కామెడీ క్లాసిక్ కి లాక్ డౌన్ టచ్

థియేటర్లు తెరుచుకున్నప్పటికీ కమర్షియల్ గా ఇప్పుడు హాళ్లలో భారీగా ఆడే కెపాసిటీ లేని వాటిని ఇప్పటికీ ఓటిటిలకే ఇచ్చేస్తున్నారు నిర్మాతలు. అందులో ఒకటి వివాహ భోజనంబు. కమెడియన్ సత్య హీరోగా రూపొందిన ఈ సినిమా అప్పుడెప్పుడో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ జంధ్యాల క్లాసిక్ టైటిల్ వాడుకున్నప్పటికీ కథ మాత్రం ఇంకో నట కిరీటి చిత్రం నుంచి తీసుకోవడం గమనార్హం. బంధువులొస్తున్నారు జాగ్రత్తని రెగ్యులర్ మూవీ లవర్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. శరత్ దర్శకత్వంలో వచ్చిన ఈ ఎంటర్ టైనర్లో అప్పటి హాస్యనటులంతా ఉన్నారు. ఇంటికి రాబందుల్లా బంధువులు వస్తే హీరో ఎదురుకునే పరిణామాలు అందులో చాలా చక్కగా చూపించారు.

ఇప్పుడు దానికి కొంచెం దగ్గరగా అనిపించే లైన్ కి లాక్ డౌన్ కాన్సెప్ట్ ముడిపెట్టి దర్శకుడు రామ్ అబ్బరాజు ఈ వివాహ భోజనంబుని రూపొందించారు. ఈ నెల 13న సోనీ లివ్ యాప్ లో ఇది విడుదల కాబోతోంది. ఈ ఓటిటిలో రాబోతున్న మొదటి తెలుగు మూవీ ఇదే. ఇప్పటికే ట్రైలర్ మంచి అంచనాలు రేపింది. సంతోషంగా పెళ్లి చేసుకున్న హీరో ఇంట్లో బంధువులు వెళ్ళిపోదాం అనుకునే టైంలో ప్రధాని నరేంద్ర మోడీ కరోనా వల్ల లాక్ డౌన్ ప్రకటిస్తారు. దీంతో అందరూ అదే ఇంట్లో స్ట్రక్ అయిపోతాడు. దెబ్బకు వాళ్ళ పోషణ భారమంతా హీరో మీద పడుతుంది. చిరుద్యోగి కావడంతో మాములు ఇబ్బందులు రావు.

గత ఏడాది జరిగిన సంఘటనలు ఆధారంగా చేసుకుని దీన్ని రూపొందించారు. ప్రమోషన్ చూస్తే కంటెంట్ ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది హాస్యనటులు హీరోలు కావడం కొత్తేమి కాదు. బ్రహ్మానందం, బాబు మోహన్, ఆలీ, సునీల్, సప్తగిరి, షకలక శంకర్ ఇలా అందరూ కథానాయకులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నవాళ్ళే. ఇప్పుడు సత్య కూడా లక్ ని పరీక్షించుకోబోతున్నాడు. కార్పొరేట్ సంస్థ అయినప్పటికీ సౌత్ ఓటిటి ఎంట్రీని కాస్త ఆలస్యం చేసుకున్న సోనీ లివ్ ఈ మొదటి ప్రీమియర్ మీద చాలా నమ్మకమే ఉంచుతోంది. దానికి తగ్గట్టే పబ్లిసిటి కూడా గట్టిగా చేస్తున్నారు. మరి ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి

Also Read : సినిమా ప్రేమికులకు శుభవార్తలు

Show comments