iDreamPost
android-app
ios-app

ఎదో ఒక్కటి చిక్కకపోద్దా…!

ఎదో ఒక్కటి చిక్కకపోద్దా…!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతే ఉండేలా చేసేందుకు తెలుగుదేశం పార్టీ చేయని ప్రయత్నాలు అంటూ ఏవీ లేవు. అమరావతికి ఉన్న అనుకూలతలు, విశాఖపై ప్రతికూల ప్రచారం, వైఎస్‌ జగన్‌ లక్ష్యంగా చేసుకుని విమర్శలు.. ఇలా పట్టు వదలని విక్రమార్కుల్లా టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా రాజధాని విషయంలో చిన్న పాటి అవకాశం కోసం.. కేంద్ర ప్రభుత్వాన్ని ఈ అంశంలో లాగేందుకు టీడీపీ ఎంపీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. పదే పదే రాజధానిపై లోక్‌సభలో ప్రశ్నలు వేస్తున్నారు.

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభంలోనే టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ .. రాజధాని విషయంలో కేంద్రం విధులు, బాధ్యతలపై ప్రశ్నలు వేశారు. దీనికి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. రాష్ట్ర రాజధాని అనేది పూర్తిగా ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమంటూ చెప్పారు. ఆ రాష్ట్ర భూభాగంలో ఎక్కడైనా రాజధానిని పెట్టుకునే అధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. ఇది జరిగి వారం రోజుల్లోపే మళ్లీ టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ మళ్లీ అదే అంశంపై ప్రశ్న వేశారు.

‘‘ రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రక్రియలో నిర్దష్ట విధాన ప్రక్రియ ఏదైనా ఉందా..? జార్ఖండ్, ఛత్తీష్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు తమ రాజధానులను ఎంపిక చేసుకున్న పద్ధతి వివరించండి. ఈ ఎంపికలో కేంద్రం ఏదైనా పాత్ర పోషించగలదా..?’’ అంటూ రాజధాని అంశం చుట్టూనే ప్రశ్నలు వేశారు. అయితే ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే ఒక్క సమాధానంగా ‘‘ ఒక రాష్ట్ర రాజధానిని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. కేంద్ర ప్రభుత్వానికి ఇందులో పాత్ర ఏమీ లేదు..’’ అంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్‌ పునరుద్ఘాటించారు.

21వ శతాబ్ధం ప్రారంభంలో జార్ఖండ్, ఛత్తీష్‌గఢ్, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాలు ఏర్పడ్డాయి. 2000వ సంవత్సరంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కూడా బీజేపీ ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల ఏర్పాటు, రాజధానుల ఎంపికలో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుందేమోన్న ఆశతో టీడీపీ ఎంపీ కేశినేని నాని ఈ ప్రశ్నలు సంధించారు. అయితే కేంద్ర హోం శాఖ మంత్రి నుంచి గతంలో కన్నా భిన్నమైన సమాధానం రాకపోవడంతో టీడీపీ ఎంపీకి ఆశాభంగం తప్పలేదు. ఇప్పటికైనా రాజధాని విషయంలో టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నలు వేయడం ఆపేస్తారా..? లేదా.. కొనసాగిస్తారా..? వేచి చూడాలి.