భర్త కోసం తపించే ఓ భార్య కథ – Nostalgia

90వ దశకం ప్రారంభంలో జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవివిల తర్వాత ఆ స్థాయిలో హాస్య చిత్రాలలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. రాజేంద్రుడు గజేంద్రుడుతో మొదలైన ఈయన ప్రస్థానం ఎక్కడి దాకా వెళ్లిందంటే హీరో ఎవరో చూసుకోకుండా పోస్టర్ లో కేవలం ఎస్వికె పేరు ఉన్నందుకు ఆ సినిమాలకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మాయలోడు, వినోదం లాంటి ఆణిముత్యాలు ఇప్పుడు చూసినా మనసారా నవ్వుకునేలా ఉంటాయి. అలాంటి డైరెక్టర్ ఒక ఎమోషనల్ డ్రామాతో ప్రేక్షకులను మెప్పించడం ఊహించగలమా. కానీ అయన అలాంటివి కూడా చేసి విజయం సాధించారు. ఓ ఉదాహరణే మావిచిగురు

1994లో ‘శుభలగ్నం’ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డికి స్టార్ హీరోల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. అప్పటికే కృష్ణగారితో చేసిన ‘నెంబర్ వన్’ సూపర్ హిట్ కావడంతో అందరికీ గట్టి నమ్మకం కుదిరింది. కానీ బాలకృష్ణ ‘టాప్ హీరో’, నాగార్జున ‘వజ్రం’లు ఊహించని విధంగా డిజాస్టర్లు కావడంతో ఎస్వి ఆలోచనలో పడ్డారు. కథానాయకుల ఇమేజ్ లకు తగ్గట్టు సినిమాలు తీస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలిసి వచ్చింది. మళ్ళీ తన పాత స్కూల్ కు వచ్చి ‘ఘటోత్గచుడు’ చేస్తే అది పర్వాలేదనిపించుకుంది. కానీ శుభలగ్నంతో మహిళా ఆదరణ గొప్పగా దక్కించుకున్న ఎస్వికి మళ్ళీ వాళ్లనే మెప్పించే లక్ష్యంతో తయారు చేసుకున్న కథే మావిచిగురు

సీత(ఆమని), మధు(జగపతిబాబు)అన్యోన్యమైన దంపతులు. భర్త మీద విపరీతమైన ప్రేమతో ఏ ఆడది కనిపించినా తన మొగుడిని ఎగరేసుకుపోతుందేమో అన్నంత భయంతో ఉంటుంది. సుధ(రంజిత)వచ్చాక వీళ్ళ జీవితం మారిపోతుంది. ఆ అమ్మాయికి ఎలాంటి ఉద్దేశాలు లేకపోయినా సీత వీళ్లిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందన్న తరహాలో ప్రవర్తించి ఆఖరికి వాళ్లకు పెళ్లి జరిగేలా చేస్తుంది. దీనికి కారణం సీత చావుకు దగ్గరగా ఉన్న వ్యాధేనని చివరిలో కన్నుమూశాక మధుకు తెలుస్తుంది. 1996 మే 30న విడుదలైన మావిచిగురు మహిళా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఎస్వి పాటలు ఆడియో పరంగానూ గొప్ప విజయం అందుకున్నాయి. జగపతిబాబు,రంజిత , గాయని చిత్రలకు నంది పురస్కారాలు దక్కాయి. ఎమోషనల్ డ్రామాలో మావిచిగురుది ప్రత్యేక స్థానం

Also Read : యువత భావాలకు వెండితెర రూపం – Nostalgia

Show comments