iDreamPost
android-app
ios-app

తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని వ్యాఖ్యలు దేనికి సంకేతం?

తెలంగాణ బీజేపీ నేతలతో ప్రధాని వ్యాఖ్యలు దేనికి సంకేతం?

తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ ఎప్పటినుంచో వ్యూహరచన చేస్తోంది. అదును చూసి దెబ్బ కొట్టేందుకు ప్లాన్ వేస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండడం.. బీజేపీతో కలిసి అధికారం చేజిక్కించుకునే బలం ఉన్న మరో పార్టీ లేకపోవడం.. బీజేపీకి పట్టణ ప్రాంతాల్లో మినహా గ్రామస్థాయిలో ఓటు బ్యాంకు లేకపోవడం వంటివి ఆపార్టీని ఇంతవరకూ తెలంగాణలో వేచి చూసేధోరణిలో ఉండేలా చేసింది. కొద్దినెలలక్రితం బీజేపీ పుంజుకోవాలని చూసినా పరిస్థితులు అనుకూలించలేదనే చెప్పుకోవాలి.

అయితే తాజాగా ప్రధాని నరేంద్రమోడి చేసిన వ్యాఖ్యలు చూస్తే బీజేపీ ఇక్కడ వర్క్ స్టార్ట్ చేసిందనే సంకేతాలిస్తోంది. అందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు సిద్ధమవ్వాలని సూచించినట్టు అనిపిస్తోంది. శుక్రవారం ఢిల్లీలో ప్రధానిని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపురావు, డీ అరవింద్‌, గరికపాటి మోహన్‌ రావు కలిసినపుడు తెలంగాణ మే అగ్లీ బార్‌ హమారీ సర్కార్‌ హోగీ. (తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదే) అని మోడి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై ఆరా తీసిన ప్రధాని తెలంగాణలో బీజేపీ బలపడుతుందన్న సంకేతాలిచ్చారు. అత్యంత వివాదాస్పదమైన పౌరసత్వ సవరణ బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం పొందిన తర్వాత ప్రధాని ఈవ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పౌరసత్వ సవరణ బిల్లును ఉభయసభల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు వ్యతిరేకించారు..

ముస్లింలకు తాము అండగా ఉంటామని టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్షనేత నామా నాగేశ్వరరావు సభలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని మోడి సీరియస్ గా తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే తెలంగాణలో బీజేపీని బలోపేతం చేసే విషయంపై దృష్టిసారించాలని ఎంపీలను ప్రధాని కోరినట్టు తెలుస్దోంది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా వేర్వేరుగా కార్యాచరణ రూపొందించుకొని క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని ఆదేశించారు. ప్రధానితో కలిసిన అనంతరం తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడుతూ ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిశాం.. బీజేపీకి రాష్ట్రంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఆయనన్నారు. కచ్చితమైన నివేదికలున్నాయి కాబట్టే ఈమాట చెప్పారు. ప్రధాని కూడా క్షేత్రస్థాయి నుంచి వచ్చిన నాయకుడే. ఆయన గాలి మాటలు చెప్పరు.. ఇది రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలందరూ సంతోషించాల్సిన విషయం అని అరవింద్‌ మీడియాకు చెప్పారు.

తెలంగాణలో వచ్చే ప్రభుత్వం బీజేపీదేననే నమ్మకం కేంద్రం పెద్దలకు బలంగా ఉందన్నారు. అలాగే తెలంగాణకు అత్యంత అవసరమైన పసుపు పంటకు సంబంధించిన చర్చలు తుదిదశకు చేరాయని, రైతులు ఆశించినదాని కంటే ఎక్కువ ఫలితం ఉంటుందని అరవింద్‌ అన్నారు. పసుపు బోర్డు 30ఏళ్ల నుంచి డిమాండ్ ఉందని, కొత్తగా వచ్చింది కాదు.. ఈ వ్యవస్థకు మించిన ప్రయోజనాలు రైతులకు కల్పించడానికి చర్చలు జరిగాయి.. మరో 20-30 రోజుల్లో రైతులకు శుభవార్త వస్తుందన్నారు. దీనినిబట్టి తెలంగాణలో బీజేపీ వ్యూహాలకు పదును పెట్టిందని స్పష్టమవుతోంది. బీజేపీ నేతల వ్యాఖ్యలు చూస్తుంటే తెలంగాణకు పసుపు బోర్డు సహా మరింత కేంద్రసాయం ప్రకటించి వచ్చే ఎన్నికలకు ఇప్పటినుంచే దూకుడుగా వ్యవహరించేందుకు యాక్షన్ ప్లాన్ ప్రారంభిస్తున్నట్టు తెలుస్దోంది.