iDreamPost
iDreamPost
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మరో సంచలనానికి తెరలేపారు. ఈసారి ఏకంగా తన ప్రాణానికే ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తనకు రక్షణ కల్పించాలని విన్నవించారు. తనతో పాటు తన కుటుంబానికి కూడా అదనపు భద్రత కావాలని కోరుతూ ఆయన కేంద్ర హోం శాఖకు లేఖ రాయడం చర్చనీయాంశం అవుతోంది.
స్థానిక ఎన్నికలు వాయిదా వేస్తూ విచక్షణ పేరుతో అనూహ్య నిర్ణయం తీసుకున్న ఎస్ ఈ సీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఏపీలో ఇప్పటికే పెద్ద చర్చనీయాంశంగా మారిన స్థానిక ఎన్నికల విషయంలో ఆయన ఏకంగా ఐదు పేజీల లేఖను కేంద్రానికి రాయడం రాజకీయంగా దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది. తనకు రక్షణ కల్పించాలని కోరుతూనే ఏపీలో ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను పంపించాలని ఆయన కోరడం విశేషం.
ఏపీలో స్థానిక ఎన్నికల విషయంలో ఇప్పటికే విపక్షం తీవ్ర ఆరోపణలు చేస్తోంది. కేంద్ర బలగాలను పంపించాలని బీజేపీ కూడా డిమాండ్ చేసింది. ఇప్పుడు టీడీపీ, బీజేపీ డిమాండ్లకు అనుగుణంగా నిమ్మగడ్డ లేఖ రాయడం ఆసక్తికరమే. ఆయన రాసిన లేఖలో ప్రధానంగా ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు తనకు రక్షణ కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన కుటుంబ సభ్యులతో పాటు తనపైనా దాడి జరిగే అవకాశం ఉందని రమేష్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తన భద్రతతో పాటు ఎన్నికల నిర్వహణకు కూడా కేంద్ర బలగాలు అవసరమని కోరారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు పరిస్థితులు అనుకూలంగా లేవని, ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరగాలంటే కేంద్ర బలగాలు అవసరమని రమేశ్ కుమార్ లేఖలో వివరించారు. ఆయన పేర్కొన్న అంశాలలో దాదాపుగా ప్రతిపక్ష వాదనను తలపిస్తుండడం విస్మయం కలిగిస్తోంది.
అంతటితో సరిపెట్టకుండా మంత్రులకు సీఎం టార్గెట్ పెట్టారంటూ ఎస్ ఈ సీ తన లేఖలో కేంద్రం దృష్టికి తీసుకెళ్లడం రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది. తద్వారా ముఖ్యమంత్రి మీద ఆయన గురిపెట్టారా అనే అనుమానం బలపడుతోంది. సీఎం ఆదేశాలతోనే క్షేత్రస్థాయిలో పాలకపక్షం రెచ్చిపోయిందనే అర్థం వచ్చే రీతిలో ఆయన లేఖ ఉండడం గమనార్హం. ఏపీలో జరిగిన ఏకగ్రీవాల విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం మరో ప్రధానాంశం. ప్రస్తుత ఎన్నికల్లో 24 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం ఒకే జడ్పీటీసీ ఏకగ్రీవం అయిత ప్రస్తుతం వాటి సంఖ్య 126 జడ్పీటీసీలు అని చెప్పడం ద్వారా రాజకీయ దుమారానికి తెరలేపారు. కడప జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు, 76 శాతం జడ్పీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని లేఖలో రాయడం ద్వారా పాలకపార్టీ పలు అక్రమాలకు పాల్పడిందనే వాదనను ఆయన దాదాపుగా బలపరిచినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే ఏపీ రాజకీయాల్లో ఎన్నికల సంఘం వెర్సస్ రాష్ట్ర ప్రభుత్వం అన్నట్టుగా మారిన పరిణామాల్లో తాజా లేఖ మరింత నిప్పు రాజేయడం ఖాయంగా కనిపిస్తోంది. సుప్రీంకోర్ట్ తీర్పు తర్వాత పరిస్థితి సర్థుమణిగేలా చేయాల్సిన ఎస్ఈసీ దానికి భిన్నంగా మరింత వేడిపుట్టించే పద్ధతిలో వ్యవహరించడం కీలకాంశంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయన్నదే ఇప్పుడు అందరినీ ఆలోచనకు గురిచేస్తోంది. కేంద్రం ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు ప్రధానాంశం.