iDreamPost
iDreamPost
కరోనా కలకలం వల్ల జనం అతలాకుతలం అవుతున్నారు. ప్రయివేట్ ఆసుపత్రులు మూతబడ్డాయి. డాక్టర్లు తమ నర్సింగ్ హోమ్ లను తెరవడం లేదు. ఏది వచ్చినా సర్కారీ దవాఖానకు పోవాల్సిందే. ఈ నేపథ్యంలో తీవ్రమైన సమస్య అయితే తప్ప ప్రజలు హాస్పిటల్ కు వెళ్లే ఆలోచన చేయడం లేదు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన రక్త కొరత ఏర్పడింది. తలసేమియా బాధితులు, క్యాన్సర్ పేషెంట్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు కాకుండా ఎమర్జెన్సీ కేసుల్లో సైతం రక్తం దొరక్క ప్రాణాల మీదకు వస్తున్న సంఘటనలు కూడా ఉన్నాయి.
లాక్ డౌన్ వల్ల ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి ఉండటంతో బ్లడ్ డోనర్స్ కూడా బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. కోవిడ్ 19 తీవ్రత అంతకంతా పెరుగుతూ పోవడంతో వాళ్ళ భయంలోనూ న్యాయం ఉంది. ఇందుకోసం మెగాస్టార్ చిరంజీవి నడుం బిగించారు. ఇవాళ జుబ్లీ హిల్స్ లో ఉన్న తమ బ్లడ్ బ్యాంకులో స్వయంగా రక్తదానం చేసి దాని తాలుకు ఫోటోలు సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఎక్కడైనా రక్తం కావాల్సి వస్తే తగిన జాగ్రత్తలతో నిపుణులైన వైద్యుల సమక్షంలో రక్తం ఇవ్వోచ్చనే సందేశం ఇస్తూ ముందుకు రమ్మని పిలుపునివ్వడంలో భాగంగా తనే స్వయంగా ఈ కార్యం మొదలుపెట్టారు.
ఇప్పటికే సిసిటి తరఫున ఆపదలో ఉన్న వారికి రక్తం ఇచ్చే దాతలకు పరిమిత సమయానికి చెల్లుబాటు అయ్యేలా పాసులు ఇచ్చే వెసులుబాటుని మొదలుపెట్టారు. రక్తం కొరత అనేది ప్రతి చోటా ఉన్న సమస్యే కాబట్టి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు అవసరార్థులను ఆదుకునే వైపుగా అందరూ ఆలోచించాలి. ఆచార్య షూటింగ్ కు బ్రేక్ వేసి ఇరవై రోజులు దాటిన తరుణంలో చిరంజీవి పూర్తిగా కరోనా క్రైసిస్ చారిటి పనులతో పాటు ట్విట్టర్ వేదికగా సామజిక స్పృహ కలిగించే వీడియోలు, విరాళాలు ఇస్తున్న దాతల పేర్లు వెల్లడిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ చేసిన పనిని పలువురు ప్రశంసిస్తున్నారు.