Idream media
Idream media
ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడీ అన్నట్లు.. ఆది నుంచీ బీజేపీలో ఉన్న నాయకులు కన్నా తమ మాటే ఫైనల్ అంటూ బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి మాట్లాడుతున్నారు. టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లినా సుజనా వ్యవహార శైలి, మాటలు అన్నీ టీడీపీ నేతగానే ఉంటోందన్న విమర్శలున్నాయి. అసలు ఎలాంటి పరిస్థితుల్లో టీడీపీ కి చెందిన నలుగురు ఎంపీలు బీజీపీలో చేరారో అందరికీ తెలిసిన విషయమే. ఏ క్షణంలోనైనా వారు తిరిగి టీడీపీ గూటికి తిరిగి వస్తారనడంతో సందేహం లేదు.
స్వప్రయోజనాలే పరమావధిగా రాజకీయాలు చేస్తున్న వ్యాపారవేత్త సుజనా చౌదరి.. రాజధాని అమరావతిపై బీజేపీ స్టాండ్‌కు భిన్నంగా తన సొంత పంథాలో వెళుతున్నారనే విమర్శలున్నాయి. రాజధాని విషయం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని విషయం అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఇప్పటికే పలుమార్లు లోక్ సభలో చెప్పారు. అదే విషయాన్ని అంతకు ముందు ఆ తర్వాత బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరశింహరావు వెల్లడించారు. సందర్భం వచ్చిన ప్రతిసారి జీవీఎల్ ఈ విషయంపై కేంద్రం వైఖరిని స్పష్టం చేస్తూనే ఉన్నారు.
రాజధానిపై కేంద్రం జోక్యం చేసుకుంటుందని, మూడు రాజధానులు ఆపుతుందని ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలు చెప్పుకొస్తున్నారు. కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసినా వారు తమ పంథాను వీడడంలేదు. వీరిలో సుజనా చౌదరి మొదటి వరుసలో ఉన్నారు. తాజాగా ఆయన రాజధాని అమరావతిపై ఢిల్లీలో మాట్లాడారు. రాజధాని విషయంపై కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకుంటుందంటూ చెప్పుకొచ్చారు. కేంద్రం జోక్యం చేసుకోదని ఎవరో ఎల్లయ్యలు, పుల్లయ్యలు చెప్పిన విషయంపై తాను స్పందించాల్సిన అవసరం లేదన్నారు.
ఎల్లయ్యలు, పుల్లయ్యలు.. అంటూ సుజనా చౌదరి సంబోధించింది బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌నే అనేది ఇటీవల జరిగిన పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఏపీ రాజధాని అంశంపై బీజేపీ, కేంద్రం వైఖరిని జీవీఎల్ రాష్ట్రంలో వెల్లడిస్తున్నారు. ఇక్కడ ప్రెస్‌మీట్లు, సమావేశాల్లో రాజధాని అంశం పూర్తిగా కేంద్రం పరిధిలోనిదే అంటూ పలుమార్లు ఉద్ఘాటించారు. అందుకే టీడీపీ నేతల నుంచి జీవీఎల్ విమర్శలూ ఎదుర్కొన్నారు.
సుజనా చౌదరి లాగానే జీవీఎల్ కూడా రాజ్యసభ సభ్యుడుగా వ్యవహరిస్తున్నారు. పైగా బీజీపీలో ఆది నుంచి ఉన్నారు. ఇలాంటి నేతను ఉద్దేశించి పార్టీ మారి వచ్చిన సుజనా చౌదరి చులక చేసి మాట్లాడడంపై రియల్ బీజేపీ శ్రేణులు మండిపడుతున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా అందులోనే కొనసాగే వారు ఎల్లయ్యలు.. పుల్లయ్యలా..? లేక అధికారం కోసం పార్టీలు మారే వారు.. ఎల్లయ్యలా..? పుల్లయ్యలా..? అని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.