iDreamPost
iDreamPost
కరోనా కరాళనృత్యం చేస్తుంటే అనేక మంది పెద్ద మనసు చేసుకుని స్పందిస్తున్నారు. చాలామంది ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు, తమ తమ నియోజకవర్గాల్లో ప్రజల కనీస అవసరాలు తీర్చేందుకు కష్టపడుతున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ అలాంటి ఎమ్మెల్యేలకు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా మహిళా నేతల్లో పలువురి తీరు ఇప్పుడు ఆకట్టుకుంటోంది. అందులో ఆంధ్రప్రదేశ్ఉ పముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ,రోజా,జొన్నలగడ్డ పద్మావతి,విడుదల రజిని,తెలంగాణాకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే సీతక్కతో తదితర నేతలున్నారు.
చిన్నమేరంగి జమీందార్ శత్రుచర్ల వారి కోడలు , ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలతో మమేకమయ్యి వారికి చేస్తున్న సేవలను పలువురు ప్రశంసిస్తున్నారు. లాక్ డౌన్ వేళ తన సొంత నియోజకవర్గంలో ఉన్న ఆమె స్వయంగా వంట వండి అందరికీ పంచడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అంతా అభినందిస్తున్నారు. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు అవసరం అయినప్పుడు ఆదుకోవాలనే బాధ్యతను స్వీకరించిన తీరుని కొనియాడుతున్నారు. తన భర్త పరీక్షిత్ రాజుతో కలిసి వంట వండి, ఇంటింటీకి పంపిణీ చేస్తున్న ప్రయత్నాన్ని పార్టీలకు అతీతంగా మెచ్చుకుంటున్నారు. ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఆమె సేవా దృక్పథంత పాటు సామాన్యుల పట్ల ప్రదర్శిస్తున్న క్షేత్రస్థాయి శ్రద్ధ అందరికీ ఆదర్శనీయం అంటున్నారు..ఆకలితో ఉన్న వారి కడుపు నింపేందుకు స్వయంగా డిప్యూటీ సీఎం రంగంలో దిగిన తీరు విశేషంగా మారుతోంది.
మరో సీనియర్ ఎమ్మెల్యే ఆర్కే రోజా కూడా అదే స్థాయిలో వ్యవహరిస్తున్నారు, వరుసగా రెండోసారి విజయం సాధించిన నగరి నియోజకవర్గ ప్రజలకు ఆమె అందిస్తున్న సేవలను ప్రజలు కొనియాడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండరని రోజా ప్రత్యర్థులు కొందరు చేసే విమర్శలకు సమాధానంగా ఇప్పడు కష్టకాలంలో స్వయంగా ఆమె క్షేత్రస్థాయిలో దిగి చేస్తున్న సేవలు నిలుస్తున్నాయని అంతా చెబుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ సహాయం అందరికీ అందించే ఏర్పాట్లు చేస్తూనే రెండోవైపు వ్యక్తిగతంగానే రోజా చొరవ ప్రదర్శిస్తుండడం మెచ్చుకోదగ్గ విషయమని అంతా చెబుతున్నారు.
వారితో పాటుగా చిలకలూరిపేట నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న విడదల రజనీ, సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలా ఏపీలో అధికార పార్టీకి చెందిన మహిళా నేతలు స్వయంగా రంగంలో దిగి అందిస్తున్న సర్వీసు చిన్న విషయం కాదన్నది పలువురి అభిప్రాయం. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియాలో వారికి అభినందనలు లైకుల రూపంలో వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా అదే రీతిలో తెలంగాణాకు చెందిన విపక్ష కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క కార్యాచరణను అంతా కొనియాడుతున్నారు. మారుమూల ప్రాంతాల్లో కాలినడకన వాగులు, వంకలు దాటుతూ సీతక్క చేస్తున్న సేవలకు ప్రశంసలు దక్కుతున్నాయి.
సీతక్కకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మావోయిస్టు జీవితానికి స్వస్తి చెప్పి పోలీసుల ముందు లొంగిపోయిన సీతక్క తొలిసారి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున బరిలో దిగి టీఆర్ఎస్ ని ఎదురొడ్డి విజయం సాధించారు. పూర్తి అటవీ ప్రాంతమైన “ములుగు” నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్క తనను నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలు ఇప్పుడు కష్టాల్లో ఉండడంతో ఆమె దానికి తగ్గట్టుగా కష్టపడుతున్నారు. మారుమూల గిరిజన ప్రాంతం ములుగు నియోజకవర్గంలో ఆమె అందిస్తున్న సేవలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. మహిళా ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా చాలామంది ఎమ్మెల్యేలకు సాధ్యం కానంత చొరవ ప్రదర్శిస్తున్నారు. నిత్యావసరాలను ఎడ్ల బళ్ల మీద వేసుకుని అన్ని గ్రామాలకు చేర్చేందుకు కాలినడకన కూడా ఆమె సాగుతున్న తీరు పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేగా ఆమె తీరుని సోషల్ మీడియాలో షేర్లు ద్వారా అభినందనలు తెలుపుతున్నారు.
మహిళా ఎమ్మెల్యేలు భిన్నమైన పరిస్థితుల్లో అందిస్తున్న సేవలు గుర్తించదగ్గవేనని చెప్పాలి. వారికి తోడుగా అనేక మంది ఇతర ఎమ్మెల్యేలు కూడా తమ తమ స్థాయిల్లో సేవలందిస్తున్నారు. అందరూ ఈ నేతల స్పూర్తితో సాగితే మరింత మందికి మేలు చేసినవారవుతారని అంతా భావిస్తున్నారు.