Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నెల 9 నుంచి 11 వరకు నామినేషన్లకు గడువు ఇవ్వగా చివరి రోజైన బుధవారమే మంచి రోజు కావడంతో నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలయ్యాయి. 652 జడ్పీటీసీ స్థానాలకు గాను 4,012 నామినేషన్లు పడగా.. 9,696 ఎంపీటీసీ స్థానాలకు 33,600 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దాదాపు ఒక స్థానానికి నలుగురు చొప్పన పోటీ పడుతున్నారు.
రాష్ట్రంలో అధికార పార్టీ తమ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటోందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ తొలిరోజు నుంచి విమర్శిస్తోంది. అక్కడక్కడా జరిగిన ఘటనలను ఉదహరిస్తూ ప్రతిపక్ష నేత చంద్రబాబు రోజులో పలుమార్లు మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వ తీరును, ఎన్నికల సంఘం, పోలీసుల వైఖరిని తూర్పారబడుతున్నారు. ప్రతిపక్ష నేత ఇలా చెబుతుండగా.. నామినేషన్లు మాత్రం భారీ సంఖ్యలో దాఖలవడం విశేషం. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు అర్ధరహితం అనేలా నామినేషన్ల సంఖ్య చెబుతోంది.
ఎంపీటీసీ, జడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన ఈ రోజు జరుగుతోంది. పరిశీలన అనంతరం ఎన్ని మిగులుతాయో చూడాలి. నిర్ణీత ఫార్మెట్, సంబంధిత పత్రాలు జత చేయని నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తారు. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఒకే పార్టీలోనే రెబల్స్‌గా, స్వతంత్రులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారు అధిక సంఖ్యలో ఉన్నారు. పార్టీలు, అభ్యర్థుల బుజ్జగింపుల తర్వాత రెబల్స్, స్వతంత్రుల్లో ఎంత మంది పోటీలో ఉంటారో వేచి చూడాలి.