కరోనా ప్రపంచంతో పాటు దేశాన్ని కూడా వణికిస్తుంది.. ఇప్పుడు దేశంలో కూడా కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సమయంలో వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చేస్తున్న సేవ అంతా ఇంతా కాదు.. నిద్రాహారాలు మాని ప్రజల ఆరోగ్యం బాగుండాలని నిరంతరం సేవ చేస్తున్న వారి కృషి గురించి మాటల్లో చెప్పలేము..
కాగా తెగువ చూపిస్తూ విధుల్లో పాల్గొంటున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాదాభివందనం చేసి వారి సేవను ప్రశంసించారు. వివరాల్లోకి వెళ్తే రాజమండ్రి నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే కాళ్లు కడిగి వారు చేస్తున్న సేవలను ప్రశంసించారు.
కాగా పారిశుద్ధ్య కార్మికుల కాళ్ళు కడిగిన తరువాత ఎమ్మెల్యే మాట్లాడుతూ క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా పారిశుధ్య కార్మికులు ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్నారని తెలిపారు.వారు చేస్తున్న సేవలకు ఏం చేసినా తక్కువే అని వెల్లడించారు.. వేతనాలు పెరిగేలా చర్యలు తీసుకుంటామని జక్కంపూడి రాజా పేర్కొన్నారు..
ఇప్పటికే తెలుగురాష్ట్రాలలో గణనీయంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అయినా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో కొనసాగుతూ వైరస్ వ్యాపించకుండా వీధులన్నీ శుభ్రం చేస్తూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు..కరోనా వ్యాపించకుండా సైనికుల్లా అడ్డుపడి వీధుల్ని శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల గొప్పతనాన్ని ప్రశంసిస్తూ వారికి పాదాభివందనం చేయడం పట్ల పలువురు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.