iDreamPost
iDreamPost
లాక్ డౌన్ సినిమా పరిశ్రమలో తీసుకొచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. ఓటిటి బూమ్ ఒక్కసారిగా ఏ స్థాయికి వెళ్లిందో చూస్తున్నాం. రెండేళ్ల క్రితం వరకు మహా అయితే ఇరవై కోట్లు మించని డిజిటల్ హక్కులు ఇప్పుడు మీడియం రేంజ్ హీరోకు సైతం నలభై కోట్ల దాకా చెల్లించే స్థాయికి చేరుకుంది. బాలీవుడ్ లో అయితే ఏకంగా వంద కోట్ల మార్కును కూడా టచ్ చేసింది. ఇప్పుడు కొత్తగా థియేటర్ vs ఓటిటి అనే కొత్త ట్రెండ్ మొదలుకాబోతోంది. అంటే ఒకే రోజు రెండు వేర్వేరు హీరోల సినిమాలు ఒకటి థియేటర్లో మరొకటి ఓటిటిలో రిలీజై ప్రేక్షకులు పలకరిస్తాయన్న మాట. ఒకటి చూడాలంటె బయటికి వెళ్ళాలి రెండోదానికి ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు.
అసలు విషయానికి వస్తే సెప్టెంబర్ 10 వినాయక చవితి పండగ సందర్భంగా ఈ క్లాష్ ని చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాని టక్ జగదీశ్ అమెజాన్ ప్రైమ్, నాగ చైతన్య లవ్ స్టోరీ థియేటర్లో ఒకేరోజు రాబోతున్నట్టుగా లేటెస్ట్ అప్ డేట్. ఒకటి ఆల్రెడీ కన్ఫర్మేషన్ రాగా నాని సినిమాకు సంబందించిన ప్రకటన ఇంకో వారంలోపే వచ్చే అవకాశాలు ఉన్నాయి. థియేటర్ లవర్ గా తాను ఎంత మిస్ అవుతున్నానో ఇటీవలే నాని ఒక ఎమోషనల్ నోట్ ని వదిలిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్న టక్ జగదీష్ ని ఇలా చిన్నితెరపై చూడాల్సి రావడం అభిమానులకు బాధే.
ఇప్పటిదాకా క్రేజీ మూవీస్ గా డైరెక్ట్ ఓటిటిగా వచ్చిన వాటిలో వి, నిశ్శబ్దం, ఆకాశం నీ హద్దురా, నారప్పలు ప్రధానమైనవి. ఒకవేళ ఇవి థియేటర్లో వచ్చి ఉంటే ఏ స్థాయి ఫలితాన్ని అందుకునేవో కానీ దాని మూడు నాలుగింతలు ఎక్కువ రీచ్ ని డిజిటల్ లో సంపాదించుకున్నాయి. సో టక్ జగదీష్ ఈ లెక్కన రికార్డులు నమోదు చేయడం ఖాయమే. మరోవైపు లవ్ స్టోరీ మీద మాములు అంచనాలు లేవు. లాక్ డౌన్ అయ్యాక థియేటర్లు తెరుచుకున్నాక వస్తున్న పెద్ద సినిమాగా బయ్యర్లు సైతం దీని మీద గంపెడు ఆశతో ఉన్నారు. ఒకవేళ ఇది కనక బ్లాక్ బస్టర్ హిట్టు కొడితే చాలు భారీ చిత్రాల నిర్మాతలు కూడా పోటీ పడి రిలీజ్ డేట్లు అనౌన్స్ చేస్తారు. చూద్దాం
Also Read : బెల్ బాటమ్ రిపోర్ట్