iDreamPost
android-app
ios-app

దుబ్బాక ఎఫెక్ట్ : నాగార్జున సాగ‌ర్ లో టీఆర్ఎస్ వ్యూహం మారుస్తోందా…?

దుబ్బాక ఎఫెక్ట్ : నాగార్జున సాగ‌ర్ లో టీఆర్ఎస్ వ్యూహం మారుస్తోందా…?

నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో తెలంగాణ‌లో మరో ఉప ఎన్నిక తప్పని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియ‌ర్ నాయ‌కుడు, ఆ ప్రాంతంపై గ‌ట్టి ప‌ట్టు ఉన్న జానారెడ్డి పోటీ ఖాయ‌మ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో టీఆర్ఎస్ కూడా గ‌ట్టి పోటీ ఇచ్చే అభ్య‌ర్థి ఎంపిక కోసం క‌స‌ర‌త్తు చేస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే అర్ధాంతరంగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకే టికెట్ కేటాయించే సంప్రదాయాన్ని టీఆర్‌ఎస్‌ పార్టీ కొనసాగిస్తూ వస్తోంది. కానీ, దుబ్బాకలో ఎదురైన చేదు అనుభవం ఆ పార్టీని పునరాలోచనలో పడేసింది. ఇక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్లను మార్చిన చోట విజయం సాధించిన టిఆర్ఎస్.. సిట్టింగులు ఉన్న చోట ఘోరంగా ఓడిన విషయం తెలిసిందే. వీటన్నింటి నేపథ్యంలో నర్సింహయ్య కుటుంబ సభ్యులను బరిలోకి దింపాలా లేక మరొకరికి అవకాశం ఇవ్వాలా అనే విషయంలో టీఆర్‌ఎస్‌ తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నోముల కుటుంబానికి టికెట్ ఇవ్వకపోతే.. ఎవరికి అవకాశం ఉంటుందనే చర్చ జోరందుకుంది.

జానా రెడ్డికి గట్టి పోటీ

ఇక మాజీ ఎమ్మెల్యే గుండెబోయిన రామ్మూర్తి యాదవ్ మనవడు, టీఆర్‌ఎస్‌ యువనేత మన్నెం రంజిత్ యాదవ్‌కు ఈసారి టికెట్‌ దక్కే అవకాశం ఉన్నట్లు ప్రముఖంగా వినబడుతోంది. నియోజకవర్గంలో రామ్మూర్తికి ఉన్న మంచి పేరు రంజిత్‌కు కలిసి వస్తుందని, ఆయనకు టికెట్‌ కేటాయిస్తే కారు పార్టీకే విజయం వరిస్తుందని కొంద‌రు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ యువ నేత నియోజకవర్గ స్థాయిలో చాలా యాక్టివ్‌గా ఉంటూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఇ‍ప్పటికే మద్దతును కూటగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న రంజిత్ కరోనా సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో సాగర్ నియోజకవర్గ ప్రజలు తమకు అందుబాటులో ఉండే నేతను ఎమ్మెల్యే అభ్యర్థి నిలిపితే బాగుంటుందని స్థానికులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా సీనియర్‌ నేతైన జానారెడ్డికి గట్టి పోటీ ఇచ్చే నాయకుడు రంజిత్ యాదవ్ అని జోరుగా ప్రచారం జరుగుతోంది.

1994 ఎన్నికల్లో చలకుర్తి(నియోజకవర్గాల పునఃవిభజనలో నాగార్జున సాగర్ అయ్యింది )లో రామూర్తి యాదవ్ జానారెడ్డిని ఓడించారు. ఆ ఎన్నికల్లో నేను ప్రచారం చేయకపోయినా గెలుస్తానని సవాల్ విసిరారు.హోరా హోరి పోరులో టీడీపీ తరుపున పోటీచేసిన రామ్మూర్తి యాదవ్ 2500 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలిచారు.

నియోజకవర్గంలో సుమారు 35,000 యాదవ సామాజిక ఓటర్లు ఉన్నట్లు అంచనా. దానితో సీనియర్లు సైతం ఆయనవైపే మొగ్గుచూపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నియోజవర్గంలో రెడ్డి ఓట్లతో పాటు పెద్ద ఎత్తున యాదవ్ సామాజిక ఓటర్లు కూడా ఉన్నారు. ఇది రంజిత్‌ యాదవ్‌కు కలిసొచ్చే పరిణామం.