లాక్ డౌన్ పొడిగింపు.. తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..

కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్ డౌన్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడిన కెసిఆర్ లాక్ డౌన్ పై స్పష్టత ఇచ్చారు. మూడు రోజుల క్రితమే లాక్ డౌన్ ను 30 వరకు కొనసాగించాలని ఆయన డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ప్రస్తుత పరిస్థితుల్లో లాక్ డౌన్ పొడిగింపు తప్ప కరోనా కట్టడి కి మరో మార్గం లేదని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 30వ తేదీ తర్వాత దశల వారీగా తెలంగాణలో లాక్ డౌన్ ను ఎత్తివేస్తామని తెలిపారు. ఈ పదిహేను రోజులు తెలంగాణ ప్రజలు ఎక్కడి వారు అక్కడే ఉండాలని కోరారు. ఏ మతం వారైనా సమూహ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని విన్నవించారు. వైరస్ నియంత్రణలోకి వచ్చిందని భావనతో ఎత్తివేసిన సింగపూర్, జపాన్ దేశాల్లో తిరిగి పూర్వ స్థితికి వచ్చిందని కేసీఆర్ గుర్తు చేశారు.

తెలంగాణలో ఇప్పటి వరకు 503 కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇందులో 14 మంది చనిపోయారని చెప్పారు. 96 మంది కోరుకొని ఇంటికి వెళ్లారని తెలిపారు. ప్రస్తుతం 393 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేసీఆర్ వెల్లడించారు. ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఎలాంటి పరీక్ష లేకుండా తదుపరి క్లాసులకు ప్రమోట్ చేస్తున్నట్టు వెల్లడించారు. పదోతరగతి పరీక్షలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలకు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ కేబినెట్ నిర్ణయాలను, రాష్ట్రానికి కావాల్సిన సహాయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు కేసీఆర్ చెప్పారు. ఒకరిద్దరు రెడ్ జోన్ లలోనే లాక్ డౌన్ కొనసాగించాలని కోరగా.. మెజారిటీ రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగించాలని ప్రధాని మోదీ ని కోరినట్లు కేసీఆర్ వెల్లడించారు.

Show comments