Idream media
Idream media
యోగా గురువు, పంతజలి ఆయుర్వేద్ లిమిటెడ్ సహా వ్యవస్థాపకుడు బాబా రాందేవ్‌కు మహా రాష్ట్ర ప్రభుత్వం షాకిచ్చింది. కోవిడ్–19 నివారణ మందులంటూ మంగళవారం పంతజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కరొనిల్, శ్వాసరి అనే పేర్లలో ఆయుర్వేద ఔషధాలను విడుదల చేసింది. ఈ మందులు వాడితే కరోనా సోకిన వారికి నయం అవుతుందని స్వయంగా బాబా రాందేవ్ ప్రకటించారు. అయితే ఈ మందుల తయారీ, పరిశోధనా, అనుమతి పత్రాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తూ అప్పటి వరకూ మందుల విక్రయాలపై ప్రచారం చేయరాదంటూ ఆదేశించింది.
ఈ క్రమంలో తాజాగా మహా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బాబా రాందేవ్ విడుదల చేసిన కరోనా నివారణ మందులను మహారాష్ట్రలో విక్రయించడంపై నిషేధం విధించింది. పంతజలి ఆయుర్వేద్ లిమిటెడ్ కరొనిల్, శ్వాసరి ఔషధాలను ప్రచారం చేసినా, విక్రయించినా చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ప్రకటించారు. ఈ మందులకు కేంద్ర ఆయూష్ మంత్రిత్వ శాఖ అనుమతి మంజూరు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. నకిలీ మందుల అమ్మకాలను మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించదంటూ బాబా రాందేవ్‌ను హెచ్చరించారు.
మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఎమ్మెల్యే రామ్‌దాస్ కదమ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కరోనా చికిత్స కోసం తయారు చేసిన ఔషధాన్ని ఎలాంటి తనిఖీలు చేయకుండా నకిలీదని ఎలా నిర్ణయిస్తారని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బాబా రాందేవ్ ఎప్పటి నుంచో దేశానికి సేవ చేస్తున్నారని కొనియాడారు.