iDreamPost
android-app
ios-app

కరోనా తీవ్రత అత్యధికం – ఉపాధి కోసం తిరిగి ముంబయికి చేరుకుంటున్న వలస కూలీలు

కరోనా తీవ్రత అత్యధికం – ఉపాధి కోసం తిరిగి ముంబయికి చేరుకుంటున్న వలస కూలీలు

ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఆకలి.. ఎలాంటి పరిస్థితినైనా ఎదిరించేలా చేయగల శక్తి ఆకలికి ఉంది. ఒక మనిషి తన ప్రాణాలను నిలుపుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాటం చేసేలా ఆకలి చేయగలదు. ఇప్పుడీ పరిస్థితి వలస కూలీలకు ఎదురవుతుంది.

కరోనా విజృంభిస్తున్న కొత్తలో ముంబయి మహా నగరంలో చిక్కుకున్న వలస కూలీలు తమ స్వస్థలాలకు చేరడానికి చేయని ప్రయత్నాలు లేవు. కాలి నడకన కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటనలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రేకెత్తేలా చేసాయి. రవాణా సౌకర్యాలు లేక నడిచి వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. స్వస్థలానికి పోయి బ్రతికుంటే బలుసాకు తినొచ్చని వెళ్లిన వాళ్ళు తిరిగి ఉపాధి నిమిత్తం ముంబయ్ నగరానికి తిరిగి వస్తున్నారు.

ముంబయిలో కరోనా తీవ్రత అధికం.

దేశంలో కెల్లా తీవ్రస్థాయిలో కరోనా విజృంభణ సాగుతున్న రాష్ట్రం మహారాష్ట్ర.. మహారాష్ట్రలో 1,64,626 కరోనా కేసులు నమోదవగా ఒక్క ముంబయి నగరంలోనే 75,539 కేసులు నమోదయ్యాయి. నేటివరకు 4,371 కరోనా మరణాలు ముంబయిలో సంభవించాయి. ముంబయి నగరంలో రెండు కిలోమీటర్లు కంటే ఎక్కువ దూరం ట్రావెల్ చేయొద్దని ముంబయిలో పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముంబయిలో ప్రమాదకర స్థాయిలో కరోనా వ్యాపిస్తుండగా పని దొరక్క, అనేకమంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కోల్పోయారు. దీంతో ఏ నగరం నుండి స్వస్థలాలకు పడుతూ లేస్తూ తిరిగి వెళ్లారో తిరిగి ఉపాధి కోసం అక్కడికే చేరుకుంటున్నారు.

మహారాష్ట్రలో పారిశ్రామిక కర్మాగారాలు, వివిధ మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం కావ‌డంతో ఉపాధి కోసం తిరిగి వలస కార్మికులు ముంబైకి వ‌స్తున్నారు.కరోనా కారణంగా మహారాష్ట్ర నుంచి జూన్ నెల ముందు సుమారు 18 లక్షల మంది కార్మికులు 844 రైళ్లలో వారి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లిపోయారు. కాగా అలా వెళ్లిన వారు తిరిగి ఉపాధి నిమిత్తం ముంబయికి చేరుకుంటున్నారు. జూన్ నెల ప్రారంభం నుండి నేటి వరకు సుమారు ఐదున్నర లక్షల మంది తిరిగి ముంబయికి చేరుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు వెల్లడించారు. ముంబైకి తిరిగివ‌చ్చిన‌వారిలో యూపీ, బీహార్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన‌వారు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కరోనా నేపథ్యంలో అనేకమంది నిరుపేదలగా మారబోతున్నట్లు అనేక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. దాంతో ఇప్పుడు ముంబయి వచ్చే ట్రైన్స్ అన్నీ 100% నిండిపోయి వస్తున్నాయి. 

ఏది ఏమైనా ప్రాణాలను నిలుపుకోవడం కోసం అష్టకష్టాలు పడి స్వస్థలాలకి చేరుకున్న వలస కార్మికులు ఉపాధి కోసం కరోనాను లెక్క చేయకుండా తిరిగి ముంబయి చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండడటం గమనార్హం.