iDreamPost
iDreamPost
ఈ మధ్య కాలంలో ఏ ఇండియన్ వెబ్ సిరీస్ కు రాని హైప్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ద్వారా విడుదలైన పాతాళ్ లోక్ దక్కించుకుంది . ట్రైలర్ నుంచే అంచనాలు పెంచేసిన దీని మీద ఇప్పటికే ఆన్ లైన్ తో పాటు సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరుగుతోంది. సినిమా మేకింగ్ ని తలదన్నే క్వాలిటీతో, కంటెంట్ తో రూపొందుతున్న ఇలాంటి సిరీస్ ల మీద ప్రేక్షకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. అందులోనూ క్రైమ్ బ్యాక్ డ్రాప్ కావడంతో చూసే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. మరి ఇంత బిల్డప్ ఇచ్చిన పాతాళ్ లోక్ దానికి తగ్గట్టే లేదా అనేది రివ్యూలో చూద్దాం.
కథ
ఢిల్లీలో ఓ పోలీస్ స్టేషన్ లో ఉండే ఇన్స్ పెక్టర్ హతిరాం చౌదరి(జైదీప్ ఆహ్లావట్)అప్పటిదాకా ఎలాంటి ప్రత్యేక గుర్తింపు లేక ఒక సగటు ఉద్యోగిగా రోజులు వెళ్ళదీస్తూ ఉంటాడు. మీడియా జర్నలిస్ట్ సెలబ్రిటీగా పేరున్న సంజీవ్ మెహ్రా(నీరజ్ కబి)ని హత్య చేసేందుకు ఓ నలుగురు కరుడుగట్టిన గ్యాంగ్ వేసిన స్కెచ్ ని ఇంటలిజెన్స్ టీం ముందే పసిగట్టి వాళ్ళను అరెస్ట్ చేసి హతిరాం స్టేషన్ లో ఖైదు చేస్తుంది. దీని విచారణ బాధ్యతలు అతనికే అప్పగిస్తాడు డిసిపి భగత్(విపిన్ శర్మ).
దీన్నో సువర్ణావకాశంగా భావించిన హతిరాం చాలా రిస్క్ తీసుకుని కేసు తాలుకు కూపీ లాగేందుకు వివిధ ప్రదేశాలకు వెళ్తాడు. అయితే అతనికి తెలియకుండానే కొన్ని పరిణామాలు చోటు చేసుకుని దానికి బాద్యత వహించాల్సి రావడంతో చివరికి సస్పెండ్ అవుతాడు. అయినా కూడా డ్యూటీ మానకుండా మఫ్టీలో ఈ కుట్ర మూలాలు ఉన్న చిత్రకూట్ కు వెళ్తాడు. ఎప్పటికప్పుడు హతిరాంకు సహాయంగా అతని కొలీగ్ అన్సారి(ఇష్వక్ సింగ్)ఢిల్లీ నుంచే కమ్యునికేట్ చేస్తాడు. ఆ నలుగురి వెనుక దారుణమైన నేర చరిత్ర ఒక్కొక్కటిగా బయటికి వస్తుంది. చాలా పెద్ద తలకాయలు దీని వెనుక ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంతకీ హతీరాం అసలు నేరస్తులను పట్టుకున్నాడా లేదా అనేదే కీలకమైన పాయింట్
నటీనటులు
ఎలాంటి ఆకర్షణ గ్లామర్ లేని ఒక సాధారణ నటుడు జైదీప్ ఆహ్లావట్. కాని ఇంత పెద్ద సిరీస్ ని తన పెర్ఫార్మన్స్ తో నిలబెట్టేశాడు. దాదాపు ప్రతి ఫ్రేమ్ లో కనిపించే తన ఉనికిని ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకునే స్థాయిలో హతిరాంగా ఆ పాత్రకు ప్రాణం పోశాడు. మొదలైన కాసేపటికే తనదైన సహజ నటనతో ఆకట్టుకోవడం మొదలుపెడతాడు. యాక్టర్ గా కన్నా పక్కింట్లో ఉన్న పోలీస్ గా అతను మనకు అనిపించడానికి కారణం కేవలం అతని ప్రతిభే. కెరీర్ లో ఇప్పటిదాకా భారీ సంఖ్యలో సినిమాలు చేయకపోయినా ఒక్క ఈ పాతాళ్ లోక్ వంద మెట్ల ప్రమోషన్ ఒకేసారి ఇచ్చింది.
తర్వాత ఆకట్టుకునేది నీరజ్ కబి. చాలా సెటిల్డ్ గా నటించి సెలబ్రిటీ జర్నలిస్ట్ గా మెప్పించాడు. నలుగురి క్రిమినల్ గ్యాంగ్ లో చూడగానే భయపెట్టేలా ఉన్న అభిషేక్ బెనర్జీని ఇప్పట్లో మర్చిపోవడం కష్టం. ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ టైప్ రైటర్ లో సైకో కిల్లర్ గా భయపెట్టిన ఇతను ఇందులో హతోడా త్యాగిగా అంతకు పదింతలు మించిన ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో ఆల్ టైం బెస్ట్ ఇచ్చేశాడు. ప్రధానంగా చెప్పుకోవాల్సింది వీళ్ళ గురించే. క్యాస్టింగ్ చాలా భారీగా ఉంది. ప్రతిఒక్కరి గురించి ప్రస్తావించేందుకు సాధ్యపడనంతగా ఇందులో తారాగణం ఉంది. అందరూ సుపరిచితులే కానప్పటికీ మనకు నటీనటుల కన్నా ఆయా పాత్రలే కనిపిస్తాయి.
డైరెక్టర్ అండ్ టీం
దర్శకులు అవినాష్ అరుణ్-ప్రోసిత్ రాయ్ ల ద్వయం తొమ్మిది ఎపిసోడ్ల పాటు సాగే ఆరున్నర గంటల ఈ సుదీర్ఘమైన సిరీస్ ని విసుగు రాకుండా, ఆసక్తి సడలకుండా నడిపించిన తీరు చివరిదాకా చూసేలా చేయడంలో సక్సెస్ అయ్యింది. స్లోగా మొదలుపెట్టి కొద్దిసమయంలోనే గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తో పాటు పాత్రలను తీర్చిద్దిద్దిన తీరు, వాటికి లింక్స్ ని సెట్ చేసుకున్న విధానం ఆకట్టుకుంటుంది. కొన్ని బోల్డ్ సీన్స్, అవసరం లేకపోయినా సహజత్వం పేరుతో ఇరికించిన కొన్ని దృశ్యాలు మినహా పాతాళ్ లోక్ గురించి ఎక్కువ ఫిర్యాదు చేసే అవకాశం ఇవ్వలేదు ఈ డైరెక్టర్ డ్యూయో. సిటీ వాతావరణానికి దూరంగా మనకు తెలియని ఒక వెనుకబడిన నేర ప్రపంచాన్ని, దానికి దారి తీసిన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా చిత్రీకరించిన తీరు అబ్బురపరుస్తుంది. దళితులను కులం కార్డుతో వాడుకునే రాజకీయ నాయకులు, బందిపోటు దొంగల దురాగతాలను ఇంత డిటైల్డ్ గా ఈ మధ్య కాలంలో ఎవరూ చిత్రీకరించలేదన్నది వాస్తవం.
రచయితలు సుదీప్-సాగర్-హార్దిక్-గుంజిత్ చేసిన కృషి సిరీస్ ఆద్యంతం కనిపిస్తుంది. దాంతో పాటుగా వాళ్ళు చేసిన హోమ్ వర్క్, పాత్రలు జరుగుతున్న సంఘటనలకు పురాణాలకు లింక్ పెట్టిన వైనం దర్శకుల పనిని సులభతరం చేసింది. నరేన్ చందావర్కర్ – బెనెడిక్ట్ టైలర్ సంగీతం డార్క్ క్రైమ్ కు కావాల్సిన మూడ్ చివరిదాకా కొనసాగించింది. అవినాష్ అరుణ్ – సౌరభ్ గోస్వామి ఛాయాగ్రహణం హై స్టాండర్డ్ సినిమాకు ఏమాత్రం తీసిపోని రీతిలో ఉంది. సంయుక్త కాజా ఎడిటింగ్ ఇంత పెద్ద సిరీస్ ని బోర్ కొట్టించకుండా సాగిందంటే దాని వెనుక తన కృషి చిన్నదని చెప్పలేం. విరాట్ కోహ్లీ భార్య కం హీరోయిన్ అనుష్క శర్మ ఆరుగురు నిర్మాతల్లో ఒకరు. నేచురల్ లొకేషన్స్ లో షూట్ చేయడంతో పాటు ప్రొడక్షన్ పరంగా ఎక్కడా రాజీ అనే మాటకు తావివ్వకుండా భారీగా ఖర్చు పెట్టారు
చివరి మాట
లాక్ డౌన్ టైంలో విసుగు రాని ఆలోచింపజేసే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ కావాలంటే నిరభ్యంతరంగా పాతాళ్ లోక్ ని ఛాయస్ గా తీసుకోవచ్చు. దారుణమైన నేరాలు ఘోరాలు వాటి వెనుక కారణాలను స్పృశిస్తూనే వ్యవస్థలోని లోపాలను మనుషుల్లోని బలహీనతలను వాడుకుని కొందరు ఎలా ఎదిగిపోతున్నారో ఇందులో చూపించిన తీరు చాలా సేపు ఆ ప్రపంచం నుంచి మనల్ని బయటికి రానివ్వదు. కుటుంబంతో సహా చూసేందుకు అవకాశం లేని ఈ సిరీస్ ని పిల్లలకు సైతం దూరంగా ఉంచడం మంచిది. ప్రెజెంటేషన్ రాగా ఉండటంతో అక్కడక్కడ చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. ట్రూ కంటెంట్ ని ఇష్టపడేవాళ్ళను పూర్తిగా మెప్పించే పాతాళ్ లోక్ ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ సిరీస్ గా చెప్పుకోవచ్చు