నప్పటికీ దాని చుట్టూ డెవెలప్ చేసిన లేయర్స్ ఈ సినిమాలో సరిగా పండలేదు. కళ్యాణ్ సింధుల మధ్య ఎంతసేపూ అల్లరిని హై లైట్ చేశారే తప్ప నిజంగా వాళ్ళ ప్రేమను ఫీలయ్యే అవకాశం ఆడియన్స్ కి దక్కలేదు. పోనీ ధర్మా కళ్యాణ్ మధ్య బాండింగ్ ని సరిగా ఎస్టాబ్లిష్ చేశారా అంటే అదీ లేదు. ఈ లోపం వల్లే ప్రీ క్లైమాక్స్ లో కళ్యాణ్ నాన్న గురించి చెప్పే గొప్పదనం సీన్ చాలా బాగున్నప్పటికీ అందులో అంతర్లీనంగా ఉన్న భావోద్వేగం సగటు ప్రేక్షకులకు దగ్గర కావడంలో తడబడింది. ఒక సీన్ లో నాన్న తాగుతూ కనిపిస్తే మరోసీన్ లో కొడుకు బార్ లో ఉంటాడు. ఫస్ట్ హాఫ్ లో ఇదంతా రిపిటీషన్ లా అనిపిస్తుంది.

దానికి తోడు చిన్న చిన్న పాత్రల కోసం ఏదో మొక్కుబడిగా తీసుకున్న ప్యాడింగ్ ఆర్టిస్టుల విషయంలో తగినంత శ్రద్ధ తీసుకోలేదు. సాయికుమార్ తో సమానంగా స్క్రీన్ స్పేస్ పంచుకున్న అతని అనుచరుడి మొహంలో ఒక్క ఎక్స్ ప్రెషన్ కనిపిస్తే ఒట్టు. నేనింతే మీరు కెమెరాతో అడ్జస్ట్ చేసుకోండి అన్నట్టు ఉంటారు. కళ్యాణ్ బ్యాచ్ మొదటగా చేసే అమ్మాయి తండ్రి పాత్ర కూడా అంతే. సరైన టైమింగ్ లేక అది కూడా తేలిపోయింది. ఇలాంటి లోపాలు చాలానే ఉన్నాయి. కానీ ఎక్కడిక్కడ సాయికుమార్, కిరణ్ లు తమ శక్తి మేరకు వీటిని కవర్ చేసే ప్రయత్నం చేశారు కానీ అది సినిమా మొత్తాన్ని కాపాడలేకపోయింది.

అలా అని సినిమా అంతా మైనస్సులు ఉన్నాయని కాదు. ఎక్కడా అసభ్యత లేకుండా చాలా క్లీన్ గా సినిమా సాగింది. శ్రీధర్ గాదెలో పనితనం ఉంది. కానీ హీరోనే రాసిన కథ మాటలు స్క్రీన్ ప్లే వల్ల తప్పని పరిస్థితుల్లో పరిమితులకు లోబడాల్సి వచ్చిందేమో అనే అనుమానం కలుగుతుంది. నడుము మీద అన్నేసి సీన్లు అవసరం లేకపోయినా ఏదో ఖుషి స్ఫూర్తితో రాసుకున్నారు కానీ ఆ ఎపిసోడ్లు కూడా సోసోనే. అసలు అంత సాగదీసిన లవ్ ట్రాక్ బదులు ఆ కల్యాణ మండపం చుట్టూనే డ్రామా అల్లుకుని కిరణ్ కోరుకున్నట్టు మాస్ ఎపిసోడ్స్, తండ్రితో మరింత బలంగా అనిపించే కనెక్టింగ్ సీన్స్ రాసుకుని ఉంటే ఇది ఇంకో లెవెల్ లో ఉండేది

విడుదలకు ముందే పాటలను యూత్ కి బాగా ఎక్కించేసిన సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ తన పనితనాన్ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లోనూ చూపించాడు. కొన్ని సన్నివేశాల్లో ఎలివేషన్లు పండడానికి కారణం ఇదే. మంచి పిక్చరైజేషన్ కూడా తోడయ్యింది. విశ్వాస్ డేనియల్ ఛాయాగ్రహణం మొదటి సినిమాకే మంచి ఆఫర్లు తెచ్చేలా ఉంది. ఎడిటింగు కూడా చేసిన దర్శకుడు శ్రీధర్ గాదె ల్యాగ్ కు మరో కారణంగా అయ్యారు. శంకర్ ఫైట్స్ బాగున్నాయి. ఏదో మాస్ హీరో రేంజ్ లో డిజైన్ చేసినా చక్కగా కుదిరాయి. నిర్మాతలు ప్రమోద్ రాజులు కథ డిమాండ్ చేసిన మేరకు ఖర్చు పెట్టారు కానీ  బేసిక్ గా సబ్జెక్టే సింపుల్ లైన్ మీద సాగేది కావడంతో రిస్క్ ఫ్యాక్టర్ పూర్తిగా తగ్గిపోయిందిప్లస్ గా అనిపించేవి

ప్లస్ గా అనిపించేవి

కిరణ్ అబ్బవరం
సాయికుమార్ నటన
మూడు పాటలు
ఛాయాగ్రహణం

మైనస్ గా తోచేవి

లవ్ ట్రాక్
సపోర్టింగ్ క్యాస్ట్
స్లోగా సాగే కథనం
జస్ట్ ఓకే ఎంటర్ టైన్మెంట్

కంక్లూజన్

థియేటర్లు తెరుచుకున్నాక కాస్త చెప్పుకోదగ్గ అంచనాలతో చిన్న సినిమాల్లో పెద్ద విడుదలగా అంచనాలు రేపిన SR కళ్యాణ మండపాన్ని కొన్ని సింపుల్ ఎమోషన్స్, పాటలు. లైట్ గా నవ్వించే కామెడీ కోసమైతే చూడొచ్చు. ఈ మాత్రం ఎంగేజింగ్ గా ఉన్న చిత్రాలు రావడం కష్టమైపోతున్న తరుణంలో ఓ మోస్తరుగా జస్ట్ ఓకే అనిపించే లవ్ కం సెంటిమెంట్ డ్రామాను బెస్ట్ ఛాయస్ గా పరిగణించలేం. కానీ తెరమీద చూస్తేనే ఏ సినిమా అయినా ఫీలవుతాం అనే మూవీ లవర్స్ ని మాత్రం మరీ ఎక్కువ నిరాశపరచకపోవచ్చు. ఇలా కాకుండా ఇదో కంప్లీట్ ప్యాకేజ్ అయ్యుంటే మాత్రం బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా దక్కేది. కానీ ఛాన్స్ మిస్ అయినట్టే.

ఒక్క మాటలో - డెకరేషన్ సరిపోలేదు

Also Read: తిమ్మరుసు రివ్యూ

idreampost.com idreampost.com

Click Here and join us to get our latest updates through WhatsApp