iDreamPost
android-app
ios-app

మనీష్ సిసోడియా గెలుపుతో ఊపిరి పీల్చుకున్న “AAP”

మనీష్ సిసోడియా గెలుపుతో ఊపిరి పీల్చుకున్న “AAP”

AAP ని ఢిల్లీ ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ సర్వ శక్తులు ఒడ్డినా AAP విజయాన్ని అడ్డుకోలేక పోయింది.. దేశ రాజధానిలో పాగా వేయాలన్న మోడీ అమిత్ షా ఆశలపై ఢిల్లీ ఓటర్లు నీళ్లు చల్లారు..  అరవింద్ కేజ్రీవాల్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమైన ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఢిల్లీ శాసనసభను రద్దు చేశారు. సాంప్రదాయం ప్రకారం కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అరవింద్ కేజ్రీవాల్‌ను ఆహ్వానించనున్నారు. 

అయితే AAP గెలిచినా సరే ఆ పార్టీలో కేజ్రీవాల్ తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా, ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన మనీష్ సిసోడియాకు మాత్రం గెలుపు తేలికగా చిక్కలేదు..గంజ్ నియోజకవర్గంలో పోటీ చేసిన మనీశ్, బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నెగీతో హోరాహోరీగా తలపడ్డారు. రౌండ్ రౌండ్ కి ఆధిక్యం చేతులు మారుతూ వచ్చి గెలుపు ఇరువురి మధ్య దోబూచులాడింది..

ఒకానొక దశలో రవీందర్ సింగ్ పై 2000 కు పైగానే ఓట్ల వ్యత్యాసంతో వెనుకపడిన మనీష్ సిసోడియా ఓడిపోతారేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఓట్ల లెక్కింపులో ఆధిక్యం చేతులు మారుతూ రాగా చివరి రౌండ్లలో పుంజుకున్న సిసోడియా 3571 ఓట్ల తేడాతో రవీందర్ సింగ్ నెగీపై విజయం సాధించారు. దీంతో AAP వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి.

భారీ గెలుపుపై కన్నేసిన AAP ప్రస్తుతం 45 స్థానాల్లో గెలుపొందగా, మరో 18 స్థానాల్లో లీడింగ్ లో ఉంది.. బీజేపీ 5 స్థానాల్లో గెలుపొంది, 2 స్థానాల్లో లీడింగ్ లో ఉంది. దీంతో మూడోసారి ముఖ్యమంత్రిగా ఢిల్లీ పీఠాన్ని అధిరోహించబోతున్న కేజ్రీవాల్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.