Idream media
Idream media
తమిళనాడు రాష్ట్రంలోని డీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అన్బళగన్ కరోనా వైరస్ బారిన పడి గతంలో మృతి చెందారు. అదీ పుట్టిన రోజు నాడే.. ఆయన మరణించడం రాజకీయ వర్గాల్లో విషాదం నింపింది. ఇప్పుడు మరో ఎమ్మెల్యే మహమ్మారికి బలి అయ్యారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ కరోనా తో మృతి చెందారు. గత నెలలోనే ఆయనకు పాజిటివ్ నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలోని ప్రముఖ ఆస్పత్రి లో చికిత్స పొందుతున్నారు. ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. తమో నాశ్ ఘోష్ 35 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. మూడు సార్లు ఎమ్మెల్యే గా ప్రజలకు సేవలు అందించారు. రాజకీయాల్లో ఓ గుర్తింపు పొందిన నేతగా ఆయనకు పేరుంది. ఘోష్ మృతి పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఏప్రిల్ నెలలోనే గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన కాంగ్రెస్ నేత బక్రుద్దీన్ షేక్ కూడా కరోనా సోకి మృతి చెందారు. ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి శక్తిసిన్హ్ గోహిల్ ఈ విషయాన్ని అప్పట్లో వెల్లడించారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు కూడా ఈ కరోనా ఫీవర్ పట్టుకుంది. దీని వల్ల చాలా మంది ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఇక తెలంగాణకు చెందిన రాజకీయ నాయకులు కూడా కరోనా టెర్రర్ తో ఒణుకుతున్నారు. గత నెలలో మాజీ ఎమ్మేల్యే, బీజేపీ సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డికి, ఆయన తల్లికి పాజిటివ్ రావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందారు. డిశ్చార్జ్ అయ్యారు. అలాగే అధికార పార్టీకి చెందిన మరో ముగ్గురు ఎమ్మెల్యే లు వైరస్ బారిన పడ్డారు. మంత్రి హరీష్ రావు తో పాటు చాలా మంది ప్రజా ప్రతినిధులు హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా శ్రుంగ వరపు కోట ఎమ్మెల్యేకు కూడా తాజాగా కరోనా సోకింది. ఆయన గన్ మెన్ కూడా వైరస్ బారిన పడ్డారు. అనుమానాలు నివృత్తి నేపధ్యంలో జీ హెచ్ ఎం సీ మేయర్ బొంతు రామ్మోహన్ ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు చేయించు కోవాలిసి వచ్చింది. కొత్తగా ఏర్పడ్డ బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కుటుంబంలో ఒకరికి పాజిటివ్ వచ్చింది. అనంతరం డిప్యూటీ మేయర్ కు కూడా పాజిటివ్ అని తేలింది. ముందు జాగ్రత్త గా అనుమానాలు ఉన్న చాలా మంది ప్రజా ప్రతినిధులు కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు దూరంగా ఉంటున్నారు. మొత్తమ్మీద.. కరోనా వైరస్ విజృంభణ, ఎమ్మెల్యేల మృతి రాజకీయ వర్గాల్లో విపరీతమైన ఆందోళన కలిగిస్తోంది.