iDreamPost
iDreamPost
తెలుగుదేశం తీవ్రంగా సతమతం అవుతోంది. మొన్నటి ఎన్నికల్లో పట్టు నిలుపుకున్న చోట కూడా ఇప్పుడు పేలవంగా మారిపోతోంది. పరిస్థితులను సానుకూలంగా మలచుకోవాల్సిన సమయంలో అధిష్టానం తీరు అసలుకే ఎసరు పెడుతోందని పార్టీ నేతలు వాపోతున్నారు. చివరకు ఒక్కొక్కరుగా జారిపోతున్నారు. దాంతో విశాఖలో తెలుగుదేశం పార్టీ కష్టాలు రెట్టింపవుతున్నట్టు కనిపిస్తోంది. రాజధాని వ్యవహారం కారణంగా మొదలయిన రగడ ఆపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అమరావతి పేరుతో విశాఖ అభివృద్ధిని అడ్డుకుంటున్నారనే వాదనతో పలువురు ఉత్తరాంద్ర వాసులు ఇప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో సీనియర్ నేతలు కూడా చంద్రబాబు పట్ల గుర్రుగా ఉన్నారు.
గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికల ముంగిట ఈ పరిణామాలు విపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా విశాఖ కార్పోరేషన్ లో విజయం సాధించలేకపోయింది. స్థానికంగా గట్టి పట్టున్నప్పటికీ ఆపార్టీకి జీవీఎంసీ మింగుడుపడడం లేదు. దాంతో ఈసారి ఎలాగయినా గెలిచి తీరాలని గట్టిగా ఆశించింది. దానికి తగ్గట్టుగా నగరంలో నాలుగు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకోవడంతో ఆశలు పెంచుకుంది. కానీ అనూహ్యంగా రాజధాని అంశం టీడీపీని అగాధంలోకి నెట్టినట్టు కనిపిస్తోంది. చివరకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వంటి వారు కూడా రాజధాని అంశంలో జగన్ కి జై కొట్టగా, తాజాగా ఆపార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే రెహమాన్ వైఎస్సార్సీపీ కండువా కప్పేసుకున్నారు.
ఎన్టీఆర్ హయం నుంచి రెహమాన్ కి విశాఖలో మంచి గుర్తింపు ఉంది. కేవలం మైనార్టీలలో మాత్రమే కాకుండా వివిధ వర్గాల్లో ఆయనకు గుర్తింపు ఉంది. ఎమ్మెల్యేగా విజయం సాధించిన సమయంలోనే కాకుండా నిత్యం ప్రజల్లో ఉండే నాయకుడిగా ఆయనకు పేరుంది. సమస్యలపై స్పందిస్తారని సామాన్యులు సైతం భావిస్తారు. దానికి తగ్గట్టుగా టీడీపీ నగర అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా చంద్రబాబుకి తోడుగా ఉన్నారు. అదే సమయంలో నగరంలో ఎంవీఎస్ మూర్తి వర్గీయుడిగా ముద్రపడ్డారు. మొన్నటి ఎన్నికల్లో మూర్తి వారసుడు భరత్ ఎంపీగా పోటీ చేసిన సమయంలో ఆయన విజయానికి రెహ్మన్ కృషి చేశారు. నగరంలో నాలుగు స్థానాలను టీడీపీ దక్కించుకోవడంలో ఆయన పాత్ర కూడా ఉంది.
విశాఖ గ్రేటర్ ఎన్నికలకు ముందు రెహమాన్ పార్టీ మారడంతో టీడీపీ శిబిరంలో నైరాశ్యం అలముకుంటోంది. ఆయన వెంట పలువురు స్థానిక నేతలు కూడా క్యూ కట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవైపు అధికార పార్టీ దూకుడు, మరోవైపు స్థానికంగా పట్టున్న టీడీపీ నేతలు కూడా గోడ దూకేస్తుండడంతో ఇక విశాఖలో టీడీపీ ఆశలు గంగపాలవుతున్నట్టు కనిపిస్తోంది. రెహమాన్ చేరికతో వైఎస్సార్సీపీ లక్ష్యాలకు మరింత చేరువ అవుతున్నట్టు కనిపిస్తోంది.