iDreamPost

లోకేష్‌పై నిషేధం.. !!

లోకేష్‌పై నిషేధం.. !!

ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి నారా లోకేష్‌పై తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిషేధం విధించిందా..? మీడియాతో నేరుగా మాట్లాడకూడదని ఆంక్షలు పెట్టిందా..? ట్వీట్టర్‌కే పరిమితం కావాలని ఆదేశించిందా..? అంటే పరిణామాలు అవుననే చెబుతున్నాయి.

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తురచూ మీడియా సమావేశాలు, తనను కలిసిన ఎలక్ట్రానిక్‌ ఛానెళ్ల ప్రతినిధులతో నారా లోకేష్‌ ఉత్సాహంగా మాట్లాడేవారు. ఎన్నికల్లో తాను పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గాన్ని చుట్టేశారు. ఎన్నికల తర్వాత టీడీపీ ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత కూడా లోకేష్‌ మీడియాలో యాక్టివ్‌గానే ఉన్నారు. కానీ రోజులు గడిచే కొద్దీ మీడియాకు దూరం అయ్యారు. ఆయన దూరం అయ్యారా..? దూరం చేశారా..? అనే ప్రశ్నకు.. దూరం చేశారనే సమాధానం తమ్ముళ్లు నుంచి వస్తోంది.

అమరావతి రాజధాని ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా వ్యవహరించిన చినబాబు ఆ తర్వాతనే సైలంట్‌ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి మీడియాలో బొత్తిగా కనపడడం మానేశారు. ఎన్నికల్లో తమ పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయని, నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని పార్టీ అధినేత చంద్రబాబు ఒక్కరే అన్నీ తానై నడిపించారు. ఓ పక్క రోజుకు ఒకట్రెండుసార్టు ప్రెస్‌మీట్లు, పనిలో పనిగా గవర్నర్, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు, ఆందోళనలు, మెరుపు ధర్నాలతో తీరక లేకుండా గడిపారు. మాచర్ల ఘటన సమయంలోనైనా చినబాబు బయటకు వస్తారని తమ్ముళ్లు ఆశించారు. ఎన్నికలు వాయిదా పడిన అంశంలో నెలకొన్న వివాదం సమయంలోనైనా వస్తారనుకున్నారు. అప్పుడూ రాలేదు.

నారా లోకేష్‌ను కావాలనే మీడియాకు దూరంగా ఉంచుతున్నారని టీడీపీ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, రోజు వారీ పరిణామాలు ఎంతో ముఖ్యమైనవి. సెక్షన్లు, రూల్స్, సబ్జెక్ట్‌తో కూడిన అంశాలే ఎక్కువగా ఉంటాయి. ఒక వేళ ఒకటి మాట్లాడబోయి మరోకొటి మాట్లాడితే.. అనవసరంగా ప్రతిపక్షాలకు ఆయుధాలు ఇవ్వడంతోపాటు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవ్వాల్సి వస్తుందనే చినబాబును దూరంగా ఉంచుతున్నారనే ప్రచారం సాగుతోంది.

అయితే తన నియోజకవర్గం మంగళగిరిలో మాత్రం చినబాబు యాక్టివ్‌గానే ఉన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారంటూ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో వాగ్వాదం చేశారు. ఓడిపోయినా నియోజకవర్గంలోనే ఉంటానని చెప్పిన లోకేష్‌ కార్యకర్తలకు అండగా వెళ్లి మార్కులు కొట్టేశారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత లోకేష్‌ మీడియా ముందుకు వస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలు దాదాపు నెలన్నర వాయిదా పడిన నేపథ్యంలో ఇతర అంశాలపై మాట్లాడాల్సిన సమయంలో వస్తారన్న చర్చ సాగుతోంది. చినబాబు మీడియావాసం ఎప్పుడు వీడుతుందో వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి