iDreamPost
android-app
ios-app

దారి తప్పుతున్న మాస్ సినిమా

  • Published Dec 22, 2019 | 11:43 AM Updated Updated Dec 22, 2019 | 11:43 AM
దారి తప్పుతున్న మాస్ సినిమా

ఏ సినిమాకైనా బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించే విషయంలో మాస్ ప్రేక్షకులదే సింహభాగం. వాళ్ళు పాస్ చేస్తే ఇండస్ట్రీ హిట్టు. ఛీ కొడితే బొమ్మ ఫట్టు. అలా అని ఈ వర్గం ఆడియన్స్ ఏదో పల్లెటూరి నుంచి వచ్చిన వాళ్లనో లేదా చదువు సంధ్యలు ఎక్కువ లేని వాళ్ళో అనుకుంటే అదీ పొరపాటే. మాస్ అంటే ఘనం. ఇంకోరకంగా చెప్పాలంటే కులమతవర్గ భేదాలు లేకుండా సినిమాలు ఇష్టపడే అధిక శాతం జనం ఉన్న సమూహాన్ని మాస్ అంటాం. వాళ్ళు ఆదరిస్తే ఎక్కువ టికెట్లు తెగుతాయి. నిర్మాతలకు నాలుగు రాళ్ళు ఎక్కువ మిగులుతాయి. ఇంకో సినిమా తీసేందుకు కావలసిన ఆర్ధిక మద్దతు, వనరులు సమకూరుతాయి. కాని ఈ మధ్య వస్తున్న తెలుగు సినిమాల మాస్ పోకడ చూస్తుంటే వెర్రి వేయి విధాలు అనే తరహలో దర్శకులు ఆలోచిస్తున్న తీరు మూవీ లవర్స్ ని నిజంగా బాధ పెట్టె విషయమే. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఉంది. ముందు కాస్త ఫ్లాష్ బ్యాక్ కు వెళ్దాం

ఇంతకీ మాస్ సినిమా అంటే ఏది ?

జనరంజకంగా ఉండేది ఏదైనా మాస్ సినిమానే. కల్పిత మహాభారత కథతో తీసిన మాయాబజార్ కావొచ్చు, పక్కింటి గయ్యాళి అత్త స్టొరీని ఆధారంగా చేసుకున్న గుండమ్మ కథ కావొచ్చు అందరిని మెప్పించే అంశాలు ఉన్నప్పుడు వాటికే బ్రహ్మరధం దక్కుతుంది. ఇది అనాది నుంచి వస్తున్నదే. బ్లాక్ అండ్ వైట్ కాలాన్ని పక్కన పెడితే కలర్ వైభవం మొదలైనప్పటి నుంచి ఇప్పటి శాటిలైట్ టెలికాస్ట్ దాకా సినిమా పబ్లిక్ కు చేరే విధానాన్ని మార్చుకుంది కానీ రూపాన్ని కాదు.

అడవిరాముడుతో మొదటిసారి తెలుగు తెర కోట్ల రూపాయల వసూళ్ల ప్రభంజనాన్ని చూసింది. అప్పటికే లవకుశ లాంటి సినిమాలు ఆ ఫీట్ సాధించినప్పటికీ అడవిరాముడు సృష్టించిన గ్రామర్ ఇప్పటికీ ఎందరో దర్శకులు ఫాలో అవుతుండటం అతిశయోక్తి కాదు. అది మొదలు చిరంజీవి ఘరానా మొగుడుతో కొనసాగించి జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి బాలకృష్ణ లెజెండ్ దాకా ఎన్నో ఉదాహరణలు తారసపడతాయి. వీటిలో ఉన్నదల్లా నేలవిడిచి సాము చేసిన హీరోయిజమే. చూస్తున్న వాళ్ళను అలా కళ్లప్పగించేలా కట్టిపడేసే మాయాజాలమే కోదండరామిరెడ్డి, బి గోపాల్, వినాయక్, బోయపాటి శీను లాంటి ఎందరికో గొప్ప కెరీర్ ను బంగారు పళ్లెంలో అందించింది

మరి ఇప్పుడు ఏమైంది ?

మాస్ సినిమా దారి తప్పుతోంది. మారుతున్న ఆడియన్స్ అభిరుచులకు తగ్గట్టు కొత్త కథలను వండలేక దర్శకులు మూసలో ఇరుక్కుంటూ ఇటు నిర్మాతల డబ్బుని అటు ప్రేక్షకుల విలువైన సమయాన్ని రిస్క్ లో పెడుతున్నారు. ఈ ఏడాది వచ్చిన వాటిలో ప్రముఖంగా వినయ విధేయ రామ, రూలర్ ల గురించి చెప్పుకోవచ్చు. అభిమానులు, సినిమా ప్రేమికులను విచక్షణను చాలా తక్కువ అంచనా వేసి అరిగిపోయిన ఫార్ములాలో పదే పదే అవే కథలను తిప్పి తిప్పి తీయడం వల్ల ఎలాంటి ఫలితం దక్కుతుందో ఇలాంటివి ప్రత్యక్షంగా నిరూపిస్తున్నాయి. రామ్ చరణ్ ఏకంగా సారీ చెబుతూ ప్రెస్ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే వినయ విధేయ రామ ఎంత దారుణ పరాజయమో అర్థమవుతుంది. నిన్న వచ్చిన రూలర్ ని సైతం సోషల్ మీడియాతో సహా ప్రతి చోట అందులో ఉన్న నాసిరకం కంటెంట్ గురించి ఎండగట్టని వాళ్ళు లేరు. ఆ స్థాయిలో నెగటివ్ ఫీడ్ బ్యాక్ తెచ్చేసుకుంది. హీరోయిజం అంటే ఫలానా పరిమితుల మధ్యే ఉండాలన్న ఆలోచనే ఇలాంటి డిజాస్టర్లు వచ్చేలా చేస్తోంది

మాస్ సినిమాలకు కాలం చెల్లినట్టేనా ?

ఖచ్చితంగా కాదు. సినిమా బ్రతికి ఉన్నంత కాలం మాస్ సినిమాలకుండే ఆదరణే వేరు. ఇప్పటి తరం ఆలోచనలకు అనుగుణంగా వాటిని అప్ డేట్ చేసుకుని సరైన రీతిలో తీస్తే మళ్ళీ బ్రహ్మాండమైన ఫలితాలు దక్కుతాయి. గుణశేఖర్ ఒక్కడు క్లాసిక్ గా నిలవడానికి కారణం అందులో గూస్ బంప్స్ ఇచ్చే మాస్ ఎపిసోడ్సే. రాజమౌళి బాహుబలి వెయ్యి కోట్ల ప్రభంజనం సృష్టించడానికి కారణం కేవలం గ్రాఫిక్సో భారీ బడ్జెటో కాదు. ఎమోషన్ ని సరైన రీతిలో ప్రెజెంట్ చేస్తూ మాస్ వెర్రెక్కిపోయేలా తీర్చిదిద్దిన కథనం. రేపు ఆర్ఆర్ఆర్ లో రాజమౌళి వీటికే పెద్ద పీట వేస్తాడు.

రంగస్థలంలో ఉన్నది అల్ట్రా మాడ్రన్ స్టోరీ కాదు. ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం ఓ మారుమూల పల్లెటూరిలో జరిగినట్టు సుకుమార్ రాసుకున్న ఓ ప్రతీకార కథ. అందులో మసాలా అంశాలకు లోటే ఉండదు. అయినా చాలా చోట్ల బాహుబలికి ధీటుగా రికార్డులు కొల్లగొట్టింది. ఇది వచ్చి రెండేళ్లు కూడా కాలేదు. ఏబిసి సెంటర్ల తేడా లేకుండా సునామి చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటుంది. సరైన భావోద్వేగాలు లేకుండా కేవలం హీరోల ఇమేజ్ ని గుడ్డిగా ఆధారం చేసుకుని సినిమాలు తీస్తూ పోయినంత కాలం ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తూనే ఉంటారు

పరిష్కారం లేదా ?

లేకేం. బ్రహ్మాండంగా ఉంది. కాకపోతే మార్పు రావలసింది వచ్చింది చూసేవాళ్ళలో కాదు. తీసేవాళ్ళలో. ఇప్పటికే ఎన్నో ధియేటర్లు నిర్వహణ భారమైపోయి షాపింగ్ కాంప్లెక్స్ లుగా ఫంక్షన్ హాల్స్ గా మారిపోయాయి. ఇప్పటికీ నగరాలు జిల్లా కేంద్రాల్లో సింగల్ స్క్రీన్ల కౌంట్ విపరీతంగా పడిపోయింది. మల్టీ ప్లెక్సులు నిర్వహించేది కార్పోరేట్ సంస్థలు కాబట్టి వాటి మనుగడకు వచ్చిన ఇబ్బంది ఇప్పటికైతే ఏమి లేదు. మరోవైపు డిజిటల్ విప్లవం పరిశ్రమ మనుగడకు పెను సవాల్ గా మారుతోంది. సినిమాలను తలదన్నే స్థాయిలో వెబ్ సిరీస్ లు హిట్ అయిపోతూ నట్టింట్లోకే వినోదాన్ని చాలా తక్కువ ధరకు అందిస్తున్నాయి.

ఏడాదికి వెయ్యి కడితే చాలు ప్రైమ్ లాంటి యాప్స్ వేల కొద్ది సినిమాలను అద్భుతమైన నాణ్యతతో స్మార్ట్ టీవీలు ఫోన్లలో కుమ్మరిస్తున్నాయి. వీటిని తట్టుకుని పోరాడాలి అంటే ఫార్ములా సినిమాలకు స్వస్తి పలకాలి. అన్ని వర్గాలు మెప్పించే యునివర్సల్ కంటెంట్ రూపొందించే విధంగా కథకులు కలాలకు పదును పెట్టాలి. అది జరగనంత కాలం వినయవిదేయరామలు, రూలర్లు, ఇంటెలిజెంట్లు దాడి చేస్తూ ప్రేక్షకుల సహనంతో ఆడుకుంటూ థియేటర్ల మీద విరక్తి కలిగేలా చేస్తాయి. అందుకే సృజత్మకతకు పెద్ద పీట వేసిననాడు ఇండస్ట్రీ నాలుగు కాలాల పాటు పచ్చగా ఉంటుంది.

చివరి మాట

దక్షిణాది ప్రజలకు ప్రధాన వినోద సాధనం సినిమానే. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు, తమిళనాడులో ఇది మరీ ఎక్కువ స్థాయిలో ఉంది. కేరళ, కర్ణాటకలో చూసుకుంటే మనం ప్రేమించినంతగా సినిమాను వాళ్ళు నెత్తిన బెట్టుకోరు. అందుకే అక్కడి మార్కెట్ చాలా పరిమితంగా ఉంటుంది. కాని మన కేస్ అలా కాదు. బడ్జెట్ స్థాయి పెరిగిపోతోంది. కేవలం డిజిటల్ హక్కులే 50 కోట్ల దాకా పలికే స్థాయిలో టాలీవుడ్ రేంజ్ ఎక్కడికో వెళ్ళింది. ఇది ఇక్కడితో ఆగకూడదు.

మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాలను మెప్పించేలా నవ్యత వైపు అడుగులు వేయాలి. ఒకప్పుడు బాహుబలి చూసేందుకు సైతం ఈగో అడ్డం వచ్చిన బాలీవుడ్ ఖాన్లు ఇప్పుడు దాన్నే కీర్తిస్తూ హైదరాబాద్ వచ్చి తమ హిందీ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకుంటున్నారు. అది తెలుగువాడి సినిమా సత్తా. అందుకే దీన్ని నిలబెట్టుకునే దిశాగా రచయితలు, దర్శకులు, నిర్మాతలు అడుగులు వేసినప్పుడు మళ్ళీ ఇంకో స్వర్ణయుగం మొదలువుతుంది. అది ప్రేక్షకుల చేతుల్లో లేదు. కళాకారుల ఆలోచనల్లో ఉంది

Written By — రవీంద్రనాథ్ శ్రీరాజ్